2021 చివరి కల్లా దేశవాసులందరికీ వ్యాక్సిన్..

ABN , First Publish Date - 2021-05-14T16:45:16+05:30 IST

ఈ ఏడాది డిసెంబర్ కల్లా దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ ఇవ్వాలని భారత్..

2021 చివరి కల్లా దేశవాసులందరికీ వ్యాక్సిన్..

న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ కల్లా దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా మిగులు ఉంటుందని మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయనే వార్తల నేపథ్యంలో డాక్టర్ పాల్ తాజా ప్రకటన చేశారు.


రాబోయే ఐదు మాసాల్లో (ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ) ఇండియాలో 2 బిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులు తయారవుతాయని, అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే దిశగా పురోగమిస్తున్నామని పాల్ చెప్పారు. వచ్చే ఏడాది తొలి మూడు నెలల నాటికి వ్యాక్సిన్ డోసుల సంఖ్య 300 కోట్లకు కూడా పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడంలో ఎలాంటి సందేహాలకు తావులేదని ఆయన వివరించారు. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ 216 కోట్ల డోసుల తయారీ అంచనాగా ఉందని, ఇందులో 75 కోట్ల కోవిషీల్డ్ డోసులు, 55 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఉంటాయని చెప్పారు. బయోలాజికల్ ఇ సబ్‌యూనిట్ వ్యాక్సిన్ 30 కోట్ల డోసులు, స్పుట్నిక్ వి 15.6 కోట్ల డోసులు, జైడస్ కాడిలా 5 క్రోర్.. 5 కోట్ల డోసులు, నొవావాక్స్ 20 కోట్ల డోసులు, నాసల్ వ్యాక్సిన్ (భారత్ బయోటక్) 10 కోట్ల డోసులు, జెన్నోవా 6 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని డాక్టర్ పాల్ చెప్పారు.

Updated Date - 2021-05-14T16:45:16+05:30 IST