పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-09-06T07:25:18+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే పరీక్షలు సగానికి సగం తగ్గిపోయాయి.

పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు

మూడు వారాల్లో రెట్టింపు

పరీక్షలు తగ్గినా పాజిటివ్‌లు అధికంగా నమోదు

పాఠశాలల్లో ప్రమాద ఘంటికలు

ఒంగోలు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే పరీక్షలు సగానికి సగం తగ్గిపోయాయి. అయినప్పటికీ పాజిటివ్‌లు అధికంగా నమోదవుతున్నాయి. మూడు వారాలుగా జిల్లాలో క్రమంగా రోజువారీ కొత్తగా వస్తున్న కేసులు పెరుగుతుండగా, వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య అందులో సగం మించి ఉండటం లేదు. యాక్టివ్‌ కేసులు 20 రోజుల క్రితం నాటి కంటే ఇంచుమించు రెట్టింపుగా కనిపిస్తున్నాయి. ఒకవైపు గత నెల రెండో పక్షంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగడం, మరోవైపు పాఠశాలలు తెరుచుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో గత నెల తొలివారంలో రోజువారీ 150నుంచి 200 వరకూ కేసులు నమోదయ్యాయి. అప్పటికి వైరస్‌ బారిన పడి కోలుకొనే వారి సంఖ్య అంతకన్నా ఎక్కువగానే ఉంది. 15వతేదీ నాటికి యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోయింది. జిల్లాలో ఆగస్టు 6న 185 కొత్త కేసులు నమోదు కాగా 274 మంది డిశ్చార్జి అయ్యారు. ఆ రోజుకు యాక్టివ్‌ కేసులు 2529 ఉన్నాయి. అనంతరం వారం, పదిరోజులు కొత్త కేసుల కన్నా డిశ్చార్జిలు అధికంగా ఉంటూ 15వ తేదీ నాటికి క్రియాశీల కేసుల సంఖ్య 1160కి తగ్గిపోయింది. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలతోపాటు వ్యవసాయ పనులు యథావిధిగా సాగిపోతున్నాయి. గతనెల రెండో పక్షం నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో పాటుపెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతరశుభకార్యాలు జోరుగా సాగాయి. దీనికితోడు వానల జోరుతో సీజనల్‌ వ్యాధుల ఉధృతి పెరిగి వైరస్‌ వ్యాప్తికి దోహదం చేశాయి. దీంతో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. 


కేసుల కన్నా డిశ్చార్జిలు తక్కువ 

జిల్లాలో ప్రస్తుతం రోజువారీ 100 నుంచి 150 వరకూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. డిశ్చార్జిలు మాత్రం అందులో సగం కూడా ఉండటం లేదు. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య అధికమవుతోంది. గతనెల 15న జిల్లాలో 1160 మాత్రమే ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య శనివారం నాటికి 2187కు చేరింది.  దీనికితోడు జిల్లాలో ఉన్న 100 పీహెచ్‌సీలలో నిత్యం 20నుంచి 25 పీహెచ్‌సీల పరిధిలో పాజిటివిటీ శాతం 5 కన్నా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలల్లో అయితే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు వైరస్‌ బారిన పడుతున్నారు. వాస్తవానికి కరోనా పరీక్షలు గతంలో మాదిరి చేస్తే కేసుల నమోదు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో రోజువారీ 9వేల నుంచి 10వేల వరకూ చేసే పరీక్షలు ప్రస్తుతం 5వేల లోపుగానే ఉంటున్నాయి. అయినప్పటికీ వారం నుంచి నిత్యం 100నుంచి 150 కేసులు నమోదవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం పరీక్షలు చేసిన వారిలో సగటున 2.50నుంచి 3శాతం పాజిటివ్‌ కేసులు ఉంటుండగా, అనధికారంగా అనేక మంది పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందుతున్నారు. ఆలాంటివి లెక్కలోకి రావడం లేదు. 


Updated Date - 2021-09-06T07:25:18+05:30 IST