ఉపాధి హామీ పనికి పెరిగిన డిమాండ్‌

ABN , First Publish Date - 2021-01-18T07:16:45+05:30 IST

కొవిడ్‌ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఊళ్ల బాట పట్టారు. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులకు డిమాండ్‌ పెరిగింది.

ఉపాధి హామీ పనికి పెరిగిన డిమాండ్‌

కుటుంబాలకు తగ్గిన సగటు పని దినాలు


న్యూఢిల్లీ, జనవరి 17: కొవిడ్‌ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఊళ్ల బాట పట్టారు. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులకు డిమాండ్‌ పెరిగింది. అయితే పని దినాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగినా ఒక్కో కుటుంబానికి లభించిన సగటు పని దినాలు మాత్రం కాస్త తగ్గాయని తెలుస్తోంది. 2019-20 సంవత్సరంలో ఒక్కో కుటుంబం సగటు పనిదినాల సంఖ్య 48.40 రోజులుండగా.. 2020-21లో 44.38 రోజులకు తగ్గింది. 2019-20లో ఉపాధి హామీ పథకం కింద పని చేసిన కుటుంబాల సంఖ్య 5.48 కోట్లు ఉండగా.. 2020-21లో మాత్రం 6.90 కోట్లకు పెరిగింది. అదేవిధంగా 2019-20లో పని దినాల సంఖ్య 265.38 కోట్లు ఉండగా.. కరోనా సంవత్సరంలో మాత్రం 306.39కోట్లకు చేరుకుంది. ఉపాధి కోల్పోయిన అనేక మంది నుంచి ఏర్పడిన డిమాండ్‌ వల్లే పని దినాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. అయితే డిమాండ్‌కు తగిన స్థాయిలో పనులను కల్పించకపోవడం వల్లనే కుటుంబాలకు లభించే పని దినాల సంఖ్య తగ్గినట్టు పరిశీలకులు చెబుతున్నారు. కాగా కొంత మంది వలసకార్మికులు పని కావాలని కోరారని, తర్వాత వాళ్లు తిరిగి పట్టణాలకు వెళ్లిపోవడం వల్ల ఒక్కో కుటుంబానికి లభించిన పని దినాలు తగ్గినట్టు కనిపిస్తోందని అధికారవర్గాలు అంటున్నాయి. వలసకార్మికులను లెక్కలోనుంచి తీసివేస్తే ఒక్కో కుటుంబానికి పని కల్పన పెరగవచ్చని చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి దాదాపు రెండున్నరనెలలు ఉన్నందున సగటులో మార్పు రావడానికి అవకాశం ఉందని అంటున్నారు.

Updated Date - 2021-01-18T07:16:45+05:30 IST