ఎవరిదో.. గులాబీ గుభాళింపు!

ABN , First Publish Date - 2020-12-17T06:34:21+05:30 IST

కరోనా వైర్‌సతో అతలాకుతలమైన ప్రపంచ ప్రజల జీవనం నెమ్మదిగా గాడిన పడుతోంది. క్రీడా లోకంలోనూ ఒక్కొక్క టిగా అంతర్జాతీయ టోర్నమెంట్లు ఊపందుకుంటున్నాయి...

ఎవరిదో.. గులాబీ గుభాళింపు!

  • ఎనిమిదో డే/నైట్‌ విజయం కోసం ఆసీస్‌ ఆరాటం 
  • పట్టుకోసం భారత్‌ పోరాటం
  • నేటి నుంచే తొలి టెస్ట్‌
  • సోనీ టెన్‌-1, 3, సోనీ సిక్స్‌లో
  • ఉ. 9.30 నుంచి


కరోనా వైర్‌సతో అతలాకుతలమైన ప్రపంచ ప్రజల జీవనం నెమ్మదిగా గాడిన పడుతోంది. క్రీడా లోకంలోనూ ఒక్కొక్క టిగా అంతర్జాతీయ టోర్నమెంట్లు ఊపందుకుంటున్నాయి. ఐపీఎల్‌తో మొదలైన క్రికెట్‌ సందడి ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటనతో మరింత జోరందుకుంది..వన్డే సిరీస్‌ను ఆసీస్‌, టీ20 సిరీ్‌సను కోహ్లీసేన గెలుచుకొని సమవుజ్జీలుగా నిలిచాయి..ఇక రెండు జట్లకు అసలు సిసలు పరీక్ష గురువారం నుంచి అడిలైడ్‌లో జరిగే డే/నైట్‌ టెస్ట్‌తో ఎదురు కానుంది..గత పర్యటనలో టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన టీమిండియా ఈసారీ ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది..మరోవైపు క్రితం పర్యటనలో ఓటమికి భారత్‌పై బదులు తీర్చుకోవడంతోపాటు బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది. ఆడిన ఏడు గులాబీ టెస్ట్‌ల్లోనూ గెలుపొందిన ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది..కానీ ఏకైక డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌ వంటి చిన్న జట్టుపై నెగ్గిన భారత్‌ కు పటిష్టమైన ఆసీ్‌సతో తలపడనుండడం పెను సవాలే..


అడిలైడ్‌: పొట్టి క్రికెట్‌లో తనకు తిరుగులేదని నిరూపిస్తూ టీ20 సిరీ్‌సను దక్కించుకున్న టీమిండియా ఆ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియాతో ‘సుదీర్ఘ సమరా’నికి సిద్ధమైంది. నాలుగు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్‌కు అడిలైడ్‌ ఓవల్‌లో తెరలేవనుంది. 2018-19 సిరీ్‌సలో ఇదే ఓవల్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించిన భారత్‌ ఆపై నాలుగు టెస్ట్‌ల ఆ సిరీ్‌సను 2-1తో అందుకుంది. ఈసారీ విజయంతో సిరీ్‌సకు నాంది పలకాలని అనుకుంటోంది.




పరిస్థితులు విభిన్నం..

కానీ ఈ దఫా పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ టెస్ట్‌ డే/నైట్‌లో జరుగుతోంది. గులాబీ బంతితో కోహ్లీసేన ఆడింది ఒక్క మ్యాచే. అదికూడా స్వదేశంలో బలహీన బంగ్లాదేశ్‌తో తలపడిం ది. మరోవైపు ఆస్ట్రేలియాకు డే/నైట్‌ టెస్ట్‌లలో అపార అనుభవం ఉంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టుకు ఓటమే లేదు. అంతేకాదు..అడిలైడ్‌లో ఆడిన నాలుగు గులాబీ టెస్ట్‌ల్లోనూ గెలుపొందిన రికార్డు ఆ జట్టు సొంతం. ఈ లెక్కలు చూస్తే తొలి టెస్ట్‌లో భారత్‌కు ఎలాంటి సవాలు ఎదురు కానుందో తెలుస్తుంది. అయితే సవాళ్లను ఎంతో ఇష్టపడే కెప్టెన్‌ కోహ్లీకి ఈ టెస్ట్‌ ఎంతో ముఖ్యమైనది. ఈ టెస్ట్‌ తర్వాత స్వదేశం తిరిగి వెళ్లనున్న విరాట్‌..ఈ మ్యాచ్‌లో విజయం అందించి తద్వారా సిరీ్‌సపై జట్టు పట్టు సాధించేందుకు తోడ్పడాల్సి ఉంటుంది. అత్యంత బలంగా ఉన్న భారత పేస్‌ బౌలింగ్‌ విభాగానిది ఈ సిరీ్‌సలో నిర్ణయాత్మక పాత్ర కానుంది. పదునైన బౌన్సర్లతో షమి, అద్భుత యార్కర్లతో బుమ్రా, వేగవంతమైన బంతులతో ఉమేష్‌ యాదవ్‌ పటిష్టంగా ఉన్న ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌ లైన్‌పను కట్టడి చేయాల్సి ఉంటుంది. స్పిన్నర్‌  అశ్విన్‌ ఆస్ట్రేలియాలో ఈసారైనా తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తాడేమో చూడాలి. భారత బ్యాట్స్‌మెన్‌ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. యువ పృథ్వీ షాతో కలిసి మయాంక్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో విఫలమైనా..సుదీర్ఘ ఫార్మాట్‌లో ఉన్న కొద్దిపాటి అనుభవం దృష్ట్యా పృథ్వీ షా పట్ల జట్టు మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపింది. అందువల్ల తనపై ఉంచిన నమ్మకాన్ని షా నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. గత పర్యటనలో భారీగా పరుగులు సాఽ దించి టెస్ట్‌ సిరీస్‌ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన పుజా ర, వైస్‌-కెప్టెన్‌ రహానెపైనా గురుతర బాధ్యత ఉంది. కెప్టెన్‌ కోహ్లీ ఎప్పటిలాగే ఆస్ట్రేలియాపై తన బ్యాటింగ్‌ ఫామ్‌ కొనసాగిస్తే జట్టుకు భారీ స్కో రు చేయగలదు. తెలుగు ఆటగాడు హనుమ విహారి కూడా తనపై ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఇక లోయర్‌ మిడిలార్డర్‌ బ్యా ట్స్‌మెన్‌ కూడా తమ వంతు భూమిక పోషించాల్సి ఉంటుంది. 


