కడతేరనున్న కరోనా కష్టాలు

ABN , First Publish Date - 2021-01-09T06:09:08+05:30 IST

ప్రతి ఒక్క భారతీయునికి టీకా వేయడమే అసలు పరీక్ష.ఇది ఇప్పుడే ప్రారంభమయింది. భారత్‌లో తయారు చేసే వ్యాక్సిన్లను ఎగుమతి చేసేందుకు అనుమతించిన విధంగానే ఆమోదిత వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకూ మనం అనుమతించి...

కడతేరనున్న కరోనా కష్టాలు

ప్రతి ఒక్క భారతీయునికి టీకా వేయడమే అసలు పరీక్ష.ఇది ఇప్పుడే ప్రారంభమయింది. భారత్‌లో తయారు చేసే వ్యాక్సిన్లను ఎగుమతి చేసేందుకు అనుమతించిన విధంగానే ఆమోదిత వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకూ మనం అనుమతించి తీరాలి. అనూహ్య పర్యవసానాలకు మనం సర్వ విధాల సంసిద్ధమై ఉండాలి. విషమ పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన పరిష్కారాలను కనుగొనడంలో మన శాస్త్రవేత్తల, పరిశోధకుల దీక్షాదక్షతలు, శక్తి సామర్థ్యాలలో మనం పరిపూర్ణ నమ్మకాన్ని ఉంచాలి. అంతిమంగా శాస్త్ర విజ్ఞానం జయపతాకను ఎగురవేసి తీరుతుంది.


కరోనా మహమ్మారి వెనుదిరిగింది. కానీ ఇంకా పూర్తిగా నిష్క్రమించలేదు. వ్యాక్సిన్ మన ముంగిటలో ఉంది. అయితే టీకా వేయించుకుని స్వస్థత పొందే శుభవేళ ఆసన్నమవలేదు. ఆ సంజీవని కోసం కలలు గని, శోధించి సాధించడం ఆరంభమైనది మొదలు మనలను విడవకుండా వెంట ఉంటూ ఉంది వివాదం ఒక్కటే సుమా! 


కరోనా విలయం సృష్టించిన విధ్వంసాన్ని ఒక సారి అంకెల్లో అవలోకిద్దామా? శుక్రవారం ఉదయం నేనీ వ్యాసం రాస్తున్న సమయానికి ఆ విషమ గణాంకాలు ఇలా ఉన్నాయి: కొవిడ్-–19 సోకినవారి సంఖ్య 1,04,14,044 (అమెరికా తరువాత మనదే ద్వితీయ స్థానం); మృతుల సంఖ్య 1,50,606 (అమెరికా, బ్రెజిల్ తరువాత మనదే తృతీయ స్థానం); ప్రస్తుతం చికిత్సలో ఉన్న కొవిడ్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,22,416. మన దేశ జనాభా 138 కోట్లు. ప్రపంచాన్ని కుదిపివేసిన ఈ మహా ప్రళయంలో మనం చాలా అదృష్టవంతులమే, సందేహం లేదు. అయితే మహమ్మారి నియంత్రణలో మన లక్ష్యశుద్ధి, కార్యదక్షత కచ్చితంగా ఆదర్శప్రాయమైనవి కావు. అవి భావితరాల మెప్పును పొందలేవని నిశ్చితంగా చెప్పవచ్చు. 


ప్రభుత్వాలు, వైద్యనిపుణులు ఆమోదించిన ఆరు వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రపంచ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. రష్యా, చైనా అభివృద్ధిపరచిన టీకాలను ఇప్పటికే విస్తృతస్థాయిలో ఆయా దేశాల ప్రజలకు వేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు రష్యా, చైనాల వెలుపల ఆ దేశాల వ్యాక్సిన్లు ఆమోదం పొందలేదు. అదలా ఉంచుదాం. మిగతా నాలుగు టీకాల కథా కమామీషు చూద్దాం. మొదటిది ఫైజర్ టీకా. దీన్ని అమెరికా ఎఫ్‌డిఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఆమోదించింది. వైజ్ఞానిక జగత్తులోనూ, వైద్య వృత్తి ప్రపంచంలోనూ ఎఫ్‌డిఏ ఆమోదం ఒక తిరుగులేని ప్రమాణం. ఫైజర్ టీకా రోగ నిరోధక శక్తి అమోఘమైనది. అది సురక్షితమైనది. ప్రభావశీలమైనది. మూడు దశల క్లినికల్ పరీక్షలలోనూ ఫైజర్ టీకా మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ టీకాను ఉపయోగించుకోవడంలో మనకు ఒక అవరోధం ఉంది. ఆ వ్యాక్సిన్‌ను –-70డిగ్రీల సెంటీగ్రేడ్ శీతల స్థితిలో నిల్వ చేయాలి. ‘అత్యవసర ఉపయోగానికి ఆమోదం’ (ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్- ఇయుఎ) కోసం డిసిజిఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)కు పైజర్ దరఖాస్తు చేసింది. అయితే తాను అభివృద్ధిపరిచిన టీకాకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిపుణుల కమిటీకి (మూడు అవకాశాలు లభించినా) నివేదించలేదు. ఎందుకని? నా ఊహ ఏమిటంటే భారత్‌లో పంపిణీ, విక్రయాల విషయంలో ఫైజర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.


