Maharashtra : పెళ్లివారమంటూ ఐటీ అధికారుల దాడి... షాక్ అయిన బడా వ్యాపారి...

ABN , First Publish Date - 2022-08-11T17:24:18+05:30 IST

ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) వలలో అక్రమార్జన

Maharashtra : పెళ్లివారమంటూ ఐటీ అధికారుల దాడి... షాక్ అయిన బడా వ్యాపారి...

ముంబై : ఆదాయపు పన్ను శాఖ  పన్ను ఎగవేతదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కొత్త ఎత్తుగడలతో అక్రమాస్తుల గుట్టును రట్టు చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని జల్నా, ఔరంగాబాద్ నగరాల్లో వినూత్నంగా దాడులు నిర్వహించి వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అధికారులు, సిబ్బంది తమ కార్లకు ‘దుల్హన్ హమ్ లే జాయేంగే’ స్టిక్కర్లను కార్లపై అతికించి,  పెళ్లివారిలా వెళ్లారు. 



ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు వినూత్నంగా వెళ్లి, నిర్వహించిన సోదాల్లో అక్రమార్జన, అవినీతి తిమింగలం గుట్టు రట్టయింది. ఆగస్టు 1 నుంచి 8 వరకు నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.390 కోట్ల విలువైన చట్టవిరుద్ధ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటిలో రూ.58 కోట్ల నగదుతోపాటు, 32 కేజీల బంగారం కూడా ఉంది. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, మహారాష్ట్రలోని జల్నా, ఔరంగాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్, స్టీల్, వస్త్ర వ్యాపారాలు చేస్తున్న ఓ వ్యాపారికి చెందిన వివిధ చోట్ల ఆదాయపు పన్ను శాఖ నాసిక్ విభాగం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆ వ్యాపారికి సంబంధించిన రూ.390 కోట్ల విలువైన అక్రమ, చట్టవిరుద్ధ ఆస్తులను  స్వాధీనం చేసుకుంది. 


వీటిలో రూ.58 కోట్ల నగదు కూడా ఉంది. ఈ సొమ్మును లెక్కించడానికి 13 గంటలు పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 260 మంది అధికారులు, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-11T17:24:18+05:30 IST