Afghanistan : కాందహార్ నుంచి దౌత్యవేత్తలను వెనుకకు రప్పించిన భారత్

ABN , First Publish Date - 2021-07-11T16:24:08+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌లో తాలిబన్ ఉగ్రవాదులు-ప్రభుత్వ

Afghanistan : కాందహార్ నుంచి దౌత్యవేత్తలను వెనుకకు రప్పించిన భారత్

కాందహార్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌లో తాలిబన్ ఉగ్రవాదులు-ప్రభుత్వ దళాల మధ్య ఘర్షణలు తీవ్రమవడంతో భారత దౌత్య సిబ్బందిని న్యూఢిల్లీకి  తరలించారు. సుమారు 50 మంది దౌత్య, భద్రతా సిబ్బందిని భారత వాయు సేన విమానంలో శనివారం తరలించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో దిగజారుతున్న భద్రత పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. 


కాబూల్, కాందహార్, మజారే షరీఫ్‌లలోని భారతీయ దౌత్య కార్యాలయాలను మూసివేయాలనే ఉద్దేశం లేదని భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే తాలిబన్ ఉగ్రవాదులు కాందహార్‌‌ పరిసరాల్లోని కీలక ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో ముందు జాగ్రత్తగా భారత దౌత్య, భద్రతా సిబ్బందిని న్యూఢిల్లీకి భారతీయ వాయు సేన విమానంలో శనివారం తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాందహార్‌లోని ఇండియన్ కాన్సులేట్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపాయి.  పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో కాందహార్, హెల్మండ్‌లలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.


ఆఫ్ఘనిస్థాన్ దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు దిగజారుతుండటాన్ని భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. భారత దౌత్య, భద్రతా సిబ్బందికి హాని జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. 


ఆఫ్ఘనిస్థాన్ భద్రతా సంస్థల అంచనా ప్రకారం, 7,000 మందికి పైగా లష్కరే తొయిబా ఉగ్రవాదులు దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల తరపున పోరాడుతున్నారు. గత వారం నుంచి తాలిబన్ ఉగ్రవాదులు, ఆఫ్ఘన్ భద్రతా దళాల మధ్య పోరు జరుగుతోంది. కాందహార్ నగరంలోకి తాలిబన్ ఉగ్రవాదులు శుక్రవారం ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ నగరం పరిసరాల్లోని ముఖ్యమైన జిల్లాలను ఉగ్రవాదులు ఆక్రమించుకున్నారని తెలుస్తోంది.



Updated Date - 2021-07-11T16:24:08+05:30 IST