డే-నైట్ టెస్టు తొలిరోజు మనదే!

ABN , First Publish Date - 2021-02-25T04:48:42+05:30 IST

మొతేరా స్టేడియంలో టీమిండియా సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న డే-నైట్ టెస్టులో తొలిరోజే అదిరిపోయే ప్రదర్శన కనబర్చింది. ఈ పింక్‌బాల్ టెస్టులో మన స్పిన్నర్లు ఇరగదీశారు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ మూడు, యువ స్పిన్నర్ అక్షర్ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను భారీ దెబ్బ కొట్టారు.

డే-నైట్ టెస్టు తొలిరోజు మనదే!

మొతేరా: మొతేరా స్టేడియంలో టీమిండియా సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న డే-నైట్ టెస్టులో తొలిరోజే అదిరిపోయే ప్రదర్శన కనబర్చింది. ఈ పింక్‌బాల్ టెస్టులో మన స్పిన్నర్లు ఇరగదీశారు. స్పిన్నర్లకు అనుకూలించిన ఈ పిచ్‌పై తొలిరోజే 13 వికెట్లు కూలడం విశేషం. భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ మూడు, యువ స్పిన్నర్ అక్షర్ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను భారీ దెబ్బ కొట్టారు. వీరి ధాటికి 100 లోపే చాపచుట్టేస్తుందని అనుకున్న ఇంగ్లండ్‌ను ఓపెనర్ జాక్ క్రాలీ(54) ఆదుకున్నాడు. అతనితోపాటు కెప్టెన్ జో రూట్(17) రెండంకెల స్కోరు సాధించడంతో ఇంగ్లండ్ 112 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ తొలి వికెట్ తీసింది వందో టెస్టు ఆడుతున్న ‘లంబూ’ ఇషాంత్ శర్మ.


ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు ఓపెనర్ రోహిత్ శర్మ(57 నాటౌట్) అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(11) విఫలమైనా తను మాత్రం సొగసరి షాట్లతో అలరించాడు. అతనికి జోడీ కట్టిన కెప్టెన్ కోహ్లీ (27) కూడా మంచి షాట్లు ఆడాడు. అయితే అనూహ్యంగా తొలిరోజు చివరి ఓవర్లో కోహ్లీ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే నయావాల్ చటేశ్వర్ పుజారా (0) డకౌట్ కావడం అందరికీ షాకిచ్చింది. దీంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 99/3తో పట్టుబిగించింది. అంటే ఇంగ్లండ్ స్కోరుకన్నా 13 పరుగులు వెనుకబడి ఉందన్నమాట. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌తో పాటు అజింక్య రహానే(1) ఉన్నాడు. రెండో రోజు టీమిండియా ఆటగాళ్లలో ఏ ఇద్దరు గట్టిగా నిలబడినా మ్యాచ్‌ భారత్ వశం కావడం ఖాయమని క్రికెట్ పండితుల భావన.

Updated Date - 2021-02-25T04:48:42+05:30 IST