కానుకలకు కరోనా దెబ్బ.. ఆలయాలకు తగ్గిన భక్తుల రాక..

ABN , First Publish Date - 2020-09-04T18:12:58+05:30 IST

కరోనా కష్టం దేవుడికీ తప్పేటట్టు లేదు. కరోనాకు ముందు వరకూ ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడేవి. హుండీలు గలగలలాడేవి.. అర్చకుల జేబులు నిండుగా కనిపించేవి..

కానుకలకు కరోనా దెబ్బ.. ఆలయాలకు తగ్గిన భక్తుల రాక..

పడిపోయిన హుండీల ఆదాయం

జీతాలు చెల్లింపునకు ఇబ్బంది.. ఆదాయ మార్గాలపై అన్వేషణ


భీమవరం టౌన్‌ : కరోనా కష్టం దేవుడికీ తప్పేటట్టు లేదు. కరోనాకు ముందు వరకూ ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడేవి. హుండీలు గలగలలాడేవి.. అర్చకుల జేబులు నిండుగా కనిపించేవి.. కరోనా విలయంతో భగవంతుడిని దర్శించుకోవడానికి భక్తులు భయపడుతున్నారు. ఏదో వచ్చినా అడపా దడపా తప్ప.. పెద్దగా భక్తులు రావడం లేదు. ఈ నేపథ్యంలో హుండీల ఆదాయం రోజురోజుకు సన్నగిల్లుతోంది. గతం లో నెల రోజులకు హుండీల ద్వారా లక్షల్లో ఆదాయం వచ్చేది. ఇం దులో చిన్న తిరుపతి వేంకటేశ్వస్వామి, నిడదవోలు కోట సత్తెమ్మ, మద్ది ఆంజనేయస్వామి, భీమవరం మావుళ్లమ్మ, గునుపూడి సోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి తది తర ఆలయాలు పోటీపడేవి. ఈ ఏడాది కరోనాతో ఆదాయం పడిపోయింది. పదికి పైగా దేవాలయాలు హుండీల ద్వా రానే మనుగడ సాగిస్తాయంటే అతిశయోక్తి కాదు. ఆరు నెలలుగా భక్తుల రాక తగ్గడంతో రానున్న రోజుల్లో నిర్వాహణ ఎలా అనే దానిపై అధికారులు అయో మయానికి గురవుతున్నారు. దీంతో ఆలయ సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కొన్ని ఆలయాల్లో ఇబ్బందులు పడుతున్నారు.


పడిపోయిన ఆదాయం.. 

ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీలను నెలకు ఒకసారి తెరిస్తే రూ.2 కోట్ల వరకు ఆదాయం కనిపించేది. ఇప్పుడది కోటి దాటడం లేదు. స్వామికి ఏడాదికి రూ.75 కోట్లు ఆదాయంగా వస్తుంది. దీనిలో ఎక్కువగా భక్తుల నుంచి కానుకల రూపంలోనే వస్తుంది. భక్తుల రాకపోవ డంతో భారీగా తగ్గింది. జీతాలకే నెలకు కోటి వరకు అవుతుందని సమాచారం. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ఏం చేయాలని అధికారులు అయోమయంలో ఉన్నారు. పంచారామ క్షేత్రమైన గునుపూడిలోని సోమేశ్వరస్వామి దేవస్థానంలో కొన్ని నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి. ఏడాదికి రూ.1.30 కోట్లు ఆదాయంగా వస్తుంది. హుండీల ద్వారా రూ.12 లక్షల వరకు ఆదాయం వచ్చేది. పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామికి ఏడా దికి రూ.1.70 కోట్ల వరకూ ఆదాయం వచ్చేది.. హుం డీల ఆదాయం బాగానే ఉండేదని, ఇప్పుడు తెరిస్తే సగం కూడా రావడం అనుమానమే అని భావిస్తున్నారు. 


భీమవరం మావుళ్ళమ్మకు హుండీల ద్వారా రూ.40 లక్షల వరకు ఆదాయం వచ్చేది. రాట్నాలమ్మ దేవస్థానానికి ఏడాదికి రూ.90 లక్షల ఆదాయంగా వచ్చేది. ఇప్పుడు పరిస్థితి చెప్పలేమని అధికారులు అంటున్నారు. ఏలూరులోని ఆర్‌ఆర్‌ పేట వేంకటేశ్వరస్వామికి ఏడాదికి రూ.1.22 కోట్లు ఆదాయంగా వచ్చేది. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. బండి ముత్యాలమ్మ అమ్మ వారికి ఏడాదికి రూ. 70 లక్షల వరకు ఆదాయం వచ్చేది. గత ఆరు నెలలుగా భక్తుల రాక తగ్గిపోవడంతో ఆదాయం పడిపోతోంది. భీమవరం పద్మావతి వేంకటేశ్వరస్వామికి ఏడాదికి కోటి రూపాయలు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అనుకున్నంతగా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. జంగారెడ్డిగూడెం పారిజాతగిరి వేంకటేశ్వరస్వామికి ఏడాదికి రూ.66 లక్షలు ఆదాయం. ఇది కూడా భక్తుల నుంచి వచ్చే కానుకల ద్వారానే. ఇక్కడ ఇదే పరిస్థితి. ఇలా చాలా ఆలయాల్లో భక్తుల రాక  తగ్గడంతో ఆదాయాలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎలా అనే దానిపై ఆలోచనలు చేసుకుంటున్నారు. 


పాటదారులు వెనక్కి

కొన్ని దేవాలయాల్లో షాపులు, చీరలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన పాటలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు తమ కాంట్రాక్ట్‌ను వదులుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంబంధిత ఈవోలకు కాంట్రాక్టర్లు సమాచారం ఇస్తున్నారు. భక్తులు రాక తగ్గడంతో చాలా ఆలయాల వద్ద షాపులు తెరవకపోవడంతో అద్దెలు చెల్లించని పరిస్థితి. ఆదాయం తగ్గిపోవడంతో ప్రత్నామ్నాయంపై ఆలయ సిబ్బంది ఆలోచనలు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-04T18:12:58+05:30 IST