మహా మాంద్యం ముంగిట..

ABN , First Publish Date - 2020-05-27T06:44:07+05:30 IST

భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంపై పరపతి రేటింగ్‌ సంస్థ ‘క్రిసిల్‌’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దెబ్బతో స్వాతం త్య్రం వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నాలుగోసారి ఆర్థిక

మహా మాంద్యం ముంగిట..

  • 2020-21లో భారత వృద్ధి రేటు మైనస్‌ 5 శాతం
  • క్యూ1లో  మైనస్‌ 25 శాతం 
  • మూడేళ్ల వరకు కోలుకోవడం కష్టమే
  • క్రిసిల్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంపై పరపతి రేటింగ్‌ సంస్థ ‘క్రిసిల్‌’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దెబ్బతో స్వాతం త్య్రం వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నాలుగోసారి ఆర్థిక మాంద్యంలోకి పోతోందని తెలిపింది. ఈ మాంద్యం.. 1958, 1966, 1980ల్లో భారత్‌ను కుదిపేసిన ఆర్థిక మాంద్యాల కంటే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఒకవేళ ఈ ప్రభావం నుంచి కోలుకున్నా, మూడేళ్ల వరకు కరోనాకు ముందున్న జీడీపీ వృద్ధి రేట్లు నమోదయ్యే అవకాశమూ లేదని స్పష్టం చేసింది. ఆర్థిక ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మహా ఆర్థిక మాంద్యాన్ని చవిచూడడం ఇదే మొదటిసారి. 


లాక్‌డౌన్‌ పుణ్యమా అని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 5 శాతం మేరకు పడిపోతుందని క్రిసిల్‌ అంచనా. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం (క్యూ1)లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఈ కాలంలో జీడీపీ మైనస్‌ 25 శాతం వరకు గండి పడుతుందని తెలిపింది. గత మూడు మాంద్యాలకు వరుణుడు కరుణించక వ్యవసాయం చతికిలపడడం కారణమైతే, ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి కరోనా కారణమవుతోందని తెలిపింది. సాధారణ వర్షాలతో వరుణుడు సకాలంలో కరుణించే అవకాశం కనిపించడమే ప్రస్తుతం భారత్‌కు కనిపిస్తున్న పెద్ద సానుకూల అంశమని పేర్కొంది. మరోవైపు ఫిచ్‌ రేటింగ్స్‌ కూడా ఈ ఏడాది వృద్ధి మైనస్‌ 5 శాతంగా ఉంటుందని పేర్కొంది. 


అంచనాలకు మించి నష్టం : కరోనాతో ఆర్థిక వ్యవస్థ నష్టాలు ముందుగా వేసిన అంచనాలను మించిపోయాయని క్రిసిల్‌ పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయేతర రంగాలైన విద్య, పర్యాటకం, రవాణా వంటి రంగాలు పూర్తిగా కుదేలైన విషయాన్ని గుర్తు చేసింది. ఈ రంగాలు ఇప్పట్లో కోలుకునే అవకాశమూ కనిపించడం లేదు. దీంతో ఈ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఆదాయాలు పడిపోవడం లేదా పెద్ద సంఖ్యలో రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 


కరోనాతో రూ.30 లక్షల కోట్ల నష్టం: ఎస్‌బీఐ రీసెర్చ్‌ 

కొవిడ్‌-19 దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకు రూ.30.3 లక్షల కోట్ల మేర నష్టపోయిందని ఎస్‌బీఐ పరిశోధనా సంస్థ ఎకోరాప్‌ వెల్లడించింది. ఇది మొత్తం జీడీపీలో 13.5 శాతానికి సమానం. దేశంలో ఐదు పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ) నష్టం 50 శాతానికి చేరువలో ఉందని పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల నష్టం సుమారు రూ.11 లక్షల కోట్ల వరకు ఉందని తెలిపింది.


ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, ఢిల్లీ వంటి టాప్‌ 10 రాష్ట్రాల జీఎ్‌సడీపీ నష్టం దాదాపు 75 శాతం వరకు ఉందని పేర్కొంది. మొత్తం నష్టంలో ఆరెంజ్‌, రెడ్‌ జోన్ల వాటా 90 శాతంగా ఉందని తెలిపింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ కంటే ఈ నష్టం 43 శాతం అధికమని తెలిపింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏకంగా -6.8 శాతంగా ఉండొచ్చని ఎస్‌బీఐ అంచనా వేసింది.   

Updated Date - 2020-05-27T06:44:07+05:30 IST