Abn logo
Apr 9 2021 @ 03:34AM

పరీక్షలు భారీగా పెంచండి

16 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయండి

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వారంలో 100% వ్యాక్సినేషన్‌

ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

మాస్కులు ధరించండి.. నిబంధనలు పాటించండి

45 ఏళ్లు దాటినవారంతా టీకా తీసుకోవాలి: సీఎం

రాష్ట్రంలో కొత్త కేసులు 2055; మరో ఏడుగురి మృతి

గాంధీ ఆస్పత్రిలో మరో 15 మంది కొవిడ్‌కు బలి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరీక్షలను భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. జోగులాంబ-గద్వాల, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, యాదాద్రి-భువనగిరి, జనగామ, వికారాబాద్‌ జిల్లా కేంద్రాల్లో తక్షణమే ఆర్టీపీసీఆర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజా ఆరోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరికీ వారం రోజుల్లో యుద్ధప్రాతిపదికన 100ు వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని ఆదేశించారు. కరోనా నియంత్రణకు అత్యం త కీలకమైన మాస్కుల ధారణ నిబంధనను కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజలు మాస్కు ధరించకపోతే రూ. 1,000 జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలన్నారు.


సమీక్ష కొనసాగుతుండగానే.. డీజీపీ మహేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మతో ఫోన్‌లో మాట్లాడారు. వారి శాఖల్లో పనిచేసే సిబ్బందికి వారంరోజుల్లో 100ు వ్యాక్సినేషన్‌ పూర్తవ్వాలని ఆదేశించారు. వాక్సినేషన్‌ పురోగతిని ప్రతీరోజూ ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎంవోకు రిపోర్ట్‌ చేయాలని స్పష్టంచేశారు. కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి, స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని సూచించారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

దేశవ్యాప్తంగా కరోనా తిరిగి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. నిబంధనలను పాటిస్తూ.. మా స్కులు ధరించి.. జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా జనసమ్మర్థ ప్రాంతాలైన హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో ప్రజలు మరింత అప్రమత్తతో మెలగాలన్నారు. 45 సంవత్సరాల పైబడిన వారంతా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
Advertisement