పోటాపోటీ..

ABN , First Publish Date - 2020-05-22T09:34:13+05:30 IST

షాద్‌నగర్‌ పట్టణంలో జరుగుతున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ఇసుక వ్యాపారుల నుంచి

పోటాపోటీ..

డబుల్‌ నిర్మాణాల కోసం ఇసుక సరఫరాకు పెరిగిన పోటీ 

అనుమతుల కోసం వ్యాపారుల పైరవీలు 

గతంలో అనుమతి పొంది బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుక విక్రయం


పెట్టుబడి లేకుండా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి కొందరు వ్యాపారులు తహతహలాడుతున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు అనుమతుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అనుమతులు వస్తే బ్లాక్‌మార్కెట్‌లో ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా నాణ్యమైన ఇసుక లేకున్నా అనుమతులు పొంది ఇళ్ల నిర్మాణాలు చేపడితే నాణ్యత లోపిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


షాద్‌నగర్‌రూరల్‌: షాద్‌నగర్‌ పట్టణంలో జరుగుతున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ఇసుక వ్యాపారుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అనుమతులు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయ్యవారిపల్లి, భీమారం, దేవునిపల్లి, కాంసాన్‌పల్లి తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. వాగు పొడవునా మట్టిని తవ్వి ఫిల్టర్ల ద్వారా ఇసుకను తయారు చేస్తున్నారు. ఇందుకోసం విద్యుత్‌ను కూడా అక్రమంగా వాడుకుంటున్నారు. నాడు జీవ నదిలా ప్రవహించే వాగు.. నేడు రాళ్లు తేలి జీవశ్చవంగా మారింది. షాద్‌నగర్‌ ప్రాంత రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. ఇసుక తవ్వకాల వల్ల వాగు పరివాహక ప్రాంతంలోని బోర్లలో నీరు అడుగంటి పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


1700 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

షాద్‌నగర్‌ పట్టణ శివారులో ప్రభుత్వం 1700 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నది. వీటి నిర్మాణానికి రీచ్‌ల నుంచి తెచ్చిన ఇసుకతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. కానీ పెరిగిన ధరల కారణంగా స్థానికంగా లభ్యమయ్యే ఇసుకను ఎంపిక చేసుకుంటున్నారు. ఇసుక సరఫరాకు గతంలో ఆర్‌అండ్‌బీ అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా 56రోజులకుపైగా ఇళ్ల నిర్మాణం నిలిచి పోయింది. ప్రస్తుతం అనుమతులు రావడంతో వ్యాపారులు ఇసుకను సరఫరా చేసేందుకు పోటీపడుతున్నారు. నాణ్యమైన ఇసుక లేకున్నా సరఫరాకు అనుమతి ఇప్పించాలని నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం.


డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఇసుకను సరఫరా చేసేందుకు భీమారం, అయ్యవారిపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఒత్తిళ్లకు తలొగ్గి అనుమతులు ఇవ్వడంతో ఈ గ్రామాల శివారులో ఉన్న వాగులో మట్టి తవ్వి ఫిల్టరు చేసి ఇసుకను తయారు చేస్తున్నారు. ఈ ఇసుకతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తే నాణ్యత లోపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తద్వారా ప్రభుత్వ ఆశయం దారి తప్పుతుందని అంటున్నారు. పెట్టుబడి లేకుండా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటుపడిన ఇసుక వ్యాపారులు అనుమతుల కోసం పోటీపడుతున్నారు. ఇసుక నాణ్యతను పరిశీలించాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు, రెవెన్యూ అధికారులు అయ్యవారిపల్లి శివారులో ఇసుకను పరిశీలించినట్లు సమాచారం. పరిశీలించిన ఇసుక నాణ్యత ఎంత వరకు ఉపయోగపడుతుందో  తెలియాల్సి ఉంది. గతంలో ఇచ్చిన అనుమతులపై కూడా పలు విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా రీచ్‌ల నుంచి తీసుకువచ్చిన ఇసుకతో ఇళ్లు నిర్మించాలి. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇళ్ల నిర్మాణం సాధ్యం కాకపోవడంతో స్థానికంగా లభ్యమయ్యే ఇసుకను ఉపయోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఇసుక వ్యాపారులు అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు పావులు కదుపుతున్నారు. కానీ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు నాణ్యతగా ఉంటుందనే సందేహాలు వ్వక్తమవుతున్నాయి.


గతంలో అనుమతి ఇవ్వని కలెక్టర్‌

గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శ్రీదేవి స్థానికంగా లభ్యమయ్యే ఇసుకతో మరుగుదొడ్లు నిర్మించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చే అధికారం తనకు లేదని.. భూగర్భ, గనులశాఖ అనుమతి తీసుకోవాలని తేల్చిచెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణాలు జరగాలంటే అనుమతులు తప్పనిసరి కావడంతో ఎమ్మెల్యే, ఆర్‌అండ్‌బీ, కలెక్టర్‌ జోక్యంతో కొన్ని షరతులతో కూడిన అనుమతులు స్థానిక తహసీల్దారు ఇవ్వడం జరిగింది. అలాంటిది ఇప్పుడు భూగర్భ, గనులశాఖ నుంచి అనుమతులు పొందకుండా స్థానిక అధికారులు ఎలా అనుమతులు ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


అక్రమ వ్యాపారం

అయ్యవారిపల్లికి చెందిన ఇసుక వ్యాపారి ఒకరు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఇసుక సరఫరా చేసేందుకుగాను 450 ట్రాక్టర్లకు అనుమతి తీసుకుని చాలావరకు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించుకున్నట్లు ఆరోపణలు న్నాయి. ఈ విషయమై డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మా ణం కాంట్రాక్టరు తహసీల్దారుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గతంలో బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించిన వ్యాపారి కూడా ప్రస్తుతం ఇసుక సరఫరా అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అనుమతులు పొంది బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించడం వల్ల పంచాయతీకి చెల్లించాల్సిన రుసుం కూడా చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే గతంలో ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించిన విషయం గురించి తహసీల్దారును వివరణ కోరగా అదేం లేదని వివరించారు. ఏదేమైనా పేద ప్రజల కోసం నిర్మిస్తున్న ఇళ్లను నాణ్యతగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2020-05-22T09:34:13+05:30 IST