కరెంటు వాడకం పెరిగింది

ABN , First Publish Date - 2020-05-22T08:57:27+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా తగ్గిపోయిన విద్యుత్తు డిమాండ్‌.. లాక్‌డౌన్‌ సడలింపులతో పూర్వస్థితికి చేరింది.

కరెంటు వాడకం  పెరిగింది

మళ్లీ పూర్వ స్థితికి విద్యుత్తు డిమాండ్‌

లాక్‌డౌన్‌ సడలింపులతో వినియోగంలో వృద్ధి

హైదరాబాద్‌లో తక్కువ.. జిల్లాల్లో ఎక్కువ


హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా తగ్గిపోయిన విద్యుత్తు డిమాండ్‌.. లాక్‌డౌన్‌ సడలింపులతో పూర్వస్థితికి చేరింది. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు మొదలవడంతో డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతోంది. ఈనెల 9న విద్యుత్తు డిమాండ్‌ 147.787 మిలియన్‌ యూనిట్లు(7,278 మెగావాట్లు) ఉండగా.. 18న 149.539 మిలియన్‌ యూనిట్లు (7,266 మెగావాట్లు)కు చేరింది. గురువారం మధ్యాహ్నం 3.52 గంటల సమయంలో 7,802 మెగావాట్లుగా రికార్డయింది. గతేడాది ఇదే సమయానికి వినియోగం 7,897 మెగావాట్లుగా ఉంది. లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో దాదాపు 70 శాతం వ్యాపారాలు కుదుటపడ్డాయి.


హోటళ్లు, షాపింగ్‌మాళ్లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు తప్ప మిగతా వ్యాపారాలన్నీ ప్రారంభం కావడంతో డిమాండ్‌ సాధారణ స్థితికి చేరిందని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో గృహాల్లో వినియోగం పెరిగింది. కూలర్లు, ఫ్యాన్లు, ఏసీ, టీవీ, కంప్యూటర్ల వాడకం కూడా డిమాండ్‌ స్థిరంగా కొనసాగడానికి కారణం. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో కరెంటు వినియోగం కొంత తక్కువగా ఉండగా జిల్లాల్లో ఎక్కువగా ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో గతేడాది 3,223 మెగావాట్ల డిమాండ్‌ ఉండగా.. గురువారం 2,435 మెగావాట్లు నమోదయింది. వరంగల్‌లో గతేడాది 400 మెగావాట్ల డిమాండ్‌ ఉండగా.. గురువారం 483 మెగావాట్లకు చేరింది. నిజామాబాద్‌లో గతేడాది 258 ఉండగా.. గురువారం 325 మెగావాట్లు రికార్డయింది.

Updated Date - 2020-05-22T08:57:27+05:30 IST