ఈనెల బియ్యం నాకే..

ABN , First Publish Date - 2021-05-18T06:23:45+05:30 IST

ఒంగోలులో అధికార పార్టీకి చెందిన మహిళా నేత రేషన్‌ బియ్యం కొనుగోళ్లకు తెరలేపారు. ఇప్పటివరకు ఒంగోలులో అధికార పార్టీ ద్వితీయశ్రేణి నాయకుల అండదండలతో ఇతరులు రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తుండగా ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ మహిళా నేతే స్వయంగా దందాను ప్రారంభించింది. ఫోన్లు చేసి బియ్యం తనకే ఇవ్వాలంటూ డీలర్లపై ఒత్తిడి పెంచింది. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలో 86 రేషన్‌షాపులు ఉన్నాయి.

ఈనెల బియ్యం నాకే..

రేషన్‌  బియ్యం కోసం డీలర్లపై ఒత్తిడి

ఒంగోలులో అధికారపార్టీ మహిళా నేత నేరుగా ఫోన్లు

ఇతరులకంటే ఒక్క రూపాయి తక్కువ ఇస్తా

మాట వినకుంటే మీ పని చెప్తానంటూ బెదిరింపులు

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 17 : ఒంగోలులో అధికార పార్టీకి చెందిన మహిళా నేత రేషన్‌ బియ్యం కొనుగోళ్లకు తెరలేపారు. ఇప్పటివరకు ఒంగోలులో అధికార పార్టీ ద్వితీయశ్రేణి నాయకుల అండదండలతో ఇతరులు రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తుండగా ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ మహిళా నేతే స్వయంగా దందాను ప్రారంభించింది. ఫోన్లు చేసి బియ్యం తనకే ఇవ్వాలంటూ డీలర్లపై ఒత్తిడి పెంచింది. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలో 86 రేషన్‌షాపులు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దాదాపు 90 శాతం షాపులు ఆ పార్టీ సానుభూతిపరుల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ మహిళా నేతే నేరుగా బియ్యం కొనుగోళ్లకు తెరలేపడంతో ఆ పార్టీకి చెందిన డీలర్లతో పాటు ప్రజల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. డీలర్లు కార్డుదారుల నుంచి రూ.10కి కిలో బియ్యం కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని ఇతరులకు రూ.13 నుంచి రూ.15కు విక్రయిస్తున్నారు. 


నేరుగా డీలర్లకు ఫోన్లు

ఆ మహిళా నేత నేరుగా డీలర్లకు ఫోన్‌ చేసి ఈ నెల నుంచి తనకే బియ్యం ఇవ్వాలని హుకుం జారీచేస్తున్నారు. పార్టీలో కీలకంగా పనిచేసి బతుకుదెరువు కోసం డీలర్‌షి్‌పలు తీసుకున్న వ్యక్తులకు కాకుండా ఆ పార్టీలోని సానుభూతి పరులకు ఫోన్లు చేస్తోంది. ఈనెల నుంచి తానే డీలర్ల వద్ద ఉన్న బియ్యం కొనుగోలు చేస్తానని, అంతా తనకే బియ్యం ఇవ్వాలని లేకపోతే ముఖ్యనేతల దృష్టికి తీసుకెళ్లి మీ పనిచేప్తానంటూ హెచ్చరిస్తుండటంతో కొంతమంది డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఆ డీలర్లు వెంటనే వారి వారి పార్టీ ద్వితీయశ్రేణి నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇటీవల ఒకరిద్దరు డీలర్లను తానే మార్చానని మాట వినకపోతే మీకు అదే శాస్తి చేస్తానంటూ బెదిరించడం కొసమెరుపు. 


ఒక రూపాయికి తక్కువకే ఇవ్వాలి

పైగా ఇతరుల కంటే తనకు ఒక్క రూపాయి తక్కువకే ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. అయితే తాము ఎందుకు ఇవ్వాలంటూ ఆ మహిళా నేతను కొందరు ఫోన్‌లోనే ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యనేత పేరుతో బెదిరింపులకు పాల్పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళా నేత ఫోన్లు వచ్చిన డీలర్లు ఈ విషయాన్ని ఇతర డీలర్లతో చెప్పుకొని మదనపడుతున్నారు. తాము కూడా అధికారపార్టీకి చెందిన వ్యక్తులమేనని, కానీ తమకే ఫోన్‌ చేసి బియ్యం ఇవ్వాలని బెదిరించే ధోరణిలో మాట్లాడటంపై డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


బియ్యం ఇవ్వలేమని నేరుగా చెప్పిన కొంతమంది డీలర్లు

కాగా ఆ మహిళా నేతకు బియ్యం ఇచ్చేది లేదని కొంతమంది డీలర్లు తెగేసి చెప్పినట్లు సమాచారం. తమకు ముందుగా డీడీలు తీసేందుకు పెట్టుబడులు పెడుతున్నారని, ఈ పరిస్థితుల్లో తాము బియ్యం ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఆమె బియ్యం ఎందుకు ఇవ్వరో చూస్తానని హెచ్చరించినట్లు సమాచారం. 


గతంలో కూడా ఆమెపై పలు ఆరోపణ లు 

గతేడాది ఒక ముఖ్యనేత జన్మదిన వేడుకలు చేయాలని డీలర్ల వద్ద డబ్బులు కూడా వసూలు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో నగరంలో ప్లెక్సీలు కూడా వేయించారు. అయితే అప్పట్లో కొంతమంది డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో వివాదం నెలకొంది. ఈ విషయం ఆ ముఖ్య నేతకు తెలిసి మందలించడంతో కొద్దిగా తగ్గిన ఆ మహిళా నేత ఇప్పుడు మరోసారి డీలర్లపై పెత్తనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. 

 

Updated Date - 2021-05-18T06:23:45+05:30 IST