తమ టీకా ధర భారతీయులు భరించగలిగేది కాదని, దానికితోడు నిల్వ చేసేందుకు అనువైన వసతులు, సదుపాయాలు మనదేశానికి సమగ్రంగా లేవని కూడా ఫైజర్ భావిస్తున్నట్టుగా ఉంది. ఏమైనా, పైజర్ టీకాను ప్రపంచంలో చాలా దేశాలు అంగీకరించాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిమాండ్ ఉన్నందున పైజర్ తన ప్రాధాన్యతాక్రమంలో భారత్‌కు ఉపేక్షిత స్థానం మాత్రమే ఇస్తోంది. 


రెండో టీకా ఆక్స్‌ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరచిన కొవిషీల్డ్. ఈ టీకాను లైసెన్స్ కింద సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ఉత్పత్తి చేస్తోంది. ఒక భారతీయ ఔషధ పరిశోధన తయారీ సంస్థ కొవిషీల్డ్ పేరుతో ఒక వ్యాక్సిన్‌ను పరీక్షించి, తయారు చేసి, పంపిణీ చేయడం మనకు గర్వకారణం. మూడోది మోడెర్నా టీకా. భారత్‌లో ఆమోదం కోసం ఈ టీకా ఉత్పత్తిదారు ఇంకా దరఖాస్తు చేయలేదు. నాలుగో టీకా బయోటెక్ కంపెనీవారి కొవాగ్జిన్. విదేశీ శాస్త్రవేత్తల పరిశోధనలపై ఆధారపడినప్పటికీ కొవాగ్జిన్ నూటికి నూరు శాతం భారతీయ వ్యాక్సిన్. భారత్ గర్వంగా చెప్పుకోగల శాస్త్ర విజయమిది. కొవాగ్జిన్‌కు అనుమతిపై అనవసర వివాదం తలెత్తింది. కొవాగ్జిన్‌కు ఇచ్చిన ఆమోదం, పంపిణీ- మూడో దశ క్లినికల్ పరీక్షలకు మాత్రమేనని, ప్రభావశీలత విషయంలో సాధించగల ఫలితాలను బట్టి మరింత పంపిణీ, ఉపయోగానికి ఆమోదం ఇవ్వడం జరుగుతుందని డిసిజిఐ, ప్రభుత్వ ప్రతినిధులు (ముఖ్యంగా డాక్టర్ వి కె పౌల్, డాక్టర్ బలరామ్ భార్గవ) తొలుతనే చెప్పి ఉండవల్సింది. మూడో దశ క్లినికల్ పరీక్షలు కొనసాగుతున్నప్పుడే కొవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చేందుకు ఎందుకు తొందరపడ్డారని ప్రముఖ శాస్త్రవేత్తలు, వైరస్ అధ్యయనవేత్తలు, వైద్య నిపుణులు ప్రశ్నించారు. ఇది సహేతుకమే. అయితే విషమ పరిస్థితులను అధిగమించేందుకు తెగింపు ఎంతైనా అవసరం. సత్ఫలితాలను సాధించాలంటే సాహసించాల్సిందే. 


ప్రతి ఒక్క భారతీయునికి వ్యాక్సిన్ వేసినప్పుడు మాత్రమే స్వస్థ భారత్ సాధ్యమవుతుంది. నూట ముప్పై కోట్ల మంది భారతీయులకు కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు వ్యాక్సిన్లు భారీస్థాయిలో అవసరం. ఈ విషయంలో తక్కువ అంచనాలు వేసేందుకు ఎటువంటి ఆస్కారం లేదు. ఎస్‌ఐఐ వారి కొవిషీల్డ్ గానీ, దిగుమతి చేసుకునే వ్యాక్సిన్‌లు గానీ దేశ ప్రజలందరికీ శీఘ్రగతిన అందుబాటులో ఉంచగలగడం అంత సులభం కాదు. క్లినికల్ పరీక్షల ప్రక్రియను శీఘ్రతిని పూర్తి చేసేందుకు, ప్రాణాలను కాపాడగల సంభావ్య, శక్తిమంతమైన వ్యాక్సిన్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యవసర ఉపయోగానికి గాను అటువంటి వ్యాక్సిన్‌ను మనం తప్పక సమకూర్చుకోవలసిఉంది. 


