వృద్ధి పథంలోకి భారథం

ABN , First Publish Date - 2021-02-27T09:09:48+05:30 IST

భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనం నుంచి సాంకేతికంగా బయటపడింది. వరుసగా రెండు త్రైమాసికాలు చారిత్రక పతనం చవిచూసిన అనంతరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 0.4 శాతం సానుకూల వృద్ధిని సాధించింది.

వృద్ధి పథంలోకి భారథం

  • 2 త్రైమాసికాల తిరోగమనానికి తెర..
  • మూడో త్రైమాసికంలో 0.4% వృద్ధి 

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనం నుంచి సాంకేతికంగా బయటపడింది. వరుసగా రెండు త్రైమాసికాలు చారిత్రక పతనం చవిచూసిన అనంతరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 0.4 శాతం సానుకూల వృద్ధిని సాధించింది. గత ఏడాది మూడో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 3.3 శాతం ఉంది. ఇదిలా ఉండగా ఏడాది మొత్తానికి భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం క్షీణతను నమోదు చేయవచ్చని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎ్‌సఓ) శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన రెండో అడ్వాన్స్‌ అంచనాల్లో తెలిపింది. జనవరిలో విడుదల చేసిన తొలి అడ్వాన్స్‌ అంచనాల్లో జీడీపీ క్షీణత 7.7 శాతం ఉండవచ్చన్న ఎన్‌ఎ్‌సఓ దాన్ని స్వల్పం గా పెంచింది. 20190-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 4 శాతం ఉంది. కాగా స్థిర ధరల (2011-12) ప్రకారం వాస్తవ జీడీపీ వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రూ.134.09 లక్షల కోట్లుండవచ్చని ఎన్‌ఎ్‌సఓ తెలిపింది. 2019-20 సంవత్సరానికి సవరించిన తొలి అంచనాల్లో పేర్కొన్న రూ.145.66 లక్షల కోట్ల కన్నా ఇది తక్కువ. మూడో త్రైమాసికంలో ఏర్పడిన ఈ వృద్ధిని ‘వి’ షేప్‌ రికవరీగా ప్రభుత్వం అభివర్ణించింది. రాబోయే రోజుల్లో ఇది మరింత వేగం పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రకటించింది. 


 రెండు త్రైమాసికాల చారిత్రక క్షీణత

గత ఏడాది కరోనాను అదుపు చేసేందుకు మార్చి నుంచి విధించిన లాక్‌డౌన్ల ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ చారిత్రక గరిష్ఠ స్థాయిలో 24.4 శాతం క్షీణించిన విషయం విదితమే. తదుపరి లాక్‌డౌన్లు క్రమంగా సడలిస్తూ రావడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుని రెండో త్రైమాసికంలో ఈ క్షీణత 7.3 శాతానికి తగ్గింది. చివరికి మూడో త్రైమాసికం వచ్చే సరికి భారత్‌ సానుకూల వృద్ధిలోకి ప్రవేశించగలిగింది. దీంతో 2020 సంవత్సరం చివరి త్రైమాసికంలో తిరోగమనం నుంచి బయటపడిన ప్రపంచంలోని కొన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల సరసన భారత్‌ నిలిచింది. ఇదే త్రైమాసికంలో చైనా 6.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడం, తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా లాక్‌డౌన్లు తిరిగి విధించడంపై విశ్లేషకులు ఆందోళన ప్రకటిస్తున్నారు. కేసుల తీవ్రత తిరిగి పెరిగినట్టయితే ఈ స్వల్ప రికవరీకి విఘాతం కలిగే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరించారు పరిస్థితి చేయిదాటితే చివరి త్రైమాసికం (క్యూ4) లో జీడీపీ వృద్ధి రేటు మళ్లీ మైన్‌సలోకి జారుకునే అవకాశాలున్నాయని వెల్లడించారు. 

Updated Date - 2021-02-27T09:09:48+05:30 IST