ఎరువు.. దరువు!

ABN , First Publish Date - 2021-08-27T05:20:46+05:30 IST

అన్నదాతకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా ప్రభావంతో వ్యవసాయ కూలీల ధరలు పెరిగాయి. పెట్టుబడులతో సతమతమవుతున్న అన్నదాతలపై మరోవైపు ఎరువుల భారం పడింది. గత ఏడాదితో పోల్చితే 50 కిలోల కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.150 వరకు పెరిగింది. గతంలో యూరియా బస్తా రూ.250 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. డీఏపీ బస్తా గతంలో రూ.900 ఉండగా, ప్రస్తుతం రూ.1250 పలుకుతోంది. గ్రోమోర్‌ బస్తా రూ.1000 నుంచి రూ.1300, పొటాష్‌ ధర రూ.300 నుంచి రూ.800 వరకు పెరిగింది.

ఎరువు.. దరువు!
నరసన్నపేట : ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

 - అమాంతంగా పెరిగిన ధరలు 

- కృత్రిమ కొరతతో ఇక్కట్లు

- ఆందోళన చెందుతున్న రైతులు 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

అన్నదాతకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా ప్రభావంతో వ్యవసాయ కూలీల ధరలు పెరిగాయి. పెట్టుబడులతో సతమతమవుతున్న అన్నదాతలపై మరోవైపు ఎరువుల భారం పడింది.  గత ఏడాదితో పోల్చితే 50 కిలోల కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.150 వరకు పెరిగింది. గతంలో యూరియా బస్తా రూ.250 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. డీఏపీ బస్తా గతంలో రూ.900  ఉండగా, ప్రస్తుతం రూ.1250 పలుకుతోంది. గ్రోమోర్‌ బస్తా రూ.1000 నుంచి రూ.1300, పొటాష్‌ ధర రూ.300 నుంచి రూ.800 వరకు పెరిగింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక.. విక్రయించిన ధాన్యానికి సకాలంలో బిల్లులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు కూడా పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకుల ధర పెరగడంతో ఎరువుల ధరలు పెరిగాయని కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ‘రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఆర్థికంగా భరోసా కల్పిస్తా’మని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 820 రైతుభరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తాం. ఎక్కడా కొరత రానీయబోమని పాలకులు ప్రచారం చేశారు. కానీ రైతుభరోసా కేంద్రాల్లో తగినన్ని నిల్వలు లేకపోవడంతో.. ఎరువులు సరఫరా చేయలేమంటూ నిర్వాహకులు చేతులెత్తేశారు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అధిక ధరలు చెల్లించి..   కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎరువుల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 


ఇబ్బందులు తప్పడం లేదు

ఈ ఏడాది ఎరువుల ధరలు పెరిగాయి. స్థానిక మార్కెట్‌లో ఎరువులు లభించక పొరుగు మండలాలకు, జిల్లాలకు వెళ్తున్నాం. దీంతో మరింత ఇబ్బందులు పడుతున్నాం. 

- గుమ్మిడి దుర్గారావు, రైతు, గురుగుబిల్లి, లావేరు మండలం 


సకాలంలో అందక.. 

ఉబాలు జరుగుతున్న సమయంలో ఎరువుల కొరత నెలకొంది. అధిక ధరలకు కొందామన్నా దొరకడం లేదు. ఎరువుల ధరలు పెరగడంతో అప్పులు తప్పడం లేదు.  వీటిని సకాలంలో వేయకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. 

- మురళి, రైతు, వంగర  


అదనంగా వసూళ్లు..

 రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేవు. ప్రైవేటు డీలర్ల వద్ద స్టాకు లేదు. ఉన్నా అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. యూరియా ప్రభుత్వ ధర రూ.266.50 ఉండగా, వ్యాపారులు  రూ.320 వరకు వసూలు చేస్తున్నారు. డీఏపీ ధర కూడా అమాంతంగా పెంచేశారు. 

- భాస్కరరావు, రైతు, మెళియాపుట్టి  


కార్డులు జారీ చేయడం లేదు

మూడేళ్లుగా భూమిని కౌలుకు చేస్తున్నా .. కౌలు కార్డు జారీ చేయడం లేదు. నాలాగే ఎంతో మంది కౌలు రైతులకు రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు అందడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం. అదనపు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. కంపెనీలను బట్టి బస్తాకు అదనంగా రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లిస్తున్నాం. 

 - జి.నారాయణరావు, కౌలు రైతు, కొత్తవలస, ఆమదాలవలస మండలం.


నిబంధనలు పాటించకుంటే చర్యలు 

నరసన్నపేట, ఆగస్టు 26: ఎరువుల దుకాణాల్లో వ్యాపారులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని సీఐ ఎం.తిరుపతి అన్నారు. గురువారం నరసన్నపేటలోని ఎరువుల దుకాణాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఎరువులను విక్రయించాలని తెలిపారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది  ఉన్నారు. అలాగే  హైవేపై ఉన్న దుకాణాల యాజమానులతో సీఐ సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారిపై వాహనాలు పార్కింగ్‌ చేస్తే సంబంధిత యాజమానిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2021-08-27T05:20:46+05:30 IST