గోగ్రా నుంచి దళాల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకారం

ABN , First Publish Date - 2021-08-03T22:22:30+05:30 IST

లడఖ్‌లో భారత్-చైనా మధ్య ఏర్పడిన సంక్షోభ పరిష్కారంలో

గోగ్రా నుంచి దళాల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకారం

న్యూఢిల్లీ : లడఖ్‌లో భారత్-చైనా మధ్య ఏర్పడిన సంక్షోభ పరిష్కారంలో ముఖ్యమైన ముందడుగు పడింది. తూర్పు లడఖ్‌లోని గోగ్రా హైట్స్ ఏరియా నుంచి దళాలను ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ప్రాంతంలోకి చైనా దళాలు రావడంతో గత ఏడాది మే నెల నుంచి భారత దళాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. అప్పటి నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర పడే దిశగా తాజాగా అంగీకారం కుదిరింది. 


ప్రభుత్వ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, భారత్, చైనా సైనిక కమాండర్ల పన్నెండో విడత చర్చలు శనివారం జరిగాయి. వాస్తవాధీన రేఖ వెంబడి మోల్డోలో జరిగిన ఈ చర్చలు సుమారు 9 గంటలపాటు కొనసాగాయి. గోగ్రా హైట్స్ నుంచి ఇరు దేశాల సైన్యాలను ఉపసంహరించుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. దీనికి అనుగుణంగా తదుపరి చర్యలపై త్వరలోనే కార్యాచరణను నిర్ణయించే అవకాశం ఉంది.


పాంగాంగ్ సో ప్రాంతం నుంచి దళాలను ఉపసంహరించుకునేందుకు ఆరు నెలల క్రితం ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. పన్నెండో విడత కార్ప్స్ కమాండర్ లెవెల్ సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని, పరస్పర అవగాహనను పటిష్టపరిచిందని ఇరు వర్గాలు పేర్కొన్నాయి. 


Updated Date - 2021-08-03T22:22:30+05:30 IST