Abn logo
Aug 15 2020 @ 04:40AM

నేడు స్వాతంత్య్ర వేడుకలు..సర్వం సిద్ధం

  కరోనా నిబంధనలతో కార్యక్రమాల కుదింపు

 ప్రశంసాపత్రాల స్థానంలో వారియర్స్‌కు సన్మానాలు

 ఇద్దరు ముగ్గురితోనే సాంస్కృతిక కార్యక్రమాలు

 స్టాళ్ల ఏర్పాటు రద్దు


అనంతపురం, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నిబంధనలను అనుసరిస్తూ శనివారం ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు,  ఎస్పీ సత్యయేసుబాబు పర్యవేక్షణలో సంబంధిత అధికారులు.. పోలీసు పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లు చేశారు. వేదికను పూలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వేడుకలను వీక్షించేందుకు హాజరయ్యే వారి కోసం కరోనా నిబంధనలకు అనుగుణంగా దూరదూరంగా కుర్చీలు అమర్చారు.


ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆశీనులయ్యేందుకు వేదికకు ఇరువైపులా సీట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో వేదిక మీదుగా సాయుధ పోలీసు బలగాలు కవాతు నిర్వహించేందుకు ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేశారు. ఈ వేడుకల ముఖ్య అతిథి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ పరేడ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సాయుధ బలగాల సంఖ్యను తగ్గించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో కొన్ని కార్యక్రమాలను కుదించారు.


ఏటా వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసేవారు. ఈసారి ఆ కార్యక్రమాన్ని మరో రూపంలోకి మార్చారు. ఆ స్థానంలో కొవిడ్‌ నియంత్రణలో ఉత్తమ సేవలందించిన వారియర్స్‌ను సన్మానించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఇదివరకూ పదుల సంఖ్యలో విద్యార్థులతో నిర్వహించేవారు. ఈసారి ఇద్దరుముగ్గురితోనే.. అందులోనూ ఐదు కార్యక్రమాలను మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.


14 ఏళ్లు పైబడిన విద్యార్థులకే అవకాశం కల్పించారు. శకటాల సంఖ్య కూడా తగ్గనుంది. కేవలం ఐదు శాఖల శకటాలకే అనుమతిచ్చారు. ఈసారి పూర్తిస్థాయిలో స్టాల్స్‌ ఏర్పాటును రద్దు చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన, 10 ఏళ్లలోపు పిల్లలు పంద్రాగస్టు వేడుకలను వీక్షించేందుకు అనుమతి నిరాకరించారు. జిల్లా పోలీసు యంత్రాంగం శుక్రవారం పరేడ్‌ మైదానంలో రిహార్సల్స్‌ నిర్వహించింది. సాయుధ బలగాల కవాతులో లోపాలకు తావులేకుండా రిహార్సల్స్‌ చేశారు.


వేడుకల షెడ్యూలిదీ..

ఉదయం 8.30 గంటలకు స్వాతంత్య్ర వేడుకలు ప్రారంభం.


8.47కి పరేడ్‌ కమాండెంట్‌ నుంచి జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరిస్తారు.


8.52కి జిల్లా కలెక్టర్‌ పరేడ్‌ కమాండెంట్‌, సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.


8.57కి వేడుకలకు ముఖ్య అతిథి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ పరేడ్‌ మైదానానికి చేరుకుంటారు.


9.00కి జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించి, గౌరవ వందనం చేస్తారు.


9.05కి సాయుధ బలగాల నుంచి మంత్రి గౌరవ వందనం అందుకుంటారు.


9.20కి పంద్రాగస్టు సందేశాన్ని మంత్రి చదివి, వినిపిస్తారు

.

9.45కి సాయుధ బలగాల కవాతు


9.50కి శకటాల ప్రదర్శన


10.20కి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

10.50కి కరోనా వారియర్స్‌, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సన్మానం.

Advertisement
Advertisement
Advertisement