పెరుగుతున్న పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-06-06T09:46:12+05:30 IST

పొరుగు నుంచి వస్తున్న వారిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం

పెరుగుతున్న పాజిటివ్‌లు

ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారివే ఎక్కువ కేసులు


ఒంగోలు నగరం, జూన్‌ 5: పొరుగు నుంచి వస్తున్న వారిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, విదేశాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు చేసిన అనంతరమే వారికి వారి ఇళ్లకు పంపించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఇతర ప్రాం తాల నుంచి వస్తున్న వారి పట్ల మెతకవైఖరి అవలంభించిన అధికారులు ఇకనుంచి నిబంధనలను కఠినతరం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వారి ఇళ్లకు పంపకుండా వారిని నేరుగా ఆయా ప్రాంతాల్లోని క్వారంటైన్‌కు తరలించి అక్కడ ఐదురోజులు ఉంచి వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాతే ఇళ్ళకు పంపించనున్నారు. 


నెగెటివ్‌ వస్తే ఇంటికి.. పాజిటివ్‌ వస్తే రిమ్స్‌కి

కాగా ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్న వారిని ముందుగానే గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. పరీక్షలు చేసి నెగటివ్‌ వస్తే ఇంటికి.. పాజిటివ్‌ వస్తే రిమ్స్‌ ఐసోలేషన్‌కు పంపిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి వస్తున్న వారిసంఖ్య రోజురోజుకీ ఎక్కువ అవుతుండటంతో రైళ్ళలో, విమానాల్లో వచ్చేవారి వివరాలను సేకరించి ముందుగానే క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. ఇక ప్రత్యేక వాహనాలు, సొంత వాహనాలు ద్వారా జిల్లాలోని ప్రవేశించి ఇళ్లకు పోతున్న వారిని కూడా కట్టడి చేస్తున్నారు.  


ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ

లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు ఇచ్చిన తర్వాత జనజీవనం సాధారణస్థితికి చేరుకుంటోంది. బస్సులు రోడ్డెక్కాయి. రైళ్లు తిరిగి పట్టాలెక్కాయి. హోటళ్లు, కార్యాలయాలు, ఇతర కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిం చే అవకాశం ఉంది. ఇక అవగాహ న కలిగించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే కరోనా అడ్డుకట్ట వేసే దిశగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. వైద్యఆరోగ్యశాఖ ఇందుకోసం ప్రత్యేకంగా కరపత్రాలను రూపొందించింది. ఈ కరపత్రాలను గడపగడపకు చేర్చాలని నిర్ణయించారు. గ్రామాల్లో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా పంచాలని నిర్ణయించింది. 


కంటైన్మెంట్లలో ఫివర్‌ క్లినిక్‌లు

అలాగే కంటైన్మెంట్‌గా ప్రకటిస్తున్న ప్రాం తాల్లో వైద్యారోగ్యశాఖ ప్రత్యేకంగా ఫీవర్‌ క్లినిక్‌లను నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో జ్వరం ఇతర కరోనా లక్షణాలు ఉంటే వారికి వెంటనే చికిత్సనందించి పరీక్షలు నిర్వహించేందుకు వాటిని ఏర్పాటుచేస్తోం ది. కరోనా లక్షణాలు ఉన్నవారు ఈ క్లినిక్‌లకు వచ్చి పరీక్షలు చేయించుకోవటం ద్వా రా వారిని త్వరితగతిన గుర్తించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 


కందుకూరు, ఎస్‌ఎన్‌పాడులో పాజిటివ్‌లు..మరో రెండు- జిల్లాలో 113కి చేరిన కేసులు

ఒంగోలు నగరం: జిల్లాలో శుక్రవారం మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిద్దరు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి వచ్చినవారే. కందుకూరులో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇటీవలనే చెన్త్నె నుంచి వచ్చాడు. ఇతనికి వీఆర్‌డీఎల్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. సంతనూతలపాడులో కూడా మరో కేసు నమోదైంది. వారంక్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఇద్దరిని జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌కు తరలించి చికిత్సనందిస్తున్నారు. 

Updated Date - 2020-06-06T09:46:12+05:30 IST