లాక్‌డౌన్ నేపథ్యంలో రుణగ్రహీతల్లో టెన్షన్.. టెన్షన్!?

ABN , First Publish Date - 2020-03-26T12:56:57+05:30 IST

రోనా ప్రభావంతో దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అఖిల భారతదేశం లాక్‌డౌన్‌లో ఉంది.

లాక్‌డౌన్ నేపథ్యంలో రుణగ్రహీతల్లో టెన్షన్.. టెన్షన్!?

  • వాయిదాలు చెల్లించేదెలా...?

హైదరాబాద్‌ : కరోనా ప్రభావంతో దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అఖిల భారతదేశం లాక్‌డౌన్‌లో ఉంది. లాక్‌డౌన్‌ బుధవారం(మార్చి-25) నుంచి 21 రోజులు పడుతుంది. దీంతో అనేక రంగాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ప్రజల గోప్యత, ఆర్థిక కార్యకలాపాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు నెలవారీ చెల్లింపుల టెన్షన్‌ ఇప్పుడు రుణ గ్రహీతల్లో గుబులు రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి వేతనం సకాలంలో అందే అవకాశం ఉన్నా, ప్రైవేటు సంస్థల్లో చేసే వారికి, ఇతర వ్యాపారాలు చేసే వారికి మాత్రం వాయిదాల చెల్లింపులు ఎలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. రావాల్సిన డబ్బులు సకాలంలో రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరిని అడిగినా కరోనా ప్రభావం ఉంది కదా, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 80శాతం వ్యక్తుల ఆదాయ, వ్యయాలను కరోనా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, డైలీ వర్కర్ల ఆదాయ వనరులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే రుణాలు, ఈఎంఐల విషయంలో ఒక రకమైన భయాందోళన కనిపిస్తోంది.


21 రోజులంటే చాలా ఇబ్బందే.. 

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ నెమ్మదిగా ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తిండికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా మిగతా విషయాల్లో మాత్రం చాలా మంది ఇబ్బందులకు గురి కావాల్సిందేనని, అలాంటి వారిని ప్రభుత్వం కాపాడే పరిస్థితి ఉంటుందో లేదో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారిలో ఒక్కరే పర్సనల్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డు, హౌసింగ్‌, వెహికిల్‌ లోన్‌ ఇలా రకరకాల రూపంలో రుణాలు తీసుకొని ఉండడంతో ఏమి చేయాలని ఆలోచన మొదలైంది.


ఈ విషయమై ఎవరిని అడిగినా భయాందోళన ఉందని, ప్రభుత్వమే ఏదైనా ఉపశమనం కలిగించేలా  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆర్థిక అంశానికి సంబంధించి కేంద్రం ఏదైనా ప్రకటన ఇస్తే ప్రస్తుత విపత్తు చాలా మందికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు, ఏటీఎంలు, డబ్బు ఉపసంహరణలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్‌ రెగ్యులేషన్‌ ప్రవేశపెట్టబడింది. జూన్‌ వరకు సడలింపు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  తెలిపినా అది ఇంకా వెలువడక పోవడంతో నగరవాసుల్లో వాయిదాల గుబులు ప్రారంభమైంది. 

Updated Date - 2020-03-26T12:56:57+05:30 IST