ఇనగల్లులో బీసీలపై దాడి

ABN , First Publish Date - 2020-10-27T18:13:38+05:30 IST

పర్చూరు మండలం ఇనగల్లు గ్రామంలో బలహీనవర్గాలకు చెందిన వారిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఒకర్ని కత్తితో హతమార్చే..

ఇనగల్లులో బీసీలపై దాడి

వైసీపీ నేతల ప్రత్యక్ష పాత్ర 

ఆరంభంలో హడావుడి.. ఆపై ఎస్‌ బాస్‌ అన్న పోలీసులు

హత్యాయత్నం, దాడిని పక్కనబెట్టి సాధారణ కేసుగా నమోదు


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): పర్చూరు మండలం ఇనగల్లు గ్రామంలో బలహీనవర్గాలకు చెందిన వారిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఒకర్ని కత్తితో హతమార్చే ప్రయత్నం చేసి తీవ్ర గాయాలకు గురిచేశారు. మరొకరి ఇంటి మీదకు వెళ్లి దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆరంభంలో హడావుడి చేసినా చివరకు సాధారణ సంఘటనగా వాటిని భావిస్తూ కేసు నీరుగార్చేశారు. అయితే ఇప్పటికీ ఆ గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొని ఉన్నాయి. వివరాల్లోకెళ్తే... ఇనగల్లులో పూర్వకాలం నుంచి గ్రూపు రాజకీయాలు, రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయి. అయితే కొంతకాలంగా గ్రామంలో పరిస్థితులు చక్కబడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దసరా పండుగ రోజు గ్రామంలో దాడులు, దౌర్జన్యాల కథ పునరావృతమైంది.


అది ఒక వర్గం వారిపై మాత్రమే జరగడం గమనార్హం. రాజకీయ వైషమ్యాలకు అనుగుణంగా దాడులు జరిగాయి. అధికార వైసీపీకి చెందిన గ్రామ నేతలు, ప్రతిపక్ష టీడీపీకి చెందిన వారిలో బలహీనవర్గాలకు చెందిన వారిపై దౌర్జన్యానికి దిగారు. కొద్దిరోజుల నుంచి టీడీపీ వర్గీయులు తమపై దాడులకు అవకాశం ఉందని చెబుతూనే ఉన్నారు. అనుకున్నట్లే అధికారపార్టీ నేతలు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామంలో బలహీనవర్గాలకు చెందిన యనమదల సాంబశివరావుపై అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు దాడి చేశారు. ఒంటరిగా వెళ్తున్న అతనిని నిలదీసి దుర్భాషలాడి అనంతరం కత్తులతో పొడిచారు. పరారయ్యేందుకు అతను విశ్వప్రయత్నం చేసినా కత్తిపోట్లకు గురయ్యాడు. అనంతరం గ్రామం లో అధికారపార్టీ నేతలు స్వైర విహారం చేస్తూ హెచ్చరిస్తూ తిరిగారు. ప్రత్యర్థి పార్టీలో ఉంటున్న మరో బీసీ నేత ఇంటిపైకి వెళ్లి దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై గ్రామానికి చేరుకున్నారు. కత్తిపోట్లకు గురైన సాంబశివరావును వైద్యశాలకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్ర యత్నం చేశారు. ఆ మేరకు పోలీసులు విజయం సాధించారు. చీరాల ఇన్‌చార్జి డీఎస్పీ వేణుగోపాల్‌, ఇంకొల్లు సీఐ అల్తాఫ్‌ హస్సేన్‌ కూడా గ్రామాన్ని సందర్శించారు. అంతవరకు పరిస్థితి సవ్యంగానే సాగినా అనంతరం అధికార పార్టీ నేతల జోక్యంతో అసలు విషయం తారుమారైంది. బాధితుడిపై పోలీసుల ఒత్తిడి పెరిగింది.


ఫిర్యాదులు మార్చేశారు. చివరకు హత్యాయత్నం కేసును దాడి కేసుగా నమోదు చేశారు. మూకుమ్మడి దాడిని ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా పేర్కొన్నారు. ఆరంభంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హడావుడి చేసిన పోలీసులు అంతలోనే కేసుల నమోదు విషయంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తున్నప్పటికీ మున్ముందు ఏం జరగబోతుందోనన్న భయాందోళన ప్రజల్లో ఉంది. కాగా, గ్రామంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, బాధితుడు సాంబశివరావు ఫిర్యాదు మేరకు నరిశెట్టి వెంకటరమణపై కేసు నమోదు చేశామని, ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరులో ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదని పర్చూరు ఎస్సై రమణయ్య మీడియాకు తెలిపారు. 


Updated Date - 2020-10-27T18:13:38+05:30 IST