HYD : టీఆర్ఎస్‌లో వీడని ఉత్కంఠ.. ఎన్నిక ఆలస్యం.. పోటాపోటీగా ఆశావహులు

ABN , First Publish Date - 2021-09-30T14:13:10+05:30 IST

వీటితోపాటు అనుబంధంగా మహిళా, యువజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ

HYD : టీఆర్ఎస్‌లో వీడని ఉత్కంఠ.. ఎన్నిక ఆలస్యం.. పోటాపోటీగా ఆశావహులు

హైదరాబాద్ సిటీ/రాంనగర్‌ : ముషీరాబాద్‌ నియోజకవర్గ డివిజన్‌ కమిటీ అధ్యక్ష స్థానాల కోసం ఆశావహులలో ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో బస్తీ కమిటీలను నియమించగా, అనుబంధ కమిటీల ఏర్పాటు పూర్తి కాలేదు. నేటితో ఆ గడువు పూర్తి కానుండగా, డివిజన్‌ కమిటీల ఎన్నిక ఆలస్యం కానుంది. నియోజకవర్గంలోని రాంనగర్‌, అడిక్‌మెట్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, కవాడిగూడ, గాంధీనగర్‌ డివిజన్లలో మొత్తం 192 బస్తీ కమిటీల నియామకం పూర్తి అయింది. వీటితోపాటు అనుబంధంగా మహిళా, యువజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమిటీలు వేయాల్సి ఉంది. కొన్ని ప్రాంతాలలో ఆయా కమిటీల నియామకానికి నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులు దొరకడం లేదన్న ప్రచారం జరుగుతోంది. దాదాపు 30 శాతం అనుబంధ కమిటీలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.


అంబర్‌పేటలో బస్తీ కమిటీలు పూర్తి   

అంబర్‌పేట నియోజకవర్గంలోని ఐదు  డివిజన్లకు సంబంధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ బస్తీకమిటీల ఏర్పాట్లు పూర్తయింది. ఈ మేరకు జాబితాను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ఇన్‌చార్జి బండి రమే‌ష్‌కు.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ బుధవారం అందజేశారు. గోల్నాక తులసీనగర్‌ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బండి  రమేష్‌ మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసే వారికి సముచిత ప్రాధాన్యం, అవకాశం దక్కుతుందని, త్వరలోనే డివిజన్‌ కమిటీలనూ ఏర్పాటు చేస్తామన్నారు. మిగిలిన బస్తీ కమిటీలను ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలమైన శక్తిగా పటిష్టమైన  యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మహ్మద్‌ యూసూఫుద్దీన్‌, ఈ.ఎస్.ధనుంజయ, బి.లింగంగౌడ్‌, ఆర్‌.కె.బాబు, రెడపాక రాము, కొమ్ము శ్రీనివాస్‌, వై.బుచ్చిరెడ్డి తది తరులు పాల్గొన్నారు. 


అంబర్‌పేట బస్తీ కమిటీలు పూర్తి చేస్తాం..

అంబర్‌పేట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ బస్తీ కమిటీలను పూర్తి చేస్తామని కార్పొరేటర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బస్తీ కమిటీలపై కార్యకర్తలతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సలహాలు, సూచనలు మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు లవంగు ఆంజనేయులు, సిద్ధార్థ ముదిరాజ్‌, రాగుల ప్రవీణ్‌, జాకీబాబు, అమనూరి సతీష్‌, మహేష్‌ ముదిరాజ్‌, నజయ్‌, ధరంపటేల్‌, విష్ణు పాల్గొన్నారు.


అన్ని చోట్లా పోటాపోటీ

- డివిజన్‌ అధ్యక్ష పదవి కోసం అన్ని డివిజన్లలో తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో డివిజన్‌ నుంచి ముగ్గురి నుంచి ఐదారుగురు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు అధ్యక్ష స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


- రాంనగర్‌ డివిజన్‌ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు రేషం మల్లేష్‌ ఈసారి రేసులో నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ సీనియర్‌ నాయకుడు ఆర్‌.మోజేస్‌, దామోదర్‌రెడ్డి, డేవిడ్‌రాజ్‌తోపాటు పలువురు పోటీ పడుతున్నారు.


