భారత అమ్ములపోదిలోకి ఆరేళ్లలో మరో స్వదేశీ విమానం

ABN , First Publish Date - 2020-06-05T01:45:26+05:30 IST

తేజస్ స్ఫూర్తితో కేంద్రం తాజాగా మరో యుద్ధ విమానం రూపకల్పనకు నడుం బిగించింది. మరికొన్ని సంవత్సరాల్లో...

భారత అమ్ములపోదిలోకి ఆరేళ్లలో మరో స్వదేశీ విమానం

న్యూఢిల్లీ: తేజస్ స్ఫూర్తితో కేంద్రం తాజాగా మరో యుద్ధ విమానం రూపకల్పనకు నడుం బిగించింది. మరికొన్ని సంవత్సరాల్లో ఈ ఫైటర్ జెట్ కూడా ఆకాశంలో చక్కర్లు కొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లైట్ కంబాట్ ఫైటర్ జెట్ తేజస్ ఇటీవలే భారత వాయుసేనలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా మరో ఫైటర్ జెట్‌‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ తయారుచేయనుంది. వచ్చే ఆరేళ్లలో ఇది గగనయానం చేసే అవకాశాలు ఉన్నాయి. దీని రూపకల్పన అనంతరం నాలుగేళ్ల పాటు శాస్త్రవేత్తలు దీనిపై పరీక్షలు జరపనున్నారు. పూర్తి స్థాయిలో విజయవంతం అయిన తరువాత ప్రభుత్వం దీనిని నేవీకి అందించనుంది. కొంతకాలంగా మిగ్-29కే విమానాల్లో లోపాలు తలెత్తుతుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఈ సరికొత్త ఫైటర్ అందుబాటులోకి వస్తే భారత నేవీ అధీనంలోని మిగ్-29కే యుద్ధ విమానాలను దశలవారీగా తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ కొత్త యుద్ధ విమానాన్ని సముద్రాల్లో నిలిపి ఉంచే విమాన వాహక నౌకల పైనుంచి వినియోగించేందుకు అనువుగా తయారుచేయనున్నారు. తేజస్‌కు భిన్నంగా ఇందులో రెండు ఇంజన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ అత్యాధునిక జెట్ ఫైటర్లను ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్‌లపై మోహరించాలన్నది భారత రక్షణ వ్యూహకర్తల ప్రణాళికగా తెలుస్తోంది. కొత్త యుద్ధ విమానాలను నేవీకి అందించడం ద్వారా సముద్రాల్లోనూ బలం చాటుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.

Updated Date - 2020-06-05T01:45:26+05:30 IST