11వ రౌండ్ భారత్-చైనా మిలిటరీ చర్చలు ఏప్రిల్ 9న!

ABN , First Publish Date - 2021-04-07T22:10:11+05:30 IST

భారత్-చైనా మిలిటరీ చర్చలు శుక్రవారం జరిగే అవకాశం ఉంది.

11వ రౌండ్ భారత్-చైనా మిలిటరీ చర్చలు ఏప్రిల్ 9న!

న్యూఢిల్లీ : భారత్-చైనా మిలిటరీ చర్చలు శుక్రవారం జరిగే అవకాశం ఉంది. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెప్సాంగ్ ప్లెయిన్స్ వంటి ఈస్టర్న్ లడఖ్ ప్రాంతాల నుంచి దళాలను త్వరగా ఉపసంహరించడంపై ప్రధానంగా ఈ చర్చల్లో దృష్టి సారిస్తారు. పాంగాంగ్ సరస్సు నుంచి ఇరు దేశాల దళాల ఉపసంహరణ ఫిబ్రవరిలో పూర్తయిన సంగతి తెలిసిందే. 


గత ఏడాది మే నెలలో చైనా దళాలు భారీగా తూర్పు లడఖ్‌కు చేరుకున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వాస్తవాధీన రేఖ వెంబడి గాల్వన్ లోయలో గత ఏడాది జూన్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలో జరిగింది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా నుంచి పెట్టుబడులను తగ్గించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 


పాంగాంగ్ సరస్సు నుంచి ఇరు దేశాల దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఇరు దేశాల కార్ప్స్ కమాండర్లు 10వ రౌండ్ చర్చలు జరిపారు. తదుపరి రౌండ్ (11వ రౌండ్) కార్ప్స్ కమాండర్ లెవెల్ చర్చలు ఏప్రిల్ 9న జరుగుతాయని తెలుస్తోంది. డెప్సాంగ్ బల్జ్‌‌ వద్ద గస్తీ సమస్య చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉంది. 2013లో చైనా సైన్యంతో ఈ ప్రాంతంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య మొదలైంది. దీనికి కూడా పరిష్కారాన్ని కనుగొనడంపై భారత సైన్యం దృష్టి పెడుతుంది. 


భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ ఏడాది ఫిబ్రవరిలో టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. సకాలంలో సంప్రదించుకోవడానికి వీలుగా హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసుకోవాలని వీరు నిర్ణయించారు. 


భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గత వారం ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ, మిగిలిన ప్రాంతాల నుంచి (హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెప్సాంగ్ ప్లెయిన్స్ వంటి ఈస్టర్న్ లడఖ్ ప్రాంతాల నుంచి) దళాల ఉపసంహరణ త్వరగా పూర్తయ్యేందుకు భారత దేశంతో కలిసి చైనా కృషి చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 


గత ఏడాది ఫింగర్ 4, ఫింగర్ 8 మధ్య చైనా దళాలు బంకర్లను, ఇతర నిర్మాణాలను నిర్మించాయి. ఫింగర్ 4 తర్వాత భారత గస్తీని అడ్డుకున్నాయి. దీంతో భారత సైన్యం దీటుగా, బలంగా ప్రతిస్పందించింది. ఇరు దేశాల దళాల మధ్య జరిగిన తొమ్మిది విడతల చర్చల్లో పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలోని ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు  చైనా దళాలు వెళ్ళిపోవాలని భారత సైన్యం పట్టుబట్టింది.  


Updated Date - 2021-04-07T22:10:11+05:30 IST