విరాట్‌కు రుణపడి ఉంటా

ABN , First Publish Date - 2021-05-12T10:47:47+05:30 IST

అంతర్జాతీయ కెరీర్‌లో తన ఎదుగుదల వెనుక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అండ ఎంతో ఉందని హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చెప్పాడు. కెరీర్‌,

విరాట్‌కు రుణపడి ఉంటా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ కెరీర్‌లో తన ఎదుగుదల వెనుక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అండ ఎంతో ఉందని హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చెప్పాడు. కెరీర్‌, జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనప్పుడు విరాట్‌ మద్దతుగా నిలిచాడని తెలిపాడు. అతడికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా తన తండ్రి మరణించినప్పుడు కోహ్లీ ఎంతో ఓదార్చాడని తెలిపాడు. ‘ఎలాంటి వికెట్‌పైనైనా ఆడగల సామర్థ్యం ఉంది. ఎలాంటి బ్యాట్స్‌మన్‌నైనా అవుట్‌ చేయగలవు అని విరాట్‌ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా నాన్నను కోల్పోయా. ఎంతో దిగాలుపడ్డా.. కనీసం ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేను.


ఆ సమయంలో విరాట్‌ నా రూమ్‌కు వచ్చి గట్టిగా హత్తుకొని ఓదార్చాడు. నీకు అండగా ఉంటా.. భయపడకు అని భరోసా ఇచ్చాడు. ఆ మాటలు నాకెంతో ప్రేరణ ఇచ్చాయి. ఆ టూర్‌లో కోహ్లీ ఒక్క టెస్ట్‌ మాత్రమే ఆడాడు. కానీ, ఇంటికెళ్లాక కూడా అతను సందేశాలు పంపుతూ, ఫోన్‌ కాల్‌ చేస్తూ ఎంతో స్ఫూర్తిని నింపాడు’ అని సిరాజ్‌ చెప్పాడు. కోహ్లీ సారథ్యంలోని ఐపీఎల్‌ జట్టు బెంగళూరు తరఫున సిరాజ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రసుత్తం సిరాజ్‌ ఇంగ్లండ్‌ టూర్‌ కోసం  సిద్ధమవుతున్నాడు. ’

Updated Date - 2021-05-12T10:47:47+05:30 IST