పెరుగుతూనే.. జిల్లాలో కొత్తగా 781 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-13T07:31:25+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏకంగా 26 వేలు దాటిపోయాయి. బుధవారం జిల్లాలో మరో 781 మందికి

పెరుగుతూనే.. జిల్లాలో కొత్తగా 781 మందికి కరోనా పాజిటివ్‌

 26 వేలు దాటిన కేసులు

 ఏడుగురి మృతి

 195కి చేరిన మరణాలు

 కొవిడ్‌ కేంద్రాల్లో అందని వైద్యం

 లబోదిబోమంటున్న బాధితులు


అనంతపురం వైద్యం, ఆగస్టు 12: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏకంగా 26 వేలు దాటిపోయాయి. బుధవారం జిల్లాలో మరో 781 మందికి కరోనా సోకింది. దీంతో బాధితుల సంఖ్య 26478కి చేరింది. ఒక్క రోజులోనే ఏడుగురు వైరస్‌తో మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 195కి పెరిగింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 19625 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మిగిలిన వారు హోంఐసోలేషన్‌, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


కొవిడ్‌ కేంద్రాల్లో బాధితులకు తప్పని కష్టాలు

జిల్లాలో అవసరమైన వసతులు, వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. కరోనా బాధితులకు  కష్టాలు తప్పట్లేదు. ప్రధానంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో కరోనా బాధితులను పట్టించుకోవట్లేదు. కేవలం భోజనం అందిస్తూ వైద్యం గురించి మరిచిపోయారని బాధితుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం కొంత మంది బాధితులను ఎస్కేయూ నుంచి పీవీకేకే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు.


రాత్రి భోజనం పెట్టారు. ఒక్క మాత్ర కూడా ఇవ్వలేదు. కొందరు తీవ్ర జ్వరం, తలనొప్పి, ఆయాసంతో బాధ పడుతున్నా.. పలకరించే నాఽథుడే కానరాలేదని బాధితులు ‘ఆంధ్రజ్యోతి’తో వాపోయారు. జిల్లాలో ఇతర కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో కూడా ఇదే పరిస్థితి. వైద్యులు అటు వైపు కూడా వెళ్లట్లేదు. ఒకరిద్దరు కిందిస్థాయి వైద్య సిబ్బంది మాత్రమే అక్కడ ఉంటున్నారు. వారికి కూడా సరైన రక్షణ పరికరాలు లేకపోవటంతో బాధితులను పట్టించుకోవడంలేదు. దీంతో కరోనా బాధితులు మరింత భయంతో బతకాల్సి వస్తోంది.


1064 మంది డిశ్చార్జ్

జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న 1064 మందిని డిశ్చార్జ్‌ చేశారు. నేడు 29 ప్రాంతాల్లో నమూనాల సేకరణ జిల్లాలో గురువారం 29 ప్రాంతాల్లో మొబైల్‌ వాహనాల ద్వారా కరోనా నమూనాలు సేకరించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ధర్మవరంలోని ఇందిరమ్మకాలనీ, ఎల్‌సీకేపురం, దుర్గానగర్‌, శివనగర్‌, కాలేజ్‌ గ్రౌండ్‌, శాంతినగర్‌ ప్రైమరీ స్కూల్‌, 11వ వార్డు ప్రైమరీ స్కూల్‌, కొత్తపేట, ధర్మవరం సీహెచ్‌సీ, ముదిగుబ్బ పీహెచ్‌సీ, గుడ్‌షెడ్‌ కొట్టాల గవర్నమెంట్‌ స్కూల్‌, కూడేరు, వజ్రకరూరు, విడపనకల్లు, గడేహోతూరు, పాల్తూరు, పెద్దకౌకుంట్ల, రాకెట్ల, బెళుగుప్ప, శ్రీరంగాపురం, కొనకొండ్ల, కదిరి, హిందుపురం, కళ్యాణదుర్గం, బత్తలపల్లితోపాటు జిల్లా కేంద్రంలో ఎస్‌ఎస్‌బీఎన్‌, పాతూరు ఆసుపత్రి, ఆర్ట్స్‌ కళాశాల, రుద్రంపేట ప్రాంతాల్లో నమూనాలు సేకరిస్తామన్నారు.

Updated Date - 2020-08-13T07:31:25+05:30 IST