తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు 2026 తర్వాతే

ABN , First Publish Date - 2021-08-04T09:25:34+05:30 IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు ఇప్పట్లో ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు 2026 తర్వాతే

  • జనగణన అనంతరం అన్ని రాష్ట్రాలతోపాటే
  • తెలంగాణ, ఏపీలోనూ సీట్ల సంఖ్యలో మార్పు
  • ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం


 రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు ఇప్పట్లో లేనట్లే. విభజన చట్టానికి సవరణ చేపట్టి సీట్ల సంఖ్యను పెంచాలని రెండు తెలుగు రాష్ట్రాలు కోరుతున్నా.. అటువంటి అవకాశమేదీ లేదని కేంద్రం తేల్చేసింది. 2026లో ప్రచురితమయ్యే జనగణన అనంతరం పెంపు ఉంటుందని తెలిపింది. 


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు ఇప్పట్లో ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026 జనగణన వివరాలు ప్రచురితమయ్యాకే దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యలో మార్పులు జరుగుతాయని పేర్కొంది. ఇతర అన్ని రాష్ట్రాలతోపాటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మార్పులుంటాయని వెల్లడించింది. మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమ్మూ, కశ్మీర్‌తోపాటే తెలంగాణలోనూ సీట్ల సంఖ్యను పెంచుతారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించగా.. అలాంటిదేమీ ఉండదని, ఏపీ, తెలంగాణల్లో సీట్ల సంఖ్యను రాజ్యాంగంలోని 170వ అధికరణ ప్రకారమే సవరిస్తామని  మంత్రి తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26(1)లో సీట్ల పెంపు ప్రస్తావన ఉన్నట్లు గుర్తు చేశారు. దీని ప్రకారం ఏపీలో సీట్ల సంఖ్యను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 


కేంద్రానికి చిత్తశుద్ధి లేదు: బి.వినోద్‌కుమార్‌

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. కేంద్రానికి మనసుంటే విభజన చట్టంలో వెంటనే సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ‘సబ్జెక్ట్‌’ అనే పదాన్ని తొలగించి, ‘నాట్‌ విత్‌స్టాండింగ్‌(ఏది ఏమైనప్పటికీ...)’ అనే పదాన్ని చేర్చి, చట్ట సవరణ చేస్తే... అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు. విభజన చట్టంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు సవరణలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించినప్పటికీ విభజన చట్టంలో సవరణలు చేసి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని, శాసన మండలి సీట్లను కూడా పెంచారని అన్నారు. అప్పుడు చట్ట సవరణకు పూనుకున్న కేంద్ర ప్రభుత్వం... ఇప్పుడు అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని చెప్పడం భావ్యం కాదన్నారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తాను పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లును పెట్టానని, ఎంపీ కేశవరావుతో కలిసి అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించామని వినోద్‌కుమార్‌ గుర్తు చేశారు. అప్పుడు న్యాయశాఖ ఉన్నతాధికారులు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమేనని చెప్పారని వివరించారు.

Updated Date - 2021-08-04T09:25:34+05:30 IST