అందరి చూపు.. ప్రభుత్వ పాఠశాలల వైపు!

ABN , First Publish Date - 2021-08-23T05:33:49+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించగా, వారం రోజుల వ్యవధిలోనే జిల్లావ్యాప్తంగా 10,939 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి కేవలం 325 మంది మాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. దీనిని బట్టి ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్‌ పెరిగిందనే విషయం స్పష్టమవుతోంది.

అందరి చూపు.. ప్రభుత్వ పాఠశాలల వైపు!

 - సర్కారు బడుల్లో పెరిగిన అడ్మిషన్లు

- జిల్లాలో 10,939 మంది కొత్తగా చేరిక

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించగా, వారం రోజుల వ్యవధిలోనే జిల్లావ్యాప్తంగా 10,939 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి కేవలం 325 మంది మాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. దీనిని బట్టి ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్‌ పెరిగిందనే విషయం స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 3,274 ప్రభుత్వ, 554 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఏటా ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 2.74 లక్షలు, ప్రైవేటు పాఠశాలల్లో 1.02 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటారు. గత ఏడాది కొవిడ్‌ వ్యాప్తి భయం ఉన్నా..  అడ్మిషన్లు ఎక్కువగానే జరిగాయి. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించగా.. చాలామంది విద్యార్థులకు అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కరోనా మూడో దశ ముప్పు భయం వెంటాడుతోంది. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించినా.. ఆన్‌లైన్‌ తరగతులతోనే నెట్టుకురావాల్సి వస్తోంది. ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు మాత్రం యథావిధిగా వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరికి ఆన్‌లైన్‌ బోధన సక్రమంగా అర్థం కాక.. మరికొందరు తల్లిదండ్రులు కరోనా కష్టకాలంలో ఫీజుల భారం మోయలేక ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ‘నాడు-నేడు’ భాగంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేయడంపై వాటిపైనే మక్కువ చూపుతున్నారు. గతంలో నర్సరీ స్థాయి నుంచే చిన్నచిన్న ప్రైవేటు పాఠశాలల్లో కూడా తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపించే మధ్య తరగతి తల్లిదండ్రులు కూడా ఈసారి ప్రభుత్వ పాఠశాల బాట పడుతున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం హడ్కోకాలనీలోని మునిసిపల్‌ హైస్కూల్‌లో ఈ ఏడాది అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే సుమారు 100 మంది విద్యార్థులు చేరారు. ఇంకా చేరికల కోసం పాఠశాలలో సిఫారసు చేయిస్తున్నారు. అలాగే శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌లో రెండు రోజుల్లోనే 100 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. నిత్యం 20 నుంచి 30 మంది వరకు అడ్మిషన్ల కోసం వస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 10,939 మంది విద్యార్థులు ‘ప్రైవేటు’ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ నెలాఖరు వరకు ఇంకా అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల నుంచి మాత్రం 325 మంది విద్యార్థులు మాత్రమే ప్రైవేటు స్కూళ్లలో చేరారు. 


కరోనాతో మారిన పరిస్థితులు

కరోనా వైరస్‌ అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో చాలామంది ఉపాధి లేక రోడ్డునపడ్డారు. ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల బతుకులు కూడా దుర్భరంగా మారాయి. తరగతులు నిర్వహణ లేక యాజమాన్యాలు ఏడాదిన్నర నుంచి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గాలు చూసుకున్నారు. తాజాగా పాఠశాలలు పునః ప్రారంభించినా.. కరోనా మూడో దశ ముప్పు నేపథ్యంలో ఎన్నాళ్లు తరగతులు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో బోధన కన్నా.. ప్రత్యామ్నాయ ఉపాధి మేలనే భావనలో చాలామంది ఉన్నారు. మరోవైపు కరోనా కష్టకాలంలో ప్రైవేటు యాజమాన్యాలకు ఫీజులు చెల్లించే కన్నా.. ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమమని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు.   

 

తల్లిదండ్రుల ఆసక్తి 

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు ఆసక్తి చూపడంతో అడ్మిషన్ల సంఖ్య బాగా పెరిగింది. నెలాఖరు వరకు అడ్మిషన్లు చేపడతాం. ‘నాడు-నేడు’లో భాగంగా తొలివిడత కొన్ని పాఠశాలలు అభివృద్ధి చేశాం. ప్రైవేటుకు దీటుగా  సౌకర్యాలు కల్పించాం. పుస్తకాలు, యూనిఫాం పంపిణీతో పాటు ఉచితంగా మెరుగైన విద్య అందజేస్తున్నాం. ఈ క్రమంలో అడ్మిషన్లు క్రమేపీ పెరుగుతున్నాయి. 

- పగడాలమ్మ, డీఈవో

Updated Date - 2021-08-23T05:33:49+05:30 IST