Abn logo
Jul 7 2020 @ 04:47AM

ఆధార్‌.. బేజార్‌

బ్యాంకుల్లో కేంద్రాల మూసివేత

పోస్టాఫీసు వద్ద పెరిగిన రద్దీ

నెల రోజుల ముందే టోకెన్లు


కర్నూలు(న్యూసిటీ), జూలై 6: నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఆధార్‌ నమోదుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. మార్పులు, చేర్పులకూ తంటాలు తప్పడం లేదు. కరోనా భయం వెంటాడుతున్నా ప్రజలు ఆధార్‌ కోసం వస్తున్నారంటే దాని ప్రాధాన్యం తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. కొత్తగా ఆధార్‌ కోసం వచ్చేవారు తక్కువగానే ఉన్నారు. కానీ పాత కార్డులు తప్పులు తడకలుగా ఉన్నాయి. వీటిని మార్చుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా భయంతో బ్యాంకుల్లో ఉన్న ఆధార్‌ నమోదు కేంద్రాలను మూసివేశారు. దీంతో ప్రజలు పోస్టాఫీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రానికి తాకిడి పెరిగింది. నెల రోజుల ముందే టోకెన్లు జారీ చేస్తున్నారు. 


ఎన్నెన్ని కష్టాలో..

జూన్‌ నెలలో ఇచ్చిన టోకెన్లు సోమవారంతో ముగిశాయి. దీంతో కొత్త టోకెన్లకు భారీగా వచ్చారు. ప్రధాన తపాలా కార్యాలయం నుంచి కాంగ్రెస్‌ కార్యాలయం మీదుగా పాత కంట్రోల్‌ రూమ్‌ వరకు క్యూ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 


టోకెన్ల కోసం ప్రజలు భారీగా తరలిరావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోస్టాఫీసులో టోకెన్ల జారీ చేయవద్దని, సచివాలయాల ద్వారా టోకెన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. 

ప్రధాన తపాలా కార్యాలయంలో ఓ పోస్టుమన్‌కు కరోనా సోకింది. దీంతో పోస్టాఫీసును రెండురోజుల పాటు మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గురువారం నుంచి కార్యాకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. 


కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం..

బ్యాంకుల్లో ఉన్న ఆధార్‌ నమోదు కేంద్రాలను మూసివేయడంతో పోస్టాఫీసుకు అధిక సంఖ్యలో వస్తున్నారు. రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది. ఈ నెల 4వ తేదీ వరకు జారీ చేశాం. తిరిగి సోమవారం నుంచి టోకెన్లు ఇస్తామని చెప్పడంతో అధిక సంఖ్యలో వచ్చారు.  సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోతాం. 

- పి.హరిక్రిష్ణప్రసాద్‌, పోస్టల్‌ సూపరింటెండెంట్‌

Advertisement
Advertisement
Advertisement