- అడిక్‌మెట్‌ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు శ్యాంసుందర్‌ చిట్టితోపాటు మాజీ కార్పొరేటర్‌ బి.హేమలతరెడ్డి బంధువు డివి జన్‌ ఉపాధ్యక్షుడు బల్ల శ్రీనివా్‌సరెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు వి.సుధాకర్‌గుప్తా, మాజీ అధ్యక్షుడు నేత శ్రీనివాస్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కె.సురేందర్‌లు బరిలో ఉన్నారు. 


- ముషీరాబాద్‌ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు సయ్యద్‌ అహ్మద్‌ భక్తియార్‌, ఇటీవల బీజేపీ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన దీన్‌దయాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబుయాదవ్‌ తనయుడు వరుణ్‌యాదవ్‌, సీనియర్‌ నాయకుడు లక్ష్మణ్‌గౌడ్‌, శ్రీధర్‌రెడ్డిలు పోటీ పడుతున్నారు.


- భోలక్‌పూర్‌ ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్‌ ఆలీ, సీనియర్‌ నాయకులు వై.శ్రీనివా్‌సరావుతోపాటు మరికొందరు పోటీ పడుతున్నారు. 


- గాంధీనగర్‌నుంచి ప్రస్తుత అధ్యక్షుడు ఎర్రం శ్రీనివా్‌సగుప్తా, మాజీ అధ్యక్షుడు ముఠా నరేష్‌, సీనియర్‌ నాయకులు రాకే‌ష్‌లు పోటీపడుతున్నారు. 


- కవాడిగూడ నుంచి పార్టీ సీనియర్‌ నాయకులు వల్లాల శ్రీనివాస్‌, వల్లాల రవీందర్‌, రమేష్‌, కాల్వ గోపితోపాటు మరికొందరు పోటీపడుతున్నారు.


గోల్నాకలో పోటాపోటీ

- గోల్నాక డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్ష స్థానం కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ సొంత డివిజన్‌ కావడంతో ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తుండగా, నేతలు పోటీ పడుతున్నారు. కార్పొరేటర్‌ దూసరి లావణ్యశ్రీనివాస్‌ గౌడ్‌ తమకు అనుకూలమైన నాయకుడికి అధ్యక్ష పదవి ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. డివిజన్‌ పార్టీ అధ్యక్ష స్థానం కోసం నాయకులు భూపతి లక్ష్మణ్‌, కొమ్ము శ్రీనివాస్‌, రెడపాక రాము, ముడిగ నర్సింగ్‌యాదవ్‌, మైనారిటీ నాయకుడు అబ్బు తదితరులు పోటీ పడుతున్నారు.


- బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఎమ్మెల్యే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడైన కొమ్ము శ్రీనివాస్‌ గంగపుత్రకు అధ్యక్ష పదవిని, ప్రస్తుతం పార్టీ డివిజన్‌ ప్రధానకార్యదర్శిగా కొనసాగుతున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భూపతి లక్ష్మణ్‌ను మళ్లీ తిరిగి అదే పదవిలో కొనసాగించాలనే నిర్ణయానికి ఎమ్మెల్యే వచ్చినట్లు తెలుస్తోంది.


వారం రోజుల గడువు కోరుతాం.. 

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో వంద శాతం బస్తీ కమిటీల ఏర్పాటు పూర్తయింది. అనుబంధ కమిటీలు 70 శాతంపూర్తయ్యాయి. అనుబంధ కమిటీల ఏర్పాటుకు కావాల్సిన ఆయా సామాజిక వర్గాల కార్యకర్తలు ఆ బస్తీలలో లేకపోవడం వల్ల అనుబంధ కమిటీల ఏర్పాటులో కొంత జాప్యం జరిగింది. గడువు ముగిసిన నేపథ్యంలో మరో వారం గడువు తీసుకుని, అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం. - ముఠా గోపాల్‌, ఎమ్మెల్యే

Updated Date - 2021-09-30T14:13:10+05:30 IST