అనగనగా ఒక దేశముండెనే!

ABN , First Publish Date - 2021-05-17T06:11:47+05:30 IST

అనగనగా ఒక దేశముండెనే - గలగల పారే ఏరులుండెనే ఏటిలో ఈదే చేపలుండెనే - చల్లని నీటిలో చేపలు తుళ్ళెనే...

అనగనగా ఒక దేశముండెనే!

అనగనగా ఒక దేశముండెనే  - గలగల పారే ఏరులుండెనే

ఏటిలో ఈదే చేపలుండెనే - చల్లని నీటిలో చేపలు తుళ్ళెనే 


అన్నం పెట్టే పొలాలుండెనే  - పొలాలలో వరి కంకులూగేనే

కంకులపైన చిలకలు వాలెనే  - చిలకలు ఎన్నో పాటలు పాడెనే 


మట్టి దారుల చెట్లు పెరిగినే - చెట్లు పరిచిన నీడలుండెనే

నీడల ఆసర ఆడుతు పాడే - గోసి పోరల గుంపులుండెనే 


అన్ని దిక్కులకు దారులుండెనే - అడ్డుగోడల అలజడి లేదే

దారులనిండా మల్లెలుండెనే - మంచిమాటలకు విలువలుండెనే 


అక్కడ ఎన్నో మతాలుండెనే - మతాలు మించిన మమత లుండెనే

దేవుని పేరిట మతాల పేరిట - గొడవలె లేని గుడులు వుండెనే 


కురిసెను జోరుగ చల్లని వానలు - లేవే నరకపు వేడిగాడ్పులు

లేనే లేదే దొంగల దోపిడి -  కానేకాదే తిన్నది విషము


ఒక ఇంట్లో పొయ్యి వెలిగితే - పొరుగింట్లో ఆకలి తీరెనే 

ఏ కంట్లో నీరు ఒలికినా - ఊరంత ఉరికొచ్చి నిలిచెనే 


ఆ దేశం మీకు కనిపించిందా - ఆ దేశం లేదని వినిపించిందా

శోకం తోనా లోకం వీడి - కలలా దేశం చెదిరి పోయెనే


(ముహాద్‌ వెంబాయం మలయాళ భాషలో రాసిన ఈ పాటకు 

ఒక తమిళం అనువాదం నుంచి చేసిన తెలుగు అనువాదమిది)

సుధాకిరణ్‌

Updated Date - 2021-05-17T06:11:47+05:30 IST