Abn logo
May 5 2021 @ 02:04AM

2 కోట్లు దాటిన కేసులు

  • దేశంలో కొత్తగా 3.57 లక్షల మందికి కొవిడ్‌ 
  • మరో 3,449 మంది వైరస్‌తో మృతి 
  • నెలరోజుల్లోనే 75 లక్షల మందికి ఇన్ఫెక్షన్‌
  • కర్ణాటకలో ఆక్సిజన్‌ కొరత.. ఆరుగురి మృతి 
  • బిహార్‌లో మే 15 వరకు లాక్‌డౌన్‌
  • ‘మహా’లో 15 జిల్లాల్లో కేసులు తగ్గుముఖం

న్యూఢిల్లీ, మే 4: దేశంలో కొత్తగా మరో 3.57 లక్షల మందికి కొవిడ్‌ ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. కొవిడ్‌ కేసులు 2020 డిసెంబరు 19న ఒక కోటికి చేరగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 5 నాటికి అవి 1.25 కోట్లకు పెరిగాయి. అనంతరం నెలరోజుల్లోనే కొత్తగా 75 లక్షల మందికిపైగా ఇన్ఫెక్షన్‌ బారినపడటంతో ఈ సంఖ్య కాస్తా 2,02,82,833కు చేరింది. ప్రస్తుతం 34.47 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 17 శాతం. రికవరీ రేటు 81.91 శాతంగా ఉంది. ఇప్పటివరకు కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు 1.66 కోట్ల మందికిపైనే ఉన్నా రు. మే 3న ఒక్కరోజే 16.63 లక్షల కరోనా టెస్టులు చేయడంతో మొత్తం పరీక్షల సంఖ్య 29 కోట్లు దాటింది. గత 24 గంటల్లో మరో 3,449 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మరణాలు 2.22 లక్షలు దాటాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 567 మంది, ఢిల్లీ(448),  యూపీ (285), ఛత్తీ్‌సగఢ్‌(266), కర్ణాటక(239), పంజాబ్‌ (155), రాజస్థాన్‌లో 154 మంది మరణించారు. కొత్తగా నమోదైన 3.57 లక్షల కరోనా కేసుల్లో 71ు పది రాష్ట్రాల్లోనే(మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, కేరళ, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌) ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో 48,621, కర్ణాటకలో 44,438, యూపీలో 29,052 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. మహారాష్ట్రలోని 15 జిల్లాల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్‌ తోపే పేర్కొన్నారు. కర్ణాటకలో కలబురగి జిల్లాలోని అఫ్జల్‌పూర్‌ తాలూక్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతతో మరో నలుగురు చనిపోయారు. ఇంకో ఆస్పత్రిలో ఇదే కారణంతో ఇద్దరు చనిపోయారు. అయితే ఆక్సిజన్‌ కొరత లేదని, దీర్ఘకాలిక వ్యాధుల వల్లే ఆ ఆరుగురు మృతి చెందారని అధికారవర్గాలు తెలిపాయి. 


కర్ణాటకలో ఎయిర్‌ఫోర్స్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ 

కర్ణాటకలో కరోనా ఉధృతి నేపథ్యంలో బెంగళూరులోని జాలహళ్లి ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద 100 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) ప్రకటించింది. కేసులు భారీగా పెరుగుతుండటంతో బిహార్‌లో బుధవారం నుంచి మే 15 వరకు లాక్‌డౌన్‌ను విధించారు. తెలుగు, తమిళ సినీ నటి పియా బాజ్‌పేయి సోదరుడు మంగళవారం మధ్యా హ్నం అనారోగ్యంతో మృతిచెందారు. అంతకుముందు ఉదయం.. ‘‘నా సోదరుడు చావు బతుకుల్లో ఉన్నాడు. అతడికి వెంటిలేటర్‌ బెడ్‌ కావాలి. దయచేసి ఎవరైనా సాయం చేయండి’’ అంటూ పియా బాజ్‌పేయి ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే సకాలంలో వెంటిలేటర్‌ బెడ్‌ దొరక్క ఆమె సోదరుడు చనిపోయాడు. కాగా, కరోనా వైర్‌సలో జన్యుమార్పుల ప్రక్రియ కొనసాగి, అది మానవ రోగ నిరోధక వ్యవస్థకు చిక్కకుండా ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్స్‌) జరిగితే మూడోవేవ్‌ కూడా రావచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్లతో సాధించేదేమీ ఉండదన్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే.. కనీసం రెండు వారాల పాటు పకడ్బందీగా అమలుచేయాలన్నారు.  


48.41 లక్షల డోసులు పంపిస్తాం : కేంద్రం

న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): రానున్న మూడు రోజుల్లో 48.41 లక్షల కరోనా టీకా డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 5.75 లక్షలు, తెలంగాణకు 75వేల డోసులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 16.69 కోట్ల డోసులు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపింది. రాష్ట్రాల వద్ద ఇంకా 75  లక్షలకుపైగా డోసు లున్నట్లు తెలిపింది. దేశంలో రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి మూ డు రెట్లు పెరిగిందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్సుఖ్‌ మాండవ్య వెల్లడించారు. 


తెలంగాణలో ‘పెప్సీకో’ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

కరోనాపై పోరుకు శీతల పానీయాల కంపెనీ పెప్సీకో నడుంబిగించింది. దాని స్వచ్ఛంద సేవల విభాగమైన ‘పెప్సీకో ఫౌండేషన్‌’ ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌లలో కమ్యూనిటీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను చేపట్టనుంది. సస్టయినబుల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకోలాజికల్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ (సీడ్స్‌) అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పెప్సీకో ఇండియా ప్ర కటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా లక్షకుపైగా డోసులు పంపిణీ చేస్తుంది. కాగా, తేలికపాటి, మోస్తరు కొవిడ్‌ ఇన్ఫెక్షన్ల చికిత్సకు వినియోగించే ఫావిపిరవిర్‌ జనరిక్‌ మాత్రలను ‘ఫావిజాజ్‌’ పేరుతో విడుదల చేసినట్లు బజాజ్‌ హెల్త్‌కేర్‌ పేర్కొంది. 


Advertisement
Advertisement
Advertisement