రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి పెంపు

ABN , First Publish Date - 2021-04-10T06:34:01+05:30 IST

రోజువారీ కొత్త కొవిడ్‌ కేసులు రికార్డు స్థాయిలకు చేరుతుండడంతో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఉత్పత్తిని పెంచడానికి ఔషధ కంపెనీలు సిద్ధమవుతున్నాయి

రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి పెంపు

సన్నాహాలు చేస్తున్న కంపెనీలు 

జాబితాలో హెటిరో, డాక్టర్‌ రెడ్డీస్‌, సప్తగిరి లేబొరేటరీస్‌ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రోజువారీ కొత్త కొవిడ్‌ కేసులు రికార్డు స్థాయిలకు చేరుతుండడంతో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఉత్పత్తిని పెంచడానికి ఔషధ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రామాణిక ట్రీట్‌మెంట్‌ ప్రోటోకాల్‌ ప్రకారం ఒక మాదిరి నుంచి తీవ్రంగా కొవిడ్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన కొవిడ్‌ రోగులకు రెమ్‌డెసివిర్‌తో చికిత్స చేస్తున్నారు. హెటిరో, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సె్‌సకు చెందిన జుబిలెంట్‌ జెనరిక్స్‌, మైలాన్‌, సిప్లా, జైడస్‌ క్యాడిలా, సన్‌ ఫార్మా.. రెమ్‌డెసివిర్‌ను తయారు చేస్తున్నాయి. కొవిడ్‌ కేసులు పెరగడంతో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల ఉత్పత్తిని పెంచమని కంపెనీలను ప్రభుత్వం కోరింది. దీంతో కంపెనీలు ఉత్పత్తి పెంచే ప్రక్రియలో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రెమ్‌డెసివిర్‌ను గత ఏడాది జూన్‌లో మొదటిసారిగా హైదరాబాద్‌కు చెందిన హెటిరో విడుదల చేసింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌, జుబిలెంట్‌ జనరిక్స్‌ కోసం సప్తగిరి లేబొరేటరీస్‌  రెమ్‌డెసివిర్‌ తయారు చేస్తున్నాయి.

 

30-40% పెంచే వీలు: ప్రస్తుతం ఔషధ కంపెనీలు నెలకు 31.6 లక్షల ఇంజక్షన్‌ వయల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా హెటిరో 10.5 లక్షలను ఉత్పత్తి చేస్తుంటే.. సిప్లా 6.2 లక్షలు, జైడస్‌ క్యాడిలా 5 లక్షలు, మైలాన్‌ 4 లక్షలు, మిగిలిన ఔషధ కంపెనీలు నెలకు లక్ష నుంచి 2.5 లక్షల వరకూ రెమ్‌డెసివిర్‌ను తయారు చేస్తున్నాయు. త్వరలోనే ఈ ఉత్పత్తి 30-40 శాతం పెరిగేందుకు వీలుందని.. నెలకు 50 లక్షల ఇంజక్షన్లకు పెంచే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన ఔషధ కంపెనీ ప్రతినిధి తెలిపారు. 


గతంలో కేసులు తగ్గడంతో: కొవిడ్‌ రెండో దశ విజృంభణకు ముందు కేసులు తగ్గడంతో కంపెనీలు రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని తగ్గించాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  గత ఏడాది జూన్‌, జులై నుంచి 2021 జనవరి వరకు దాదాపు రూ.500 కోట్ల విలువైన రెమ్‌డెసివిర్‌ను విక్రయించినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం గత ఏడాది నవంబరులో రెమ్‌డెసివిర్‌ విక్రయాలు రూ.125 కోట్లు ఉంటే.. ఈ ఏడాది జనవరి నెలకు దాదాపు రూ.40 కోట్లకు పడిపోయినట్లు తెలుస్తోంది.  

Updated Date - 2021-04-10T06:34:01+05:30 IST