వహ్వార్దిక్‌ ..

ABN , First Publish Date - 2020-12-07T10:14:46+05:30 IST

ఓవైపు 195 పరుగుల భారీ లక్ష్యం.. 18వ ఓవర్‌ ముగిసే సరికి భారత్‌ స్కోరు 170/4. ఇక మిగిలిన రెండు ఓవర్లలో చేయాల్సింది 25 పరుగులు. ఈ దశలో సూపర్‌ ఫినిషర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి తన

వహ్వార్దిక్‌ ..

చెలరేగిన పాండ్యా 

భారత్‌దే టీ20 సిరీస్‌  

ఆసీస్‌ రెండో పరాజయం


ఓవైపు 195 పరుగుల భారీ లక్ష్యం.. 18వ ఓవర్‌ ముగిసే సరికి భారత్‌ స్కోరు 170/4. ఇక మిగిలిన రెండు ఓవర్లలో చేయాల్సింది 25 పరుగులు. ఈ దశలో సూపర్‌ ఫినిషర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి తన స్ట్రోక్‌ప్లే పవర్‌ను చాటుకున్నాడు. వరుసగా పది బంతులాడిన అతను రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఛేదనను విజయవంతంగా పూర్తి చేసి సిరీస్‌ను దక్కేలా చేశాడు. ఆసీస్‌ తరఫున వేడ్‌, స్మిత్‌ మెరుగ్గా ఆడినా ఫలితం లేకపోయింది. 


సిడ్నీ: వన్డే సిరీస్‌ పరాభవానికి భారత క్రికెట్‌ జట్టు బదులు తీర్చుకుంది. ఉత్కంఠభరిత రెండో టీ20లో హార్దిక్‌ పాండ్యా (22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఫలితంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల సిరీ్‌సను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో దక్కించుకుంది. మంగళవారం ఇదే మైదానంలో చివరి మ్యాచ్‌ జరుగుతుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ (32 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 58), స్మిత్‌ (38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) రాణించారు. నటరాజన్‌ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసి గెలిచింది. ధవన్‌ (36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52), కోహ్లీ (24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), రాహుల్‌ (22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) ఆకట్టుకున్నారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పాండ్యా నిలిచాడు.


కలిసికట్టుగా..: భారీ ఛేదనలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా కదం తొక్కారు. ఆరంభంలో ఓపెనర్లు ధవన్‌, రాహుల్‌ మధ్య తొలి వికెట్‌కు 5.2 ఓవర్లలోనే 56 పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్‌లో రాహుల్‌ ఫోర్‌ బాదగా ధవన్‌ వరుసగా 6,4తో చెలరేగాడు. అయితే రాహుల్‌ వికెట్‌ తీసిన పేసర్‌ టై ఈ జోడీని విడదీసినా పవర్‌ప్లేలో జట్టు 60 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఐదు ఓవర్లలో ఆసీస్‌ స్పిన్నర్లు కట్టడి చేయడంతో భారత్‌ తడబడింది. దీనికి తోడు అర్ధసెంచరీతో ఊపు మీదున్న ధవన్‌ను 12వ ఓవర్‌లో జంపా దెబ్బతీశాడు. కాసేపటికే శాంసన్‌ (15) వికెట్‌ను కూడా కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ బ్యాట్‌ ఝుళిపిస్తూ 15వ ఓవర్‌లో రెండు ఫోర్లతో పాటు డివిల్లీర్స్‌ తరహాలో స్కూప్‌ షాట్‌తో సిక్సర్‌ బాది 18 రన్స్‌ సాధించాడు. కానీ చివరి ఐదు ఓవర్లలో 54 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లీ వెనుదిరిగాడు.


పాండ్యా ఫటాఫట్‌: 3 ఓవర్లలో 37 పరుగులు కావాల్సి ఉండగా జట్టుపై ఒత్తిడి నెలకొంది. ఈ దశలో జంపా వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ భారత్‌కు కలిసివచ్చింది. దీంట్లో శ్రేయాస్‌ (12 నాటౌట్‌) 6,4 బాదగా లక్ష్యం 12 బంతుల్లో 25కి తగ్గింది. ఆ తర్వాత చివరి రెండు ఓవర్లను పూర్తిగా తనే ఆడిన పాండ్యా విధ్వంసం సృష్టించాడు. 19వ ఓవర్‌లో రెండు ఫోర్లతో 11 రన్స్‌ రాబట్టాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరపడగా రెండు భారీ సిక్సర్లతో మోతెక్కించి మరో రెండు బంతులుండగానే మ్యాచ్‌ ముగించాడు.


