ఇంటర్‌లో పెరిగిన ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2022-06-29T04:54:54+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఇంటర్‌ విద్యార్థులు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ఉత్తీర్ణత శాతం పెరిగింది.

ఇంటర్‌లో పెరిగిన ఉత్తీర్ణత
మహబూబ్‌నగర్‌లోని తన కార్యాలయంలో ఫలితాలను పరిశీలిస్తున్న డీఐఈవో వెంకటేశ్వర్లు

రాష్ట్రంలో పాలమూరుకు మొదటి సంవత్సరంలో 15 ద్వితీయ సంవత్సరంలో 16వ స్థానాలు..

ఫస్టియర్‌లో 5,537 మంది, సెకండ్‌ ఇయర్‌లో 6,051 మంది పాస్‌ 

బాలికలదే పైచేయి 

ప్రభుత్వ కళాశాలల్లో మంచి ఫలితాలు 


 మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూన్‌ 28: ఉమ్మడి జిల్లాలో ఇంటర్‌ విద్యార్థులు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో 15వ స్థానంలో నిలువగా, ద్వితీయ సంవత్సరంలో 16వ స్థానంలో నిలిచింది.


జిల్లాల వారీగా స్థానాలు ఇలా..

 ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌ 15వ స్థానంలో నిలువగా, వనపర్తి 19వ స్థానంలో నిలిచింది. జోగులాంబ గద్వాల 27, నాగర్‌కర్నూల్‌ 28, నారాయణపేట 29 స్థానాల్లో నిలిచాయి. ద్వితీయ సంవత్సంరం ఫలితాల్లో వనపర్తి జిల్లా 13వ స్థానంలో నిలిచింది. మహబూబ్‌నగర్‌ 16, జోగులాంబ గద్వాల 28, నారాయణపేట 31, నాగర్‌కర్నూల్‌ 33వ స్థానంలో నిలిచాయి. 


ఉత్తీర్ణత..

 మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొదటి ఏడాదికి సంబంధించి 9,017 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 5,537 మంది పాస్‌ అయ్యారు. 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 3,508 మంది, బాలురు 2029 మంది పాస్‌ అయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 9,117 మంది పరీక్షలు రాయగా, 6,061 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలు 3,579 మంది, బాలురు 2472 మంది పాస్‌ అయ్యారు. మొదటి, రెండో సంవత్సరాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధిం చారు. మొత్తంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగింది.


ఫలితాలే ఆమెకు నివాళి

 ఎర్రవల్లి చౌరస్తా: ఇంటర్‌ చివరి పరీక్ష రాసి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇటిక్యాల మండలం మున గాలకు చెందిన రాజేశ్వరి ఎంపీసీలో 867 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తను సాధించిన మార్కులే ఆమెకు నివాళి అని అన్నారు. రాజేశ్వరి గద్వాల మండలం గోనుపాడు కస్తూర్బా కళాశాలలో ఇంటర్‌ చదివింది. గత నెల 19న ఆఖరి పరీక్ష రాసి తండ్రి నల్లన్నతో కలిసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం మునగాలకు వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. చదువులో చురుకుగా ఉండే ఆమె మృతి పట్ల కుటుంబీకులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు.


వృత్తి విద్యలో రాష్ట్ర టాపర్‌గా రేణుక

 గద్వాల టౌన్‌: జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన విద్యార్థిని రేణుక వృత్తి విద్య కోర్సు ప్రథమ సంవత్సరంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న రేణుక 500 మార్కులకు 494 మార్కులు సాధించింది.

Updated Date - 2022-06-29T04:54:54+05:30 IST