ప్రత్యేక కేటగిరీల మహిళలకు అబార్షన్‌ కాలపరిమితి పెంపు

ABN , First Publish Date - 2021-10-14T06:57:12+05:30 IST

కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన మహిళలు అబార్షన్‌ చేయించుకోవడానికి గరిష్ఠ కాల పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ప్రత్యేక కేటగిరీల మహిళలకు అబార్షన్‌ కాలపరిమితి పెంపు

న్యూఢిల్లీ, అక్టోబరు 13: కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన మహిళలు అబార్షన్‌ చేయించుకోవడానికి గరిష్ఠ కాల పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 20 వారాల్లోగా అబార్షన్‌ చేయించుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీల మహిళలకు దీన్ని 24 వారాలకు పెంచారు. లైంగిక దాడులు, అత్యాచారాలకు గురై గర్భం దాల్చినవారు, పెగ్నెన్సీలో ఉన్నప్పుడు విడాకులు తీసుకున్నవారు లేదా విధవలుగా మారినవారు, మైనర్‌ బాలికలు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు ఈ ప్రత్యేక కేటగిరీల కిందకు వస్తారు. అత్యవసర పరిస్థితులు, విపత్తుల సందర్భాల్లో గర్భం దాల్చినవారిని కూడా ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తారు. తీవ్రమైన శారీరక, మానసిక వైకల్యాలతో శిశువు జన్మించే అవకాశం ఉన్న సందర్భాల్లో కూడా 24 వారాల్లోగా అబార్షన్‌కు అనుమతిస్తారు. కాగా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక మెడికల్‌ బోర్డును ఏర్పాటుచేస్తారు. 24 వారాల తర్వాత అబార్షన్‌ చేయించుకోవాలంటే ఈ బోర్డు అనుమతి తప్పనిసరి.

Updated Date - 2021-10-14T06:57:12+05:30 IST