ఏడు ప్రసంగాలు– ఎన్నో ప్రగల్భాలు

ABN , First Publish Date - 2021-08-18T06:40:59+05:30 IST

2019, 2020, 2021... ఈ మూడు సంవత్సరాల లోనూ ప్రధాని మోదీ తన స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగాలలో ..

ఏడు ప్రసంగాలు– ఎన్నో ప్రగల్భాలు

ధానమంత్రి నరేంద్రమోదీ 2016 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట పైనుంచి ప్రసంగిస్తూ దేశరాజధాని ఢిల్లీకి మూడు గంటల దూరంలో ఉన్న నగ్లా ఫటేలా గ్రామానికి విద్యుచ్ఛక్తి రావడానికి ఏడు దశాబ్దాలు పట్టిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ గ్రామంలో పిల్లలు మోదీ ప్రసంగాన్ని టీవీలో చూస్తున్న దృశ్యాల్ని అప్పటి విద్యుత్ మంత్రి పీయూష్ గోయెల్ తన ట్వీట్‌లో ప్రదర్శించారు. కాని ఆ గ్రామ సర్పంచ్ ప్రభుత్వ వ్యాఖ్యల్ని బాహాటంగా ఖండించారు. ‘మా గ్రామంలో విద్యుత్ లేనే లేదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిల్లలు టీవీ చూస్తున్న దృశ్యాలు మా గ్రామానికి చెందినవి కానే కావు..’ అని ఆయన మీడియాకు చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా ప్రధానమంత్రి తన ఎర్రకోట ప్రసంగాల్లో నూటికి నూరు శాతం విద్యుద్దీకరణ గురించి చెప్పుకుంటూనే ఉన్నారు. కాని చాలా గ్రామాల్లో విద్యుత్ లేదని, కనెక్షన్లు లేని మీటర్లు గోడలకు వేలాడుతూనే ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. 2016లో ప్రధాని పుణ్యమా అని హత్రాస్ జిల్లాలోని నగ్లా ఫటేలా గ్రామం వార్తల్లోకెక్కింది. 2020లో మొత్తం హత్రాస్ జిల్లాయే వార్తల్లోకెక్కింది. ఈ జిల్లాలోని మరో గ్రామం బూల్‌ఘరీలో ఒక దళిత మహిళపై అగ్రవర్ణాల యువకులు కొందరు అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు. మన దేశ ప్రగతికి కుల, మత తత్వాలు, ప్రాంతీయవాదం, సామాజిక, ఆర్థిక వివక్షలు అడ్డంకులని 2014లో ప్రధాని మోదీ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఎంతో ఆవేదనతో ఘోషించినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రజలు పట్టించుకున్నట్లు లేదు.


2014లోనే ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని మోదీ తొలిసారి ఎర్రకోటలో వినిపించారు. ‘రండి, దేశంలో ఉత్పత్తి చేయండి..’ అని ఆహ్వానం పలికారు. కాని గత ఏడేళ్లుగా దేశంలో ఉత్పాదక రంగం అభివృద్ధి అంతంత మాత్రమే ఉన్నది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా చేసే ప్రాజెక్టులు, ఆస్తుల కల్పన, ఉపాధి కల్పనలో పెట్టుబడులు గత పదేళ్లలో 34.3 శాతం నుంచి 27.1 శాతానికి తగ్గిపోయాయి. భారీ ఎత్తున ప్యాకేజీలు కల్పిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనల వర్షం కురిపిస్తున్నా, అత్యధిక ఉపకరణాల వ్యయం, తక్కువ డిమాండ్ మూలంగా తాము సగం సామర్థ్యాన్నే ఉపయోగిస్తున్నామని సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం చెబుతుండగా, కార్పొరేట్లు కూడా తమ సంస్థల్లో అనుకున్నంత పనిజరగడం లేదని ఒప్పుకుంటున్నారు. ‘2014–19లో మనది 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేయబోతున్నాం..’ అని 2019లో స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా మోదీ ప్రకటించారు. కాని మన పెట్టుబడుల రేటు 40శాతం పెంచి, ఆదాయాలు, ఉపాధి కల్పన, అవకాశాలు పెరిగితే కాని ఆర్థిక వ్యవస్థ ఊపందుకునేలా లేదు. 


తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనే మోదీ ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ను ప్రకటించారు. ఎంపీలు తమ నియోజకవర్గంలోనే ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకుని అభివృద్ధిపరచాలని, దాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాలని ఆయన సూచించారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సమీక్షిస్తే ఈ పథకం క్రింద ఏ గ్రామమూ అభివృద్ధి చెందలేదని తేలింది. చాలా మంది బిజెపి ఎంపీలే ప్రధానమంత్రి పిలుపును పట్టించుకోలేదని, తమ ఎంపీ నిధుల్లో నుంచి డబ్బు కేటాయించలేదని స్పష్టమైంది.


వచ్చే ఆగస్టు కల్లా దేశంలో బాలికలు, బాలురకు శౌచాలయ సౌకర్యాలు లేని ఏ స్కూలూ ఉండరాదని కూడా ప్రధాని తన ప్రసంగంలో నిర్దేశించారు. 2020లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో 40శాతం స్కూళ్లలో శౌచాలయాలు లేనే లేవని, కొన్ని చోట్ల సగమే కట్టారని, కొన్ని చోట్ల ఉపయోగించే విధంగా లేవని తేలింది. 70శాతం స్కూళ్లలో శౌచాలయాల్లో నీటి సదుపాయమే లేదని, 75శాతం శౌచాలయాలు అపరిశుభ్రంగా ఉన్నాయని కాగ్ తేల్చింది. దేశంలో 15వేల ప్రభుత్వ స్కూళ్లలో శౌచాలయాలు లేవని, 42వేల స్కూళ్లలో త్రాగునీటి సదుపాయాలు లేవని 2021 మార్చిలో నాటి విద్యామంత్రి రమేశ్ పోఖ్రియాల్ రాజ్యసభలోనే ప్రకటించారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పోఖ్రియాల్‌ను తీసేసి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పారు. నిర్మలా సీతారామన్ లాగా అంతా అద్భుతంగా ఉందని చెప్పాలి కాని నిజాలు చెపితే తలలు ఎగిరిపోతాయని రమేశ్ పోఖ్రియాల్‌కు అర్థం కాలేదనుకోవాలి.


2015 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘స్టార్టప్ ఇండియా’ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ తాజాగా పరిస్థితిని సమీక్షిస్తే భారతదేశంలో 90 శాతం స్టార్టప్‌లు ప్రారంభమైన తొలి ఐదు సంవత్సరాల్లోనే విఫలమైనట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలను సమీక్షించి వాటిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకున్న దృష్టాంతాలు కనపడడం లేదు. 2022 కల్లా భారత దేశంలో ఇళ్లు లేని వారంటూ ఉండరని కూడా మోదీ ఆ సందర్భంగా ప్రకటించారు. కాని 17కోట్ల మంది నిరాశ్రయులై ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనే వేలాది మంది నైట్ షెల్టర్లలోనూ, పేవ్‌మెంట్లపైనా నిద్రిస్తున్నారని ప్రధానమంత్రి మోదీ మారువేషం వేసుకుని ఒక రోజు ఢిల్లీ రోడ్లపై తిరిగితే తెలుస్తుంది.


2016 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో గ్రామీణ రహదారుల కార్యక్రమాన్ని బృహత్తరంగా అమలు చేస్తున్నట్లు మోదీ చెప్పుకున్నారు. కాని 26 నుంచి 30 శాతం గ్రామాలకు పక్కా రోడ్లు లేవని విశ్వసనీయ సమాచారం చెబుతోంది. తాము కాలం చెల్లిన 1200 చట్టాలను రద్దు చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సగర్వంగా అదే ప్రసంగంలో చెప్పుకున్నారు. కానీ ‘మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, బాలగంగాధర్ తిలక్ లాంటి వారిని అరెస్టు చేసేందుకు కారణమైన వలస పాలన కాలం లాంటి ఐపీసీలోని సెక్షన్ 124-–ఎను ఇంకా కొనసాగించడం అవసరమా?’ అని సుప్రీంకోర్టు ఇటీవలే ప్రశ్నించిన విషయం మోదీకి తెలియదనుకోకూడదు. సుప్రీంకోర్టు రద్దు చేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66-–ఎను కూడా పోలీసులు ఉపయోగిస్తున్న విషయాన్ని కూడా ఉన్నత న్యాయస్థానం గుర్తు చేయాల్సి వచ్చింది. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తున్నామనే పేరుతో 2016లో ఒక చట్టాన్ని పెద్దగా చర్చ లేకుండా రద్దు చేసి భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ప్రభుత్వ వాటాలను అమ్ముకున్నారని ఎంతమందికి తెలుసు?


