శ్వాస ఆడట్లేదు.. అంబులెన్స్‌ పంపండి

ABN , First Publish Date - 2020-07-05T07:58:11+05:30 IST

‘మా అమ్మకు శ్వాస ఆడటం లేదు. రెండు రోజులుగా జ్వరంగా ఉంది.

శ్వాస ఆడట్లేదు.. అంబులెన్స్‌ పంపండి

  • కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు పెరుగుతున్న కాల్స్‌..
  • 4 రోజుల్లో 174 మంది ఫోన్‌
  • అంతకుముందు 10 కాల్స్‌ లోపే
  • జూన్‌ 10 తరువాత క్రమేణా పెరుగుదల

హైదరాబాద్‌ సిటీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘మా అమ్మకు శ్వాస ఆడటం లేదు. రెండు రోజులుగా జ్వరంగా ఉంది. ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడం భారమవుతోంది. అంబులెన్స్‌ పంపండి’


ఖైరతాబాద్‌ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌

‘కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హోం క్వారంటైన్‌లో ఉంచారు. జ్వరం, దగ్గు తీవ్రంగా ఉంది. ఆస్పత్రికి తీసుకెళ్లండి’

 అంబర్‌పేట నుంచి ఓ మహిళ ఫోన్‌


వారం, పది రోజులుగా జీహెచ్‌ఎంసీలోని కొవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌కు వస్తున్న కాల్స్‌ ఇవి. అంతకుముందు అంబులెన్స్‌ల కోసం ఐదారు కాల్స్‌ మాత్రమే రాగా.. ఇటీవల వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. శనివారం రికార్డు స్థాయిలో 56 మంది అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేశారని జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. కంట్రోల్‌ రూమ్‌కు 151 కాల్స్‌ రాగా.. అందులో 70 మంది ఆహారం కోసం చేశారు. 25 కాల్స్‌ కరోనా అనుమానిత కేసులవి అయితే 56 మంది అంబులెన్స్‌ పంపించాలని కోరారు. కేసుల తీవ్రత పెరగడం, మెజారిటీ పాజిటివ్‌ కేసులను హోం క్వారంటైన్‌లో ఉంచుతున్న నేపథ్యంలో అంబులెన్స్‌ల అవసరం పెరుగుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 32 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మున్ముందు ఈ అంబులెన్స్‌లు చాలవేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


గ్రేటర్‌లో జూన్‌ నుంచి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అధికమైంది. జూన్‌ 10 వరకు అంబులెన్స్‌ల కోసం కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన కాల్స్‌ పది లోపే. ఆ తరువాత అత్యవసర సేవల కోసం ఫోన్‌ చేస్తోన్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. గత 4 రోజుల్లో 174 మంది అంబులెన్స్‌ సేవల కోసం ఫోన్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మెజారిటీ వ్యక్తులను హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్య సూచనలు అందిస్తున్నారు.


తీవ్రంగా జ్వరం వచ్చి తగ్గకపోయినా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా.. ఇతరత్రా అ నారోగ్య సమస్యలు తలెత్తితే ఫోన్‌ చేయాలని అధికారులు కోరుతున్నారు. దీంతో క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులు అత్యవసర సేవల కోసం కాల్‌ చేస్తున్నారు. సాధారణ జలుబు, జ్వరం, దగ్గు ఉన్నా.. కొందరు ఫోన్‌ చేస్తున్నారని ఓ అధికారి చెప్పారు. సీజన్‌ మారిన నేపథ్యంలో కొందరికి సాధారణంగానే జలుబు, జ్వరం లాంటివి వస్తున్నాయని వైద్యులుచెబుతున్నారు. 



Updated Date - 2020-07-05T07:58:11+05:30 IST