భారత్‌ వ్యాక్సిన్‌పై భారీ ఆశలు

ABN , First Publish Date - 2020-11-23T07:40:36+05:30 IST

‘మా వ్యాక్సిన్ల ప్రభావశీలత 90 శాతానికి పైనే’ అంటూ అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు చేసిన ప్రకటనతో కొత్త ఆశలు చిగురించాయి. అయితే వాటి భారీ ధరలు, నిల్వకు సంబంధించిన పరిమితుల కారణంగా అమెరికా వంటి ధనిక దేశాలు మినహా మిగతావన్నీ...

భారత్‌ వ్యాక్సిన్‌పై భారీ ఆశలు

  • ‘సీరం’ ఉత్పత్తిపై ప్రపంచ దేశాల ఆసక్తి
  • ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్లకు భారీ ధరల వల్లే
  • ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు త్వరలో అత్యవసర అనుమతులు : వినోద్‌ పాల్‌ 
  • ఆమోదానికి కార్యాచరణ ప్రణాళిక

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌, నవంబరు 22 : ‘మా వ్యాక్సిన్ల ప్రభావశీలత 90 శాతానికి పైనే’ అంటూ అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు చేసిన ప్రకటనతో కొత్త ఆశలు చిగురించాయి. అయితే వాటి భారీ ధరలు, నిల్వకు సంబంధించిన పరిమితుల కారణంగా అమెరికా వంటి ధనిక దేశాలు మినహా మిగతావన్నీ.. వాటి చూపును భారత్‌ వైపు తిప్పుకున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ‘కొవిషీల్డ్‌’ను ఉత్పత్తి చేయనున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వైపు పేద, అభివృద్ధిచెందుతున్న దేశాలు ఇప్పుడు ఆశగా చూస్తున్నాయి. రెండు డోసుల ధర రూ.1000లోపే ఉండటం, 2 నుంచి 8 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత వద్ద సులువుగా నిల్వ చేసే అవకాశం ఉండటంతో ‘కొవిషీల్డ్‌’తో కొవిడ్‌ గండం నుంచి గట్టెక్కాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌లో అనుమతులు లభించగానే, భారత్‌ కూడా దాని ‘అత్యవసర’ వినియోగానికి పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌ వెల్లడించారు. కొవిషీల్డ్‌కు అత్యవసర అనుమతుల కోసం డిసెంబరులో దరఖాస్తు చేసుకుంటామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా ప్రకటించిన రెండురోజుల్లోనే ఈ ప్రకటన వెలువడం గమనార్హం. 


వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌ నియమావళి కీలకం

వ్యాక్సిన్లకు ‘అత్యవసర’ అనుమతులు ఇచ్చే విషయమై ఎలాంటి విధానాన్ని అనుసరించాలి ? వాటి కొనుగోలు, పంపిణీ ఎలా చేయాలి ?  అనే అంశాలపై భారత ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. అత్యవసర వినియోగం కోసం వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన నియమావళిని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఏర్పాటుచేసిన ‘కరోనా వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌’ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా వ్యాక్సిన్ల అడ్వాన్స్‌ మార్కెట్‌ కమిట్‌మెంట్‌ (ఏఎంసీ), వ్యాక్సిన్ల ధర అంశాలకు సంబంధించిన నియమావళి రూపకల్పనకు కరోనా వ్యాక్సిన్లపై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం (ఎన్‌ఈజీవీఏసీ) నేతృ త్వం వహించనుందని అంటున్నారు. ఇటీవల నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌పాల్‌, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కె.విజయ్‌రాఘవన్‌, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌లతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయం జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రయోగ పరీక్షల దశల్లో ఉన్న వ్యాక్సిన్ల ప్రభావశీలత, భద్రతలపై చర్చించేందుకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ‘వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌’ నిపుణులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు ఎప్పుడు ఇవ్వాలి ? ఎలా ఇవ్వాలి ? అనే అంశంపై ఆ భేటీలో ప్రధాన చర్చ జరగొచ్చు. వ్యాక్సిన్లకు అనుమతులు, అత్యవసర అనుమతులు ఇచ్చే విషయంలో నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ), కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ)లు పాటించాల్సిన విధివిధానాలు, నిర్వర్తించాల్సిన పాత్రలపైనా స్పష్టత ఇవ్వనున్నారు.  


మోడెర్నా వ్యాక్సిన్‌ డోసు ధర రూ.1855 - 2755

అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ కరోనా వ్యాక్సిన్‌ డోసు ధర రూ.1855 (25 డాలర్లు) నుంచి రూ.2755 (37 డాలర్లు) మధ్యలో ఉండనుంది. ఆయా దేశాల నుంచి వచ్చే ఆర్డర్లను బట్టి ధరను నిర్ణయిస్తామని ఆ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) స్టీఫెన్‌ బాన్సెల్‌ వెల్లడించారు. యూరోపియన్‌ యూనియన్‌లోని దేశాల కోసం రూ.1855 కంటే తక్కువ ధరకే లక్షలాది డోసులను కొనేందుకు మోడెర్నాతో చర్చలు జరుపుతున్నట్లు ఈయూ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇది రెండు డోసుల వ్యాక్సిన్‌ అనే విషయం తెలిసిందే. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరోనా చికిత్సకు వాడిన యాంటీబాడీ ఔషధం(రీజెన్‌- సీఓవీ2)అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ పచ్చజెండా ఊపింది.


రేపు రాష్ట్రాలతో ప్రధాని భేటీ

దేశంలో కొవిడ్‌ పరిస్థితి, వ్యాక్సిన్‌ పంపిణీపై ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రాలతో వర్చువల్‌ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం రెండు దశలుగా జరగవచ్చు. వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాలతో తొలి భేటీ జరుగుతుంది. అక్కడ తీసుకుంటున్న చర్యలను ప్రధాని సమీక్షిస్తారు. ఇక వ్యాక్సిన్‌ పంపిణీ వ్యూహంపై మిగిలిన అన్ని రాష్ట్రాలతో భేటీ ఉండొచ్చు. కాగా, ‘‘ముందస్తు ప్రణాళిక లేని లాక్‌డౌన్లతో కేంద్రం ప్రజల్ని పేదరికంలోకి నెట్టింది. వారి ఆరోగ్యంతో రాజీ పడింది’’ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. 


కోవ్యాక్సిన్‌ ప్రభావశీలత 60 శాతం భారత్‌ బయోటెక్‌

కోవ్యాక్సిన్‌ ప్రభావశీలత 60 శాతం దాకా ఉండొచ్చని హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అమెరికా ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ), భారత ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)లు నిర్దేశించిన 50 శాతం ప్రభావశీలత పరిమితి కంటే ఇది ఎక్కువేనని తెలిపింది. ఈ లెక్కన శ్వాసకోశ వ్యాధుల వ్యాక్సిన్లకు నియంత్రణ సంస్థల అనుమతులు లభించేందుకు 50 శాతం ప్రభావశీలత సరిపోతుందని ఆ కంపెనీ క్వాలిటీ ఆపరేషన్స్‌ విభాగం ప్రెసిడెంట్‌ సాయి.డి. ప్రసాద్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రయోగ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రభావశీలతపై ఈ అంచనాకు వచ్చినట్లు స్పష్టంచేశారు. 


Updated Date - 2020-11-23T07:40:36+05:30 IST