తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితి చక్కబడుతోంది

ABN , First Publish Date - 2020-07-10T07:05:44+05:30 IST

తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల వద్ద ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దేందుకు గాను భారత్‌, చైనాలు సమర్థవంతమైన చర్యల్ని తీసుకున్నాయని చైనా గురువారం పేర్కొంది. అక్కడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అంతా చక్కబడుతోందని వ్యాఖ్యానించింది...

తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితి చక్కబడుతోంది

  • ఉద్రిక్తత తగ్గింపునకు ఇరు దేశాలు 
  • సమర్థవంతమైన చర్యల్ని తీసుకున్నాయి: చైనా
  • చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నాం: భారత్‌
  • కశ్మీర్‌లో ఆరు వంతెనల్ని ప్రారంభించిన రాజ్‌నాథ్‌

బీజింగ్‌, జూలై 9: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల వద్ద ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దేందుకు గాను భారత్‌, చైనాలు సమర్థవంతమైన చర్యల్ని తీసుకున్నాయని చైనా గురువారం పేర్కొంది. అక్కడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అంతా చక్కబడుతోందని వ్యాఖ్యానించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కమాండర్‌ స్థాయి చర్చల్లో కుదిరిన అంగీకారం మేరకు.. చైనా, భారత్‌లు గల్వాన్‌ లోయతో పాటు ఇతర ప్రాంతాల్లో తమ సరిహద్దు బలగాల్ని ఉపసంహరించుకున్నాయి. మున్ముందు కూడా సైనిక, దౌత్యపరమైన మార్గాల్లో సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాయి. ఇందుకోసం సంప్రదింపులు-సమన్వయ పనివిధానం(డబ్ల్యూఎంసీసీ) సమావేశాన్ని కూడా నిర్వహిస్తాం. సరిహద్దు సమస్య పరిష్కారానికై భారత్‌ కూడా మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం’’ అని లిజియన్‌ పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని విశ్వసిస్తున్నట్లు భారత్‌ పేర్కొంది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. 


తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా, హాట్‌ స్ర్పింగ్స్‌ ప్రాంతాల్లో చైనా బలగాల ఉపసంహరణ పూర్తైందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.  జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో కొత్తగా నిర్మితమైన ఆరు వంతెనల్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అఖ్‌నూర్‌-పల్లాన్‌వాలా రహదారిలో నాలుగు వంతెనలు, కథువా జిల్లాలోని తార్నాహ్‌ నల్లాపై రెండు వంతెనలను సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌ఓ) నిర్మించింది. వీటి మొత్తం నిర్మాణ విలువ రూ. 43కోట్లు.


Updated Date - 2020-07-10T07:05:44+05:30 IST