ఉల్లీ..పెరిగావా మళ్లీ?

ABN , First Publish Date - 2020-09-29T06:56:52+05:30 IST

మరోసారి ఉల్లి సామాన్యులకు కన్నీరు తెప్పిస్తోంది. నిత్యం పెరుగుతున్న ఉల్లి ధరలను చూసి జనం భయపడుతున్నారు.

ఉల్లీ..పెరిగావా మళ్లీ?

మార్కెట్‌లో కిలో రూ. 50  

వానలతో తగ్గిన దిగుబడులు 

మహారాష్ట్ర, కర్నూల్‌ నుంచి తగ్గిన సరఫరా 

పెరిగిన హోల్‌సేల్‌, రిటైల్‌ ధరలు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : మరోసారి ఉల్లి సామాన్యులకు కన్నీరు తెప్పిస్తోంది. నిత్యం పెరుగుతున్న ఉల్లి ధరలను చూసి జనం భయపడుతున్నారు. హోల్‌సేల్‌లో ఉల్లిగడ్డలను కిలోకు రూ.41-45 అమ్ముతుండగా.. రిటైల్‌లో రూ.50-55 అమ్ముతున్నారు. శంకర్‌పల్లి, మలక్‌పేట హోల్‌సేల్‌ మార్కెట్‌లో గరిష్టంగా కిలో ఉల్లి ధర రూ.45 ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.50పైనే అమ్ముతున్నారు. పదిరోజుల క్రితం హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లి కిలో ధర రూ. 25-30కు విక్రయించగా.. ప్రస్తుతం ధర రెట్టింపయ్యింది. సాధారణంగా ఈ సీజన్‌లో ఉల్లి ధరలు పెరగడం సామాన్య విషయమే అయినప్పటికీ ఈస్థాయిలో పెరగడం అసామాన్య విషయమే. హోల్‌సేల్‌ మార్కెట్‌లో విపరీతంగా ధర పెరగడంతో అవి కాస్త రిటైల్‌ మార్కెట్లకు వచ్చేసరికి తడిసి మోపెడవుతుంది. దీన్ని అదునుగా తీసుకుని అమ్మకందారులు కూడా తమ ఇష్టం వచ్చిన రేటుకు విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక పోవడంతో ధరలు ఉన్నట్టుండి పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేస్తున్నారు. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో మార్కెట్‌కు వచ్చే అవకాశాలున్నాయి. వచ్చేనెల పెద్దఎత్తున ఉల్లి పంట వస్తే కానీ.. ధరలు తగ్గే అవకాశం లేదు.


ఉల్లిపై వానల ఎఫెక్ట్‌..

రాష్ర్టానికి ఎక్కువగా మహారాష్ట్ర, కర్నూల్‌ నుంచే ఉల్లి వస్తుంది. ఇటీవల వర్షాల వల్ల ఉల్లిపంట దిగుబడిపై ప్రభావం పడింది. వర్షాలతో ఉల్లి మడుల్లో నీరు నిలిచి పంట చాలావరకు దెబ్బతిన్నది. తీయడానికి కూడా ఇబ్బందిగా మారింది. దిగుబడి తగ్గడంతో రాష్ర్టానికి సరఫరా కూడా తగ్గింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శంకర్‌పల్లి ఉల్లి మార్కెట్‌కు సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి ఉల్లి వస్తుంది. ఈసారి ప్రధానంగా ఎన్కతల, గొల్లపల్లి, జూలకంటి, మైలారం, చందిప్ప, కేసారం తదితర ప్రాంతాల నుంచి ఉల్లిగడ్డలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారానికి రెండు రోజులు ఆదివారం, బుధవారం మార్కెట్‌ జరుగుతుంది. పదిరోజుల క్రితం క్వింటాలు ఉల్లికి హోల్‌సేల్‌గా రూ.2500 డిమాండ్‌ పలికింది. గత ఆదివారం జరిగిన మార్కెట్‌లో హోల్‌సేల్‌గా క్వింటాలుకు రూ.3,000-3,500 అమ్ముడు పోయింది. బుధవారం జరిగిన మార్కెట్‌లో రూ.3,800-4,100 డిమాండ్‌ పలికింది. రిటైల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డలకు రూ.45 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారు. 


సామాన్యులు కొనలేని పరిస్థితి  - బాలమణి, మన్‌మర్రి 

ఉల్లి కోసేటప్పుడే కాదు.. ఇప్పుడు కొనేటప్పుడే ఏడిపిస్తోంది. వారం, పది రోజుల వ్యవధిలో ఉల్లి ధరలు అనూహ్యంగా పెరగడంతో ఉల్లిగడ్డ కొనడం మానేశాము. గత నెలలో కిలో ఉల్లి ధర రూ.25 ఉండగా.. ప్రస్తుతం రూ.50కి పెరిగింది. ధరలు పెరగడంతో మాలాంటి సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.


కరోనా కాలంలో అధిక ధరలతో తీవ్ర ఇబ్బందులు..లక్ష్మమ్మ, హిమాయత్‌నగర్‌, మొయినాబాద్‌ మండలం

కరోనా కారణంగా ఉపాధి లేక అనేక అవస్థలు పడుతున్నాం. ఇదే సమయంలో ధరలు పెరగడం దురదృష్టం. పెరుగుతున్న ధరలతో ఏమీ కొనేటట్టులేదు.. ఏమీ తినేటట్టు లేదు. ధరల పెరుగుదలను ప్రభుత్వాలు నియంత్రించలేక పోతున్నాయి. ధరలను అమాంతం పెంచడంతో కుటుంబపోషణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 

Updated Date - 2020-09-29T06:56:52+05:30 IST