మూడు రాజధానుల పేరిట..ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు

ABN , First Publish Date - 2021-06-15T09:02:41+05:30 IST

రాష్ట్రానికి మూడు రాజధానుల మాటతో ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టవద్దని రాజధాని రైతులు కోరారు. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు సోమవారానికి 545వ రోజుకు చేరుకున్నాయి

మూడు రాజధానుల పేరిట..ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ది చేయాలి

545వ రోజుకు చేరుకున్న ఆందోళనలు 


తుళ్లూరు, జూన్‌ 14: రాష్ట్రానికి మూడు రాజధానుల మాటతో ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టవద్దని రాజధాని రైతులు కోరారు. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు సోమవారానికి 545వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాష్ట్ర రాజధాని అని చెప్పిన జగన్‌... అధికారం వచ్చిన తరువాత మాట మార్చారని వారు ఆరోపించారు. ఒక సామాజిక వర్గానికి చెందిన  వారే రాజధాని అమరావతికి భూములిచ్చారని ప్రచారం చేసి.. సీఎం జగన్‌, ఆయన మంత్రులు నవ్వుల పాలయ్యారన్నారు. రాజఽధాని అమరావతి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం తాడికొండలో ఉందన్నారు. 40 శాతం మంది ఎస్సీలే రాజధానికి భూములిచ్చిన వారిలో ఉన్నారన్నారు. ఈ విషయం కూడా తెలియని వారు ఖర్మ కొద్ది పాలకులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులున్న ప్రాంతాన్ని రాజధాని కాకుండా అడ్డుకుంటున్నార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజనులు అంటూ పెయిడ్‌ ఆర్టిస్టులను బయట నుంచి రాజధాని అమరావతికి తీసుకొచ్చి మూడు రాజధానులు కావాలని దీక్షలు చేయించటం సిగ్గు చేటన్నారు. 


ఇసుక డంపింగ్‌ పేరుతో కృష్ణా కరక ట్టను బలహీన పరచాలని ప్రైవేటు కంపెనీతో కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్ర నడి బొడి బొడ్డులో అందరికి అందుబాటులో రాజధాని అమరావతి నిర్మితమవుతుంటే ఓర్చుకోలేక మూడు రాజధానులంటూ నాటాకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును ప్రజలు అడుగుతారని మూడు ముక్కల ఆట మొదలు పెట్టారని ఆరోపించారు...రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ‘‘అమరావతిని రక్షించుకుందాం.. రాష్ట్ర ప్రగతికి బాటలు వేద్దాం’’అంటూ రైతు శిబిరాల నుండి రైతులు, మహిళలు, రైతు కూలీలు నినాదాలు చేశారు.

Updated Date - 2021-06-15T09:02:41+05:30 IST