కష్టసుఖాల్లో మనకు తోడుగా భారత్ : బంగ్లాదేశ్ పీఎం హసీనా

ABN , First Publish Date - 2021-03-27T02:10:55+05:30 IST

కష్టసుఖాల్లో తమకు అండగా ఉన్న భారత దేశానికి కృతజ్ఞతలు చెప్తున్నానని

కష్టసుఖాల్లో మనకు తోడుగా భారత్ : బంగ్లాదేశ్ పీఎం హసీనా

ఢాకా : కష్టసుఖాల్లో తమకు అండగా ఉన్న భారత దేశానికి కృతజ్ఞతలు చెప్తున్నానని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన పోరాటంలోనూ, తాజాగా కరోనా వైరస్ మహమ్మారి సమయంలోనూ భారత దేశం తమకు గట్టి మద్దతునిచ్చిందని చెప్పారు. 


బంగ్లాదేశ్ సంతోషంగా ఉన్నపుడు, ఇబ్బందుల్లో ఉన్నపుడు భారత ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో బంగ్లాదేశీయుల కోసం 109 అంబులెన్స్‌లను భారత దేశం అందజేసిందని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి, భారతీయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. కోవిడ్ నిరోధక వ్యాక్సిన్లను అందజేసి, భారత్ సహకరించిందని చెప్పారు. 


భారత దేశం, బంగ్లాదేశ్ ఇరుగుపొరుగు దేశాలు మాత్రమే కాదని, ఇరు దేశాల మధ్య చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక వారసత్వం ఉందని చెప్పారు. భౌగోళిక సాన్నిహిత్యం కూడా ఉందన్నారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతీయులు, ప్రభుత్వం మమేకమయ్యాయని చెప్పారు. 


బంగ్లాదేశ్ నేషనల్ డే ఈవెంట్‌కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాలకు ఒకే విధమైన అవకాశాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఉభయ దేశాలు ఉగ్రవాదం వంటి ఒకే తరహా ముప్పులను ఎదుర్కొంటున్నాయన్నారు. ఇటువంటి అమానవీయ చర్యల వెనుక శక్తులు, ఆలోచనలు ఇంకా క్రియాశీలంగానే ఉన్నాయని తెలిపారు. వీటిని తిప్పికొట్టేందుకు సమైక్యంగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. 


Updated Date - 2021-03-27T02:10:55+05:30 IST