భారత్‌లో మరీ దారుణం.. మరి చైనాలోని వూహాన్ సిటీ ఎలా ఉందో తెలుసా.?

ABN , First Publish Date - 2021-05-01T11:35:26+05:30 IST

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. లక్షలాది కేసులు, వేలాది మరణాలు, శవాల గుట్టలు, శ్మశానాల ముందు క్యూలు, ఆస్పత్రుల ముందు పడిగాపులు, ఆక్సిజన్ కొరత.. ఇవీ ప్రస్తుతం భారత దేశంలో కనిపిస్తున్న దృశ్యాలు.

భారత్‌లో మరీ దారుణం.. మరి చైనాలోని వూహాన్ సిటీ ఎలా ఉందో తెలుసా.?

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. లక్షలాది కేసులు, వేలాది మరణాలు, శవాల గుట్టలు, శ్మశానాల ముందు క్యూలు, ఆస్పత్రుల ముందు పడిగాపులు, ఆక్సిజన్ కొరత.. ఇవీ ప్రస్తుతం భారత దేశంలో కనిపిస్తున్న దృశ్యాలు. అయితే అసలు ఈ కరోనా వైరస్ పుట్టింది అని అందరూ చెప్పుకుంటున్న చైనాలోని వూహాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా? 


కరోనా వైరస్ పుట్టిన తొలినాళ్లలో చైనాలో విపరీతంగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇటలీ కూడా ఈ వైరస్ బారిన పడి అల్లాడింది. ఆ సమయంలో భారత్‌లో అసలు కరోనా కేసులు నమోదుకాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనదేశంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో వైరస్ పుట్టిన చైనాలో మాత్రం పాజిటివ్ కేసులు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అసలు వైరస్ తొలిసారి కనిపించిన వూహాన్ సిటీలో పరిస్థితి దాదాపు సాధారణం అయిపోవడం విశేషం. వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇక్కడి బాస్కెట్ బాల్ స్టేడియాలు, బ్యాడ్మింటన్ హాల్స్, జిమ్‌లు అన్నీ హాస్పటల్ బెడ్లతో నిండిపోయాయి. ఇప్పుడు మాత్రం క్రీడాభిమానులతో కళకళలాడుతున్నాయి.




అయితే వూహాన్‌లో ఇంకా కొన్ని నిబంధనలు మాత్రం అనుసరిస్తున్నారు. అదేంటంటే మాస్కులు. కేవలం సర్జికల్ మాస్కులు లేదంటే ఎన్95 మాస్కులు మాత్రమే ఇక్కడి ప్రజలు ధరిస్తున్నారు. మామూలు వస్త్రంతో చేసిన మాస్కులు ధరించి ఎటువంటి ఉపయోగమూ ఉండదని, ఎందుకంటే ఈ వైరస్ కణాలు 12 మైక్రోమీటర్ల కన్నా తక్కువని చెప్తున్నారు. ప్రస్తుతం వూహాన్‌లో రెస్టారెంట్లు, రహదారులు, మాల్స్ అన్నీ ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఎక్కడకు వెళ్లినా శానిటైజర్లు మాత్రం ప్రతి మూలలో కనిపిస్తున్నాయిట. ఇక్కడ వరుసగా ‘జీరో కరోనా కేసులు’ నమోదవడంతో కొన్ని పండుగలు, సెలవులు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.


వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను ప్రభుత్వం ప్రజలందరికీ అర్థమయ్యేలా చేసిందని, దీంతో అందరూ వ్యాక్సీన్ వేయించుకోవడానికి ముందుకొచ్చారని కొందరు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా ఇన్‌ఫెక్షన్ రేటు చాలా తక్కువగా ఉందని, ముఖ్యంగా పెద్దవారిలో ఈ వైరస్ వ్యాప్తి చాలావరకు తగ్గిపోయిందని తెలుస్తోంది. దీంతో 60 ఏళ్లుపైబడిన వారిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందట. వూహాన్‌లో ప్రజాజీవనం దాదాపు సాధారణానికి వచ్చేసిందని, భారత్‌లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా నెమ్మదిగా పరిస్థితి మెరుగవుతుందని ఆశిద్దాం. అయితే వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారంతా ముందుకొచ్చి టీకా వేయించుకుంటే ఈ మహమ్మారిపై త్వరగా విజయం సాధించవచ్చనేది నిపుణుల మాట.

Updated Date - 2021-05-01T11:35:26+05:30 IST