ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ అభివృద్ధికి భారత్‌ బయోటెక్‌ కసరత్తు

ABN , First Publish Date - 2021-03-30T06:17:36+05:30 IST

వ్యాక్సిన్లు, బయో-థెరాపుటిక్స్‌ కోసం స్థానికంగా ముడి పదార్థాలు, కొత్త టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడానికి సీఎ్‌సఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ)తో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, మరో రెండు కంపెనీలు సహకార ఒప్పందం (ఎంసీఏ) కుదుర్చుకున్నాయి

ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ అభివృద్ధికి భారత్‌ బయోటెక్‌ కసరత్తు

దేశీయంగా వ్యాక్సిన్‌ ముడి పదార్ధాల అభివృద్ధి

సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీతో ఒప్పందం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స): వ్యాక్సిన్లు, బయో-థెరాపుటిక్స్‌ కోసం స్థానికంగా ముడి పదార్థాలు, కొత్త టెక్నాలజీ  ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడానికి సీఎ్‌సఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ)తో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, మరో రెండు కంపెనీలు సహకార ఒప్పందం (ఎంసీఏ) కుదుర్చుకున్నాయి. భారత్‌ బయోటెక్‌తో పాటు యానిమల్‌ వ్యాక్సిన్ల తయారీ కంపెనీ బయోవెట్‌, బయోటెక్నాలజీ పరిశోధన కంపెనీ సాపిజెన్‌ బయోలాజిక్స్‌ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటాయి. ఈ రెండు కంపెనీలు కూడా భారత్‌ బయోటెక్‌ ప్రమోటర్లకు చెందినవే. ఒప్పందంలోని కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఐఐసీటీ కీలకమైన ముడి పదార్థాలను అభివృద్ధి చేస్తుంది. అందుకు అవసరమైన నిధులను భాగస్వామ్య కంపెనీలు సమకూరుస్తాయి.


భాగస్వామ్య కంపెనీలు అభివృద్ధి చేసే బయో-థెరాపుటిక్స్‌ ఫార్ములేషన్లు, భవిష్యత్‌ వ్యాక్సిన్లపై ఇన్‌-విట్రో, ఇన్‌ వివో అధ్యయనాలను కూడా ఐఐసీటీ నిర్వహిస్తుంది. ఒప్పందంలో భాగంగా టీకాలు ఇచ్చే ప్రక్రియ, డెలివరీ వ్యూహాలపై వినూత్న సొల్యూషన్లను కనుగొనేందుకు కృషి చేస్తారు. పరస్పర ప్రయోజనం, ఆసక్తి ఉన్న ప్రాజెక్టులను చేపడతామని, భాగస్వాముల భవిష్యత్‌ కార్యకలాపాలను మరిన్ని కొత్త రంగాలకు విస్తరించే విధంగా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. రోగులకు, జంతువులకు ఆమోదయోగ్యమైన వ్యయంలో హెల్త్‌కేర్‌ సొల్యూషన్లను అందించడమే ఈ ఒప్పందం ఉద్దేశమని వివరించారు. 


ముడి  పదార్థాలకు కొరత ఉంది: అమెరికా వంటి కొన్ని దేశాలు ముడిపదార్థాల సరఫరాపై నియంత్రణ విధించడంతో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ ముడి పదార్థాలకు కొరత వచ్చిం ది. ఈ నేపథ్యంలో దేశీయంగా ముడి పదార్థాలు, కొత్త టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధికి భారత్‌ బయోటెక్‌, ఐఐసీటీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వ్యాక్సిన్ల తయారీ ముడి పదార్థాలు, రసాయనాలకు కొరత ఉందని కృష్ణ ఎల్లా అన్నారు. ‘కొన్ని ముడి పదార్ధాలపై అమెరికా నియంత్రణ విధించింది. అందువల్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయలేకపోతున్నాం. నిజానికి అమెరికా, స్వీడన్‌ నుంచి మాకు అవసరమైన ఒక కీలకమైన ముడి పదార్ధాన్ని పొందలేకపోతున్నాం. ఈ దేశాలు అనేక పరిమితులు విధిస్తున్నారు. ఇటువంటి అవరోధాలను భవిష్యత్తులో ముందుగానే ఊహించాలి. ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడానికి ఇది కూడా కారణమే’నని కృష్ణ ఎల్లా అన్నారు. ఈ ఒప్పందం కొవిడ్‌ వ్యాక్సిన్లు, బయో థెరాపుటిక్స్‌కు మాత్రమే ఉద్దేశించింది కాదని.. ఇతర వ్యాక్సిన్లను కూడా అభివృద్ధి చేస్తామని వివరించారు. ఇన్‌యాక్టివేటెడ్‌, మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ (ఎంఆర్‌ఎన్‌ఏ) వ్యాక్సిన్ల ప్లాట్‌ఫామ్స్‌, అవసరమైన ముడి పదార్థాల అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. 


భారత్‌కు ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ: మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ (ఎంఆర్‌ఎన్‌ఏ) ప్లాట్‌ఫామ్‌ను భారత్‌కు తీసుకురావాలని సీఎ్‌సఐఆర్‌, భారత్‌ బయెటెక్‌ భావిస్తున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించి వేగంగా కొవిడ్‌ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నాలు ఏ మేరకు విజయం సాధించాయో పరిశీలించిన తర్వాత ఈ ప్లాట్‌ఫామ్‌ను భారత్‌లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి. ‘ప్రస్తుతం దేశంలో ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌ ప్లాట్‌ఫామ్‌ లేదు. దీన్ని భారత్‌కు ఏ విధంగా తీసుకురావాలో కృష్ణ ఎల్లాతో ఇప్పటికే చర్చించాం. వచ్చే కొద్ది నెలల్లో ఈ ప్లాట్‌ఫామ్‌ను భారత్‌కు తీసుకురాగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు’ అని సీఎ్‌సఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సీ మండే అన్నారు.  కాగా సీఎ్‌సఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) శేఖర్‌ సీ మండే, కృష్ణ ఎల్లా సమక్షంలో భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ మోహన్‌, బయోవెట్‌ డైరెక్టర్‌ జలచరి ఎల్లా, సాపిజెన్‌ బయోలాజిక్స్‌ డైరెక్టర్‌ రాచెస్‌ ఎల్లా, సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేకర్‌ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. 


కొవాగ్జిన్‌ ఉత్పత్తి పెంచేందుకు రూ.100 కోట్లు ఇవ్వండి..

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు రూ.100 కోట్లు నిధులు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత్‌ బయోటెక్‌ కోరింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తుండంటంతో డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ మొత్తాలను కేటాయించాలని భారత్‌ బయోటెక్‌ ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతం భారత్‌ బయెటెక్‌ తన హైదరాబాద్‌ ప్లాంట్‌లో ప్రతి నెల 40 లక్షల డోసుల కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా కొవిషీల్డ్‌ ఉత్పత్తి పెంచేందుకు కొవిడ్‌ సురక్షా పథకం కింద నిధులు కేటాయించాలని కోరింది. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా కంపెనీలు.. ప్రభుత్వాన్ని నిధులు కోరుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-03-30T06:17:36+05:30 IST