పరిశ్రమలకు మెరుగైన ప్రోత్సాహకాలు

ABN , First Publish Date - 2020-11-26T06:18:42+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు.

పరిశ్రమలకు మెరుగైన ప్రోత్సాహకాలు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

పుత్తూరు/తిరుచానూరు, నవంబరు 25: ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. విజయపురం మండలం కోసలనగరంలోని ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి, పరిశ్రమలకు సౌకర్యాల కల్పనపై తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ఏపీఐఐసీ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కోసలనగరం ఎంఎస్‌ఎంఈ పార్కు రెండు వేల ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ పార్కుగా రూపుదిద్దుకుంటున్న ఇందులో అంబత్తూరు ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌(ఐమా) ప్రతినిధులు 750 ఎకరాలు కేటాయించాలని కోరారని మంత్రి చెప్పారు. పార్కులో పరిశ్రమలకు స్థలం కేటాయింపు, సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ అధికారులకు సూచించారు. అలాగే వచ్చే నెలలో ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోవాలని ఐమా ప్రతినిధులను మంత్రి కోరారు. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారని అన్నారు. పవర్‌లూమ్స్‌కే పరిమితమైన నగరి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు కానుందని చెప్పారు. తమిళనాడుకు సరిహద్దులో ఉండడంతో ఆ రాష్ట్ర పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తితో ఉన్నారని అన్నారు. వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి, ఈడీ ప్రతాపరెడ్డి, జోనల్‌ మేనేజరు రామ్‌, జిల్లా పరిశ్రమల మేనేజరు ప్రతాపరెడ్డి, చిత్తూరు ఆర్డీవో రేణుక పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T06:18:42+05:30 IST