కొవాగ్జిన్ హానికరమైనది అనేందుకు ఎటువంటి రుజువులు లేవు. ప్రయోగపరీక్షలలో వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి నిరూపితమయింది. అన్ని విధాల సురక్షితమయిందని కూడా స్పష్టమయింది. ప్రభావశీలత విషయంలో కూడా ఎటువంటి ప్రతికూలతలు ఉత్పన్నమవలేదు. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ఈ మాసాంతానికి విజయవంతంగా పూర్తికాగలవని, మార్చి నెలకల్లా వాటి ఫలితాల మూల్యాంకనం పూర్తి కాగలదని ఆశిద్దాం. ఆ తరువాత కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండిటినీ ఆసేతు హిమాచలం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచే కృషిని ముమ్మరం చేయాలి. అంతేగాక ఆ రెండు వ్యాక్సిన్లను ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్దఎత్తున ఎగుమతి చేయవచ్చు. తద్వారా ఒక వ్యాక్సిన్ విషయమై పరిశోధన, ఆవిష్కరణ, తయారీ, పంపిణీ, వినియోగాలను 12 నెలల్లో సాధించగల సామర్థ్యం ఉన్న దేశంగా భారత్ అద్వితీయంగా గణుతికెక్కుతుంది. 


ఎస్‌ఐఐ, బయోటెక్ మధ్య వ్యాపార మాత్సర్యం చోటుచేసుకోకపోలేదు. అయితే అదార్ పూనావాలా, కృష్ణ ఎల్లా తమ విభేదాలను పక్కనపెట్టి కరోనా వైరస్ నిర్మూలనకు కలసికట్టుగా కృషి చేస్తామని దేశ ప్రజలకు వాగ్దానిమివ్వడం ముదావహం. పరిశోధన, అభివృద్ధి రంగంలో అగ్రగాములుగా ఉన్న కంపెనీలు ప్రజాశ్రేయస్సు, ప్రైవేట్ లాభాలను సమంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఎస్‌ఐఐ భారత్ బయోటెక్ అలా వ్యవహరించినందుకు మనం సంతోషించాలి. 


సరే, అసలు పరీక్ష ఇప్పుడే ప్రారంభమయింది. 138 కోట్ల ప్రజలకు టీకా వేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎలా నిర్వహించనున్నది? ఎలా పూర్తి చేస్తుంది? ఈ సంక్లిష్ట, తక్షణ కర్తవ్యంపై నా ఆలోచనలు కొన్నిటిని మీతో పంచుకుంటాను. ఎవరికి ముందుగా, ఏ విధంగా టీకా వేయాలనే విషయమై ఒక ప్రాధాన్యక్రమాన్ని నిర్ణయించుకోవాలి. ఆ నిర్ధారిత క్రమాన్ని ఎవరూ, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ కేంద్రాలలోనూ, టీకాలు వేసే కేంద్రాలలోనూ ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా వేయాలి. ఎటువంటి చార్జీ వసూలు చేయకూడదు. ఎటువంటి చార్జీలు వసూలు చేసినా అది అవినీతికి దారి తీస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీకాల సరఫరా పరిస్థితి మెరుగుపడినప్పుడు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా భాగస్వామ్యం కల్పించాలి. వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు, దాని ధరను తమ వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు అభిలషించిన పక్షంలో వ్యాక్సిన్‌కు ఒక కచ్చితమైన ధరను ప్రభుత్వం నిర్ణయించాలి. సొంతడబ్బుతో టీకా వేయించుకోదలిచిన వారికి అనుమతినివ్వాలి. 


భారత్‌లో తయారు చేసే వ్యాక్సిన్లను ఎగుమతి చేసేందుకు అనుమతించిన విధంగానే ఆమోదిత వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకు కూడా మనం అనుమతించి తీరాలి. ప్రపంచ వాణిజ్యంలో సంరక్షణ విధానాలు అపఖ్యాతిపాలయిన విధానాలని చెప్పనవసరం లేదు. ప్రపంచం మహమ్మారి సంక్షోభంలో ఉన్నప్పుడు అటువంటి విధానాలకు తావు లేదు. తావు ఉండకూడదు కూడా. అనూహ్య పర్యవసానాలకు మనం సర్వవిధాల సంసిద్ధమై ఉండాలి. విషమ పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన పరిష్కారాలను కనుగొనడంలో మన శాస్త్రవేత్తలు, పరిశోధకుల దీక్షాదక్షతలు, శక్తి సామర్థ్యాలలో మనం పరిపూర్ణ నమ్మకాన్ని ఉంచాలి. అంతిమంగా శాస్త్రవిజ్ఞానం జయపతాకను ఎగురవేసి తీరుతుంది.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-01-09T06:09:08+05:30 IST