పెరిగిన వరి సాగు

ABN , First Publish Date - 2022-09-16T04:58:31+05:30 IST

వరిధాన్యం కొనుగోలు వ్యవహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ అంశంగా మారినా గత సీజన్‌లో ధాన్యం కొనుగోలు విషయంలో రాద్ధాంతం జరిగినా రైతుల్లో మాత్రం వరిసాగుపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.

పెరిగిన వరి సాగు

- 2.71 లక్షల ఎకరాల్లో నాట్లు వేసిన రైతులు

- ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

- పత్తి దిగుబడిపై కూడా ఆశలు 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వరిధాన్యం కొనుగోలు వ్యవహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ అంశంగా మారినా గత సీజన్‌లో ధాన్యం కొనుగోలు విషయంలో రాద్ధాంతం జరిగినా రైతుల్లో మాత్రం వరిసాగుపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఈ వానాకాలంలో కూడా సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి రైతులు వరినాట్లు వేశారు. జిల్లావ్యాప్తంగా 2,71,334 ఎకరాల్లో వరిసాగు జరిగింది. వానాకాలం సీజన్‌ ప్రారంభంలో వాతావరణ పరిస్థితులు రైతులను కొంత ఇబ్బందిపాలు చేసినా ప్రస్తుతం పూర్తిగా అనుకూలంగా మారింది. విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి జలకళను సంతరించుకున్నాయి. వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 3,14,719 ఎకరాలు కాగా అంతకు మించి సాగు జరిగింది. 3,47,809 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. 2,71,334 ఎకరాల్లో వరి, 48,655 ఎకరాల్లో పత్తి సాగు జరిగి ప్రధాన పంటలుగా మారాయి. మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఈసారి కేవలం 3,681 ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న సాగు జరిగింది. 

సాధారణానికి మించిన వర్షపాతం

తొలకరి ఆరంభంలో వర్షాలు సకాలంలో రాక కాలంపై రైతులు అనుమానపడ్డారు. వానాకాలం సాగుకు అనువైన వాతావరణం ఉంటుందో లేదోనని ఆందోళనకు గురయ్యారు.  ఆ తర్వాత వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుతో విస్తారంగా వర్షాలు కురిశాయి. జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 15 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 7,804.2 మిల్లీ మీటర్లు కాగా 14,918.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఇది సాధారణ వర్షానికంటే రెట్టింపు కావడం గమనార్హం. జూన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 107 రోజులు గడిచిపోగా ఇందులో 59 రోజులు వర్షం కురిసింది. 

కళకళలాడుతున్న జలాశయాలు

జిల్లాలో సాగు విస్తీర్ణానికి ప్రధాన జలవనరు అయిన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. 90 టీఎంసీల నీటితో ప్రాజెక్టు కళకళలాడుతున్నది. ఈ ప్రాజెక్టు కాకతీయ కాలువకు వనరు అయిన లోయర్‌ మానేరు డ్యాంలో 24 టీఎంసీల నీటికిగాను 23 టీఎంసీల నీరువచ్చి చేరింది. చెరువులు, కుంటలన్నీ పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో రైతులు విస్తారంగా వరి సాగు చేశారు. జిల్లాలో 2,71,334 ఎకరాల్లో వరిసాగు జరగడం, సాగుకు అవసరమైన నీటి కొరత లేకుండా ఉండడంతో దిగుబడి భారీగానే వస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో ఎకరాకు 23 క్వింటాళ్ల నుంచి 24 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఎకరాకు కనీస దిగుబడి 22 క్వింటాళ్ల చొప్పున లెక్కించినా 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నది. ఇందులో విత్తనపు పంట, రైతుల సొంత వినియోగానికి మినహాయించుకునే ధాన్యం పోనూ సుమారు 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నది. 

48,655 ఎకరాల్లో పత్తి సాగు

జిల్లాలో 48,655 ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. వరుసగా కురిసిన వర్షాలతో నల్లరేగళ్లలో కొంత నీరు జాలువారినా పరిస్థితులు మళ్లీ చక్కబడ్డాయి. పత్తి చేలు ఏపుగా పెరగడంతో రైతులు దిగుబడిపై ఆశలు పెంచుకున్నారు. చీడ, పీడలు ఆశించకపోతే భారీగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 4,86,550 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ప్రధాన పంటలుగా మారిన వరి, పత్తితో వర్షాకాలం భారీ ఆదాయం సమకూరుతుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. 

Updated Date - 2022-09-16T04:58:31+05:30 IST