2017 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించిన ‘జెమ్’ పోర్టల్ కానీ, ‘ప్రధానమంత్రి కృషి సింఛాయ్ యోజన’ కానీ అనుకున్న ఫలితాలు సాధించలేదు. ప్రభుత్వ విభాగాలకు అవసరమైన వస్తువులు, సేవల సేకరణలో అవినీతిని నిరోధించేందుకు ఉద్దేశించిన జెమ్ పోర్టల్ ద్వారా ప్రతి ఏడాది రూ.7 నుంచి రూ.8 లక్షల కోట్ల వస్తు సేవల సేకరణ పారదర్శకంగా జరగాలని భావించారు. కాని అది రూ.లక్ష కోట్ల సేకరణ కూడా అతి కష్టమ్మీద చేయగలుగుతోంది. అదేవిధంగా పంటలకు నీరందించేందుకు ఉద్దేశించిన ‘కృషి సింఛాయ్ యోజన’కు అనుకున్న విధంగా నిధులు కేటాయించడం కానీ, లక్ష్యాలను సాధించడం కానీ జరగలేదని గణాంక వివరాలు పరిశీలించిన వారెవరికైనా తెలుస్తుంది. ‘ప్రతి ఇంటికీ నీరు’ పథకం కూడా ఇదే విధంగా నీరుగారింది. భారతదేశంలో 9కోట్ల మందికి కనీస తాగునీటి వసతి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. ఇదే సంవత్సరంలో ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం ప్రధానమంత్రి ‘కిసాన్ సంపద యోజన’ను ప్రకటించారు. అయితే ఈ పథకం కింద సమకూర్చిన నిధులను ఆహారోత్పత్తుల పరిశ్రమలు సరిగా ఉపయోగించలేదని, 430 ప్రాజెక్టుల్లో 103 ప్రాజెక్టులను రద్దు చేశారని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల సమర్పించిన నివేదికలో పేర్కొంది. 


దేశంలో పేద ప్రజలెవరూ అనారోగ్యంతో మరణించకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన ఆరోగ్య అభియాన్‌ను ప్రారంభించామని మోదీ 2018 స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రకటించారు. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన సమయంలో ఈ పథకం పేద ప్రజలకు పెద్దగా ప్రయోజనాలను సమకూర్చలేదని ఆనాటి పరిస్థితులు, గణాంక వివరాలను అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. మహిళా అధికారులకు సాయుధ దళాల్లో శాశ్వత కమిషన్ ఏర్పాటుచేస్తున్నట్లు తాను సగర్వంగా ప్రకటిస్తున్నానని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. కాని అది సరిగా ఆచరణలోకి రాకపోవడంతో 2020లో సుప్రీంకోర్టు కలుగజేసుకుని మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో సాయుధ దళాల్లో అత్యధిక పాత్ర వారికి లభించేందుకు ఆస్కారం లభించింది.


2019, 2020, 2021... ఈ మూడు సంవత్సరాల లోనూ ప్రధాని మోదీ తన స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగాలలో ఒకే హామీని ప్రకటించారు. దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.100లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన ఈ మూడుసార్లూ దేశ ప్రజలకు తెలిపారు. మోదీ ఏడేళ్ల ప్రసంగాల్లో అనేక హామీలు పునరావృతమయ్యాయి. ప్రతి ఆగస్టు 15న ఎర్రకోట నుంచి గంటకు తక్కువ కాకుండా మోదీ చేస్తున్న ప్రసంగాల్లో ఆయన హావభావాలు తప్ప ప్రజలకు ఒరిగేది ఏమున్నది?



ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

ఎ. కృష్ణారావు

Updated Date - 2021-08-18T06:40:59+05:30 IST