Abn logo
Nov 17 2021 @ 04:51AM

కొత్త కొత్తగా..

రోహిత్‌-ద్రవిడ్‌ కాంబో షురూ

నేటి నుంచి భారత్‌-కివీస్  టీ20 సిరీస్‌

రాత్రి 7.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..


పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా సరికొత్తగా బరిలోకి దిగబోతోంది. టీ20 ప్రపంచక్‌పలో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరుత్సాహపరిచిన భారత జట్టు ఇప్పుడు కొత్త కెప్టెన్‌.. కొత్త కోచ్‌తో నూతన సవాల్‌కు సిద్ధమవుతోంది. యూఏఈలో ఊహించని పరాభవాన్ని అధిగమిస్తూ.. లోటుపాట్లను సరిచేసుకుంటూ వచ్చే ఏడాది మెగా టోర్నీ లక్ష్యంగా రోహిత్‌-ద్రవిడ్‌ జోడీ ప్రణాళిక రచిస్తోంది. న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు టీ20ల సిరీస్‌ నుంచే ఈ మిషన్‌ను ప్రారంభించాలన్న ఆలోచనలో వీరున్నారు.


జైపూర్‌: రోహిత్‌ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా.. రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా భారత టీ20 జట్టు నూతన ప్రయాణం ఆరంభం కాబోతోంది. స్థానిక సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగే టీ20 మ్యాచ్‌.. సిరీ్‌సకే కాకుండా ఈ ఇద్దరికీ బాధ్యతల పరంగా మొదటిదే కావడం విశేషం. విరాట్‌ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌ సారథ్యం నుంచి తప్పుకోవడంతో రోహిత్‌ను కెప్టెన్‌గా చేసిన విషయం తెలిసిందే. ఇక ద్రవిడ్‌ కూడా రవిశాస్త్రి స్థానంలో కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అలాగే సీనియర్ల విశ్రాంతితో జట్టులోనూ పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారిగా స్థానం కల్పించారు. ఈ పరిస్థితుల్లో వీరందరికీ సిరీస్‌ సవాల్‌గా నిలవనుంది. మరోవైపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌ జరుగబోతోంది. ఇక, స్వదేశంలో కివీ్‌సతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో భారత్‌ 2-3 ఫలితంతో వెనుకబడి ఉంది.


ఐపీఎల్‌ స్టార్లకు బెస్ట్‌ చాన్స్‌: హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఆల్‌రౌండర్‌గా చోటు దక్కించుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ ఈ సిరీ్‌సలో సత్తా చూపాలనుకుంటున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో అతడు ప్రతిభ కనబరిస్తే జట్టు చాలా రోజులుగా వెతుకుతున్న ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ లభించినట్టే. ఐపీఎల్‌లో కేకేఆర్‌ను అయ్యర్‌ ఒంటిచేత్తో ఫైనల్‌కు తీసుకొచ్చాడు. అతడితో పాటు రుతురాజ్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌లతో పాటు రీఎంట్రీ ఇచ్చిన చాహల్‌, సిరాజ్‌లకు కూడా ఈ సిరీస్‌ ముఖ్యమే. బుమ్రా విశ్రాంతి నేపథ్యంలో గంటకు 140కి.మీ వేగంతో నిలకడగా బంతులు వేసే పేసర్‌ ఇప్పుడు జట్టుకు అవసరం. అందుకే అవేశ్‌, సిరాజ్‌లను జట్టులో చేర్చారు. వెటరన్‌ భువనేశ్వర్‌ స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్‌ చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాలో జరుగుతుంది కాబట్టి అక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఆడగలిగే క్రికెటర్లను రోహిత్‌-ద్రవిడ్‌ వెలికి తీయాల్సివుంది. జట్టులో ఇప్పుడు ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. కచ్చితంగా రోహిత్‌, రాహుల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉన్నా రుతురాజ్‌, అయ్యర్‌, ఇషాన్‌లను కూడా పరీక్షించవచ్చు. ముగ్గురు స్పిన్నర్లతో వెళ్తే అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌ తుది జట్టులో ఉంటారు.


విలియమ్సన్‌ దూరం: అసమాన ఆటతీరుతో టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరినా న్యూజిలాండ్‌కు నిరాశే ఎదురైంది. దీనికి తోడు సరైన విశ్రాంతి లేకుండా మూడు రోజుల వ్యవధిలోనే  మరో సిరీస్‌ ఆడబోతోంది. ఆదివారం టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆడిన కివీస్‌ సోమవారమే భారత్‌కు చేరుకుంది. అలాగే అధిక పని ఒత్తిడి కారణంగా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. అయితే టెస్టు సిరీ్‌సకు అందుబాటులో ఉంటాడు. ఈ కారణంగా టిమ్‌ సౌథీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇక యూఏఈలో ఎక్కువగా అవకాశం రాని ఆటగాళ్లను భారత్‌పై ఆడించాలనుకుంటున్నారు. పేసర్‌ కైల్‌ జేమిసన్‌ వామప్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గప్టిల్‌, మిచెల్‌, నీషమ్‌లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగానే ఉండగా.. లెగ్‌ స్పిన్‌లో ఆడేందుకు ఇబ్బందిపడే కెప్టెన్‌ రోహిత్‌ను స్పిన్నర్‌ సోధి లక్ష్యంగా చేసుకోనున్నాడు. 


   జట్లు (అంచనా):

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, పంత్‌, అశ్విన్‌, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌/సిరాజ్‌, యజ్వేంద్ర చాహల్‌, హర్షల్‌/అవేశ్‌ ఖాన్‌.

న్యూజిలాండ్‌: గప్టిల్‌, మిచెల్‌, చాప్‌మన్‌, ఫిలిప్స్‌, సైఫర్ట్‌, నీషమ్‌, శాంట్నర్‌, మిల్నే, టిమ్‌ సౌథీ (కెప్టెన్‌), ఇష్‌ సోధీ, ట్రెంట్‌ బౌల్ట్‌.


పిచ్‌: 

జైపూర్‌ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌. ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఈ పిచ్‌పై భారీ స్కోర్లే నమోదయ్యాయి. ఈసారి కూడా బ్యాటింగ్‌కు అనుకూలించవచ్చు. టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకునే చాన్సుంది.