గ్రూపు దశలోనే భారత్‌, పాక్‌ ఫైట్‌

ABN , First Publish Date - 2021-07-17T08:05:54+05:30 IST

భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే అభిమానులకుండే ఉత్సాహమే వేరు. చివరిసారిగా 2019 వన్డే వరల్డ్‌క్‌పలో తలపడిన ఈ దాయాది జట్లు ఇప్పుడు మరోసారి క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి.

గ్రూపు దశలోనే భారత్‌, పాక్‌ ఫైట్‌

ఒకే పార్శ్వంలో రెండు జట్లు

టీ20 ప్రపంచకప్‌ డ్రా విడుదల


దుబాయ్‌: భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే అభిమానులకుండే ఉత్సాహమే వేరు. చివరిసారిగా 2019 వన్డే వరల్డ్‌క్‌పలో తలపడిన ఈ దాయాది జట్లు ఇప్పుడు మరోసారి క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి. ఈ ఏడాది టీ20 ప్రపంచక్‌పలో భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఐసీసీకి  కాసుల వర్షం కురిపించే ఈ రసవత్తర పోరును ఆరంభ దశలోనే తిలకించే అవకాశం ఉంది. శుక్రవారం ఈ మెగా టోర్నీకి సంబంధించి తొలి రౌండ్‌, సూపర్‌ 12లోని రెండు గ్రూప్‌ల వివరాలను ప్రకటించారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు ఒమన్‌, యూఏఈలో  ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. అయితే షెడ్యూల్‌ను మాత్రం ఇంకా వెల్లడించలేదు.


గ్రూప్‌ ‘2’లో భారత్‌, పాక్‌తో పాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప విజేత న్యూజిలాండ్‌, అఫ్ఘానిస్థాన్‌ కూడా చోటు దక్కించుకున్నాయి. ఇక గ్రూప్‌ 1లో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 20 వరకు ఉన్న టీమ్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా సూపర్‌ 12లోని 8 జట్లను ఎంపిక చేశారు. చివరిసారిగా భారత్‌లోనే జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై విండీస్‌ గెలిచింది. ప్రస్తుత ఆతిథ్య హక్కులు కూడా భారత్‌ దగ్గరే ఉన్నా కరోనా కారణంగా యూఏఈకి తరలింది. అలాగే దుబాయ్‌, ఒమన్‌లలోని స్టేడియాలను పరిశీలించేందుకు బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా ప్రస్తుతం అక్కడే ఉన్నారు.


తొలి రౌండ్‌ నుంచి మరో 4 జట్లు:

సూపర్‌ 12లో ఉన్న గ్రూప్‌ 1, 2ల్లో ప్రస్తుతం 8 జట్లే ఉన్నాయి. ఇంకా ఒక్కో గ్రూపులో రెండేసి.. మొత్తం నాలుగు జట్లు రావాల్సి ఉంది. ఇందుకోసం తొలి రౌండ్‌లోని గ్రూప్‌ ‘ఎ’, గ్రూప్‌ ‘బి’ల నుంచి ఎనిమిది జట్లు పోటీపడతాయి. ప్రతీ గ్రూప్‌లో మొదటి, రెండో స్థానంలో నిలిచిన జట్లు సూపర్‌ 12కు వెళతాయి. ఈ రేసులో గెలిచేందుకు గ్రూప్‌ ‘ఎ’లో శ్రీలంక, ఐర్లాండ్‌, నెదర్లాండ్‌, నమీబియా.. గ్రూప్‌ ‘బి’లో బంగ్లాదేశ్‌, ఒమన్‌, స్కాట్లాండ్‌, పపువా న్యూగినియా పోటీపడనున్నాయి. లంక, బంగ్లా తొలి రౌండ్‌కు ఇదివరకే అర్హత సాధించాయి. మిగిలిన ఆరు జట్లు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ద్వారా చేరాయి. 


గ్రూప్‌ల వివరాలు

తొలి రౌండ్‌

గ్రూప్‌ ‘ఎ’: శ్రీలంక, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, నమీబియా

గ్రూప్‌ ‘బి’: బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, పపువా న్యూగినియా, ఒమన్‌

సూపర్‌ 12 దశ

గ్రూప్‌ 1: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, గ్రూప్‌ ‘ఎ’ విజేత, గ్రూప్‌ ‘బి’ రన్నరప్‌.

గ్రూప్‌ 2: భారత్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, అఫ్ఘానిస్థాన్‌, గ్రూప్‌ ‘ఎ’ రన్నరప్‌, గ్రూప్‌ ‘బి’ విజేత.

Updated Date - 2021-07-17T08:05:54+05:30 IST