వేడ్‌ బాదుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్‌ వేడ్‌ ఆసీస్‌కు శుభారంభం అందించగా స్మిత్‌తో పాటు చివర్లో హెన్రిక్స్‌ (26), స్టొయినిస్‌ (16 నాటౌట్‌) దూకుడు కనబరిచారు. వీరి జోరుకు భారత బౌలర్లలో నటరాజన్‌ మినహా అంతా కుదేలయ్యారు. మొదటి మ్యాచ్‌ హీరో చాహల్‌ ఈసారి తేలిపోయాడు. తొలి 4 ఓవర్లలోనే 46 పరుగులు సాధించిన వేళ షార్ట్‌ (9) వికెట్‌ను నటరాజన్‌ తీశాడు. అటు తానిచ్చిన క్యాచ్‌ను పాండ్యా మిస్‌ చేయడంతో వేడ్‌.. వరుస ఫోర్లతో చెలరేగాడు. 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 8వ ఓవర్‌ చివరి బంతిని వేడ్‌ కవర్‌లో పైకి లేపగా విరాట్‌ క్యాచ్‌ వదిలేశాడు. ఈ దశలో వేడ్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించగా కోహ్లీ వేగంగా స్పందించి బంతిని కీపర్‌కు అందివ్వడంతో అతడు రనౌటయ్యాడు. అనంతరం స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ (22) కారణంగా జట్టు 100 పరుగులు దాటింది. మధ్య ఓవర్లలో భారత బౌలర్లు ఫర్వాలేదనిపించినా చివరి ఐదు ఓవర్లలో హెన్రిక్స్‌, స్టొయినిస్‌ జోరుకు 62 పరుగులు సమర్పించుకున్నారు.


ఏబీకి మెసేజ్‌ చేస్తా..

స్కూప్‌ షాట్లు ఆడడంతో డివిల్లీర్స్‌ తర్వాతే ఎవరైనా.. కెప్టెన్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌లో ఇలాంటి షాట్లు దాదాపు కనిపించవు. కానీ రెండో టీ20లో మాత్రం ఏబీని విరాట్‌  కాపీ కొట్టేశాడు. 15వ ఓవర్‌లో టై వేసిన ఫుల్‌ డెలివరీని అతడు మోకాలిపై కూర్చుని ఫైన్‌ లెగ్‌లో సిక్సర్‌ బాదాడు. ‘ఈ షాట్‌ నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే డివిల్లీర్స్‌కు ఈ విషయాన్ని మేసేజ్‌ చేస్తా. ఈ షాట్‌ గురించి అతడేమనుకుంటున్నాడో చూడాలి’ అని మ్యాచ్‌ ముగిశాక కోహ్లీ తెలిపాడు.


1- దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన టీ20 సిరీస్‌లను గెలిచిన తొలి భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ


లాక్‌డౌన్‌లో ప్రాక్టీస్‌ చేశా : హార్దిక్‌ పాండ్యా

లాక్‌డౌన్‌ సమయంలో మ్యాచ్‌ను ఎలా ముగించాలనే విషయంపై దృష్టి పెట్టా. భారీగా పరుగులు చేయడం కాకుండా జట్టుకు విజయం అందించడం ముఖ్యం. గతంలోనూ నాకిలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. లోపాలను సరిచేసుకుంటూ ఆత్మవిశ్వాసం పెంచుకున్నా. స్కోరుబోర్డుకు తగినట్టుగా నా షాట్లు ఉంటాయి. ఇక నటరాజన్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. నిజానికి అతడికే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రావాలి.


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా: వేడ్‌ (రనౌట్‌) 58; షార్ట్‌ (సి) శ్రేయాస్‌ (బి) నటరాజన్‌ 9; స్మిత్‌ (సి) పాండ్యా (బి) చాహల్‌ 46; మ్యాక్స్‌వెల్‌ (సి) వాషింగ్టన్‌ (బి) శార్దూల్‌ 22; హెన్రిక్స్‌ (సి) రాహుల్‌ (బి) నటరాజన్‌ 26; స్టొయినిస్‌ (నాటౌట్‌) 16; సామ్స్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 194/5. వికెట్ల పతనం: 1-47, 2-75, 3-120, 4-168, 5-171. బౌలింగ్‌: దీపక్‌ 4-0-48-0; సుందర్‌ 4-0-35-0; శార్దూల్‌ 4-0-39-1; నటరాజన్‌ 4-0-20-2; చాహల్‌ 4-0-51-1.

భారత్‌: రాహుల్‌ (సి) స్వెప్సన్‌ (బి) టై 30; ధవన్‌ (సి) స్వెప్సన్‌ (బి) జంపా 52; కోహ్లీ (సి) వేడ్‌ (బి) సామ్స్‌ 40; శాంసన్‌ (సి) స్మిత్‌ (బి) స్వెప్సన్‌ 15; హార్దిక్‌ (నాటౌట్‌) 42; శ్రేయాస్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.4 ఓవర్లలో 195/4. వికెట్ల పతనం: 1-56, 2-95, 3-120, 4-149. బౌలింగ్‌: సామ్స్‌ 3.4-0-41-1; అబాట్‌ 2-0-17-0; టై 4-0-47-1; మ్యాక్స్‌వెల్‌ 1-0-19-0; స్వెప్సన్‌ 4-0-25-1; హెన్రిక్స్‌ 1-0-9-0; జంపా 4-0-36-1.

Updated Date - 2020-12-07T10:14:46+05:30 IST