ఆస్ట్రేలియాకు గాయాల బెడద

2018-19లో భారత్‌ చేతిలో కంగుతిన్న ఆసీ్‌స..ఆపై టిమ్‌ పెయిన్‌ సారథ్యంలో క్రమంగా టెస్ట్‌ల్లో తిరుగులేని జట్టుగా ఎదిగింది. టీమిండియా చేతిలో ఆ సిరీస్‌ ఓటమి అనంతరం జరిగిన ఏడు టెస్ట్‌ల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించడం విశేషం. కానీ ప్రస్తుతం ఆ జట్టు గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమతమవుతోంది. స్టార్‌ ఓపెనర్‌ వార్నర్‌, పేసర్‌ అబాట్‌ గాయాలతో మొదటి టెస్ట్‌కు దూరమయ్యారు. అలాగే భారత్‌తో వామప్‌ పోరులో యువ బ్యాట్స్‌మన్‌ పుకోవ్‌స్కీ కంకషన్‌కు గురయ్యాడు. సీనియర్‌ ఆటగాడు స్మిత్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్నా..తొలి టెస్ట్‌లో అతడు ఆడే అవకాశాలున్నాయి. భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీ్‌సలో అదరగొట్టిన స్మిత్‌పై ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌ ప్రధానంగా ఆధారపడి ఉంది. ఓపెనర్లు టీమిండియా పేసర్లను ఎదుర్కొని భారీ స్కోరుకు పునాదులు వేయాల్సి ఉండగా, ఇక లబుషేన్‌, కెప్టెన్‌ పెయిన్‌, యువ ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ బ్యాట్‌ ఝుళిపించాల్సి ఉంటుంది. బౌన్సర్లతో భయపట్టే కమిన్స్‌, స్టార్క్‌, హాజెల్‌వుడ్‌తోపాటు స్పిన్నర్‌ లియాన్‌తో ఆసీస్‌ బౌలింగ్‌ బలంగా ఉంది. 

120 దేశాల్లో లైవ్‌: టెస్ట్‌ సిరీ్‌సను సుమారు 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ద్వైపాక్షిక సిరీ్‌సల్లో ఎక్కువ దేశాల్లో ప్రసారం కానున్న అతి పెద్ద టోర్నీ ఇదే కావడం విశేషం. ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ భారత్‌లో నాలుగు భాషల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.


పిచ్‌/వాతావరణం

గులాబీ బంతి ఎక్కువసేపు ప్రభావం చూపేందుకు డే/నైట్‌ మ్యాచ్‌ల్లో పిచ్‌పై అధికంగా పచ్చిక ఉంచుతారు. అయితే కూకాబుర్రా బంతుల తయారీలో మార్పులవల్ల వికెట్‌పై పచ్చిక ఉన్నా బ్యాట్స్‌మెన్‌ భయపడాల్సిన పని లేదు. అప్పుడప్పుడు చినుకులు పడే అవకాశమున్నా..మ్యాచ్‌పై ప్రభావం చూపేవిగా అవి ఉండబోవు.



జట్లు

భారత్‌ (తుది 11 మంది): కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, పుజార, అజింక్యా రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా, రవి అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌, షమి, బుమ్రా

ఆస్ట్రేలియా (అంచనా) : టిమ్‌ పెయిన్‌ (కెప్టెన్‌), జో బర్న్స్‌, వేడ్‌, లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, కమిన్స్‌, స్టార్క్‌, జోష్‌ హాజెల్‌వుడ్‌, నాథన్‌ లియాన్‌.



Updated Date - 2020-12-17T06:34:21+05:30 IST