వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2021-04-11T02:36:09+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా 10 కోట్ల మందికి టీకాలు

వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా 10 కోట్ల మందికి టీకాలు వేసిన దేశంగా రికార్డులకెక్కింది. కేవలం 85 రోజుల్లోనే భారత్ ఈ ఘనత సాధించగా, అమెరికా, చైనాలు 85 రోజుల్లో వరుసగా 9.2 కోట్లు, 6.1 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 10 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి అమెరికాకు 89 రోజులు పట్టగా, చైనాకు 102 రోజులు పట్టింది.


 దేశంలో ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వగా, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని, 60 ఏళ్లు పైబడిన వారిని ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేస్తున్నారు. 


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ మొదలై రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్న వేళ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మరింత ముమ్మరం చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే, చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు సరిపడా లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. టీకా డోసుల నిల్వ సరిపడా లేకపోవడంతో నిన్న ముంబైలో 71 ప్రైవేటు టీకా కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. అలాగే, చాలా రాష్ట్రాలు తమ వద్ద మరో రెండు మూడు రోజులకు సరిపడా మాత్రమే టీకా నిల్వలు ఉన్నాయని, అవి నిండుకోకముందే టీకాలను పంపించాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతూ లేఖ రాశాయి.

Updated Date - 2021-04-11T02:36:09+05:30 IST