T20 World Cup: ఒకే గ్రూపులో భారత్-పాక్ జట్లు

ABN , First Publish Date - 2021-07-16T21:46:43+05:30 IST

భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా వైరస్ కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తరలిపోయినప్పటికీ ఆతిథ్యం

T20 World Cup: ఒకే గ్రూపులో భారత్-పాక్ జట్లు

దుబాయ్: భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా వైరస్ కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తరలిపోయినప్పటికీ ఆతిథ్యం ఇస్తున్నది మాత్రం బీసీసీఐనే. ఈ ఏడాది అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు టోర్నీ జరగనుంది. తాజాగా, ఈ టోర్నీకి సంబంధించిన గ్రూప్స్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇందులో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ జట్లు ఒకే గ్రూపులో ఉండడంతో క్రికెట్ అభిమానులకు బోల్డంత మజా లభించనుంది. 


టీ20 మాజీ చాంపియన్లు అయిన ఇండియా, పాకిస్థాన్‌తోపాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు గ్రూప్ 2లో ఉన్నాయి. అలాగే, రౌండ్ 1 నుంచి రెండు క్వాలిఫయింగ్ జట్లు ఇందులో ఉంటాయి. ఆటోమెటిక్ క్వాలిఫయర్లు అయిన శ్రీలంక, బంగ్లాదేశ్‌తోపాటు 8 జట్లు తొలి రౌండ్‌లో తలపడతాయి. మిగతా ఆరు జట్లు 2019 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ద్వారా నేరుగా తమ స్థానాలను పదిలం చేసుకున్నాయి. ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియాలు గ్రూప్ ఎలో శ్రీలంకతో తలపడతాయి. ఒమన్, పపువా న్యూ గినియా (పీఎన్‌జీ), స్కాట్లాండ్ జట్లు గ్రూప్‌ బిలో బంగ్లాదేశ్‌తో తాడోపేడో తేల్చుకుంటాయి. 


ఇక, గ్రూప్ 1లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. గ్రూప్ ఎ విజేత జట్టు, గ్రూప్ బి రన్నరప్ జట్లు సూపర్ 12లో గ్రూప్ 1కి చేరుకుంటాయి. గ్రూప్ బి విజేత, గ్రూప్ ఎ రన్నరప్ జట్లు గ్రూప్ 2లో భాగం అవుతాయి. 

Updated Date - 2021-07-16T21:46:43+